ఎల్.రమణకు టీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో టీఆర్‌ఎస్ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తోందని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా తెగించి కొట్లాడుతామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఘట్‌కేసర్ మున్సిపాలిటీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. నదీ జలాల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని అన్నారు.
మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌పై ప్రజల విశ్వాసం వల్లే గెలుపు సాధ్యమైందన్నారు. గతంలో జీవో 58, 59 తరహాలో జవహర్‌నగర్‌లో ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కొందరికి పదవులు దొరకగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేటీఆర్ సమక్షంలో సోమవా రం టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో జవహర్‌నగర్ ము న్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు బల్లి శ్రీనివాస్, కూతడి సాయి, జమలాపూర్ నవీన్, చింతల ప్రేమ ల శ్రీనివాస్ ఉన్నారు. వీరితో పాటు ఘట్‌కేసర్ ము న్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు అనురాధ రాఘవరెడ్డి, రాజ్‌పుత్ పూజా భరత్‌సింగ్, సింగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. శామీర్‌పేటకు చెందిన ఎంపీటీసీ సభ్యులు సింగిరెడ్డి ఇందిర, మౌనిక శివ వీరప్రసాద్, కోడూరు అశోక్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.
టీఆర్‌ఎస్‌లోకి శ్రీశైల్‌రెడ్డి
ఈనెల 16న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు టీజేఎస్ సీనియర్ నాయకుడు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు శ్రీశైల్‌రెడ్డి పంజుగుల తెలిపారు. సోమవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు.
ఎల్.రమణకు టీఆర్‌ఎస్ సభ్యత్వం
ఇటీవల టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ సోమవారం తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రమణకు టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో అధికారికంగా చేరేందుకు రమణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన రమణకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రుల నివాస సముదాయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌తో ఎల్.రమణ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. ఎల్.రమణతో పాటు పార్టీలో చేరే టీటీడీపీ నేతల ఎవరెవరనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ‘తెలంగాణ సమగ్రాభివృద్ధి, బడుగుబలహీన వర్గాల కోసం కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నా. ప్రజల కోసం కేసీఆర్‌తో కలసి పనిచేస్తా’అని ఎల్.రమణ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment