
సాక్షి, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ ఘటనకు ప్రేమ వివాహమే కారణమని స్థానికులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే... వెంటకంపల్లికి చెందిన హరీష్ (23 ), రచన (21 ) నెల రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే రచన మేనమామలు... నాగరాజు, శేఖర్, అశోక్ ... తమను కాదని ప్రేమ వివాహం చేసుకుందని ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. ఈరోజు సాయంత్రం దంపతులపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. అలాగే జంట వివాహానికి సహకరించిన వేములవాడ మండలం మారుపాకకు చెందినా మల్లేశంను సైతం చంపే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు మల్లేశంను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.