వెల్లడిస్తున్న డీఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్, నిందితులు
ప్రకాశం, చీరాల రూరల్: కబడ్డీ ఆటలో జాతీయ స్థాయిలో రాణిస్తుండటమే అతను చేసిన నేరం, దానికి తోడు పాత కక్షలు తోడు కావడంతో మద్యం మత్తులో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కబడ్డీ క్రీడాకురుడు నరేష్‌ది హత్యగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బుధవారం కొత్తపేటలోని తన కార్యాలయంలో డీఎస్పీ ప్రేమ్‌కాజల్ నిందితుల వివరాలను, హత్యకు దారితీసిన పరిస్థితులను వెల్లడించారు.
చినగంజాం మండలం కడవకుదురు గ్రామానికి చెందిన టంగుటూరి నరేష్‌కు అదే గ్రామానికి చెందిన బత్తిన పున్నయ్య, బత్తిన చిన్న సుబ్బారావు, పేరాబత్తుల రామకృష్ణ, కేశన సుబ్బయ్య, పాల కేంద్రం రామయ్య, బత్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్, సోమిశెట్టి సుబ్బారావు, బత్తిన శ్రీరాం, బత్తిన చైతన్య, బత్తిన చిరంజీవితో కబడ్డీ ఆట విషయంలో మాటామాటా పెరిగింది. దీనికి తోడు పాత కక్షలు కూడా మనసులో ఉండటంతో ఈ నెల 8వ తేదీ రాత్రి వివాదం జరిగింది. నిందితులంతా మద్యం సేవించి నరేష్‌ను బూతులు తిట్టి కొట్టి గాయపరచడంతో స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అందరూ కలిసి నరేష్‌ను రెండు బైకుల సాయంతో సమీపంలోని పాలపర్తి వెంకటేశ్వర్లుకు చెందిన జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి మెడకు తాడు బిగించి హత్య చేశారు.
ఆత్మ హత్యగా చిత్రీకరణ
అమానుషంగా నరేష్‌ను అంతమొందించిన నిందితులు జామాయిల్ తోటలోని ఒక చెట్టుకు లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారు. యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. తన భర్తను ఎవరో హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని భార్య సంధ్య చినగంజాం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్ ఆధ్వర్యంలో ఇంకొల్లు సీఐ శేషగిరిరావు, చినగంజాం ఎస్సై వెంకటేశ్వర్లు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు కడవకుదురు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉండగా అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన లుంగీతో పాటు నైలాన్ తాడు, కర్రలు, ఇనుప చువ్వ, రెండు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండుకు తరలించారు.
కసి పెంచుకొని..
మృతుడు నరేష్ నిందితులకు చెందిన భార్యలను బూతులు తిడుతుంటాడని, కబడ్డీ ఆట విషయంలో తన అంతటి వాడులేడని నరేష్ చెబుతుండటంతో జీర్ణించుకోలేని హత్యకు పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు. అందరిపై రౌడీషీట్లు ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఇంకొల్లు సీఐ శేషగిరిరావు, చినగంజాం ఎస్సై వెంకటేశ్వర్లు, ఎస్సై అజయ్ కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
ఉధృత ఆందోళనలు
నరేష్ కాళ్లు భూమికి ఆనుకుని ఉండటంతో బంధువులు ఆందోళన చేపట్టారు. వారికి తోడు నాయీ బ్రాహ్మణ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు కూడా వారికి తోడవ్వడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. నరేష్ హత్యను నిరసిస్తూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల నగదుతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment