సాక్షి, తాళ్లూరు(ప్రకాశం) : భార్యపై అనుమానం పెంచుకున్న ప్రబుద్ధుడు ఆమె తలను గోడకేసి కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని తూర్పుగంగవరంలో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నగళ్ల అంజయ్య, రాణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె నాగరత్నా (28)న్ని దొనకొండ మండలం పెద్దన్నపాలేనికి చెందిన కండె పెద పుల్లయ్య కుమారుడు పుల్లయ్యకు ఇచ్చి 11 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారు నాలుగేళ్లు స్వగ్రామంలోనే ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం తూర్పుగంగవరం అత్త గారింటికి కాపురం వచ్చారు. వారికి కుమారుడు మధుశివ, కుమార్తె కావ్య ఉన్నారు. పుల్లయ్య గ్రామంలో ముఠా పనిచేసి జీవిస్తుంటాడు. నాగరత్నం కూలి పనులకు వెళ్తుంటోంది.
నిత్యం వివాదాలే
ముఠా పనిచేసే పుల్లయ్య మితభాషి. ఎవరితో పెద్దగా మాట్లాడే కాదు. కొన్నాళ్లుగా భార్యపై అనుమానంతో నిత్యం మద్యం తాగి వచ్చి ఇంట్లో భార్యతో ఘర్షణ పడుతున్నాడు. కుమారుడు మధుశివ (10), కుమార్తె కావ్య (8) కూడా తండ్రి చేష్టలకు బాధపడేవారు. భార్యపై అనుమానం రోజురోజుకూ పెరిగి పోవడంతో ఆమెను ఎలాగైనా తుదముట్టించాలని కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అవకాశం చిక్కినప్పుడల్లా ఆమెను చిత్ర హింసలు పెట్టేవాడు. ఈ నేపథ్యంలో నాగరత్నం నిద్రించేందుకు శుక్రవారం అర్ధరాత్రి మిద్దెపైకి వెళ్లింది.
అర్ధరాత్రి వరకు మద్యం తాగి వీధుల్లో తిరిగి వచ్చిన భర్త పుల్లయ్య నేరుగా మిద్దెపైకి వెళ్లాడు. ఆ సమయంలో భార్య ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో ఉన్నట్లు అనుమానించాడు. నాగరత్నంపై దాడి చేసి ఆమె తలను స్లాబు కేసి బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన నాగరత్నం అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మిద్దెపై నుంచి నిందితుడు కిందకు వచ్చి మృతురాలి తల్లి రాణిని నిద్ర లేపి మీ కుమార్తెను చంపాను..పోయి చూసుకో..అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఇరుగు పొరుగు బంధువులకు విషయం తెలపగా వారు ఎస్‌ఐ వై.నాగరాజుకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని దర్శి డీఎస్పీ ప్రకాశ్‌రావు, సీఐ ఎండీ మొయిన్‌లు శనివారం ఉదయం పరిశీలించి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు వచ్చి ఆధారాలు సేకరించాయి. ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేయగా సీఐ ఎండీ మొయిన్ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment