talluru
-
కోవిడ్ దెబ్బ; చేదెక్కిన చెరకు!
అందరికీ తీపిని పంచే చెరకు రైతన్న చేదును చవిచూస్తున్నాడు. కోవిడ్ దెబ్బకు కుదేలై విలవిల్లాడుతున్నాడు. కనీసం పెట్టుబడి ఖర్చులు రావడం కూడా కష్టంగా మారడంతో నష్టాలకు గురవుతున్నాడు. చెరకు పంట ఏపుగా పెరిగినా మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో బావురుమంటున్నాడు. ఆశగా తయారు చేసిన బెల్లం బుట్టలు అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. కోవిడ్ పరిస్థితుల నుంచి కోలుకునే కాలం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. తాళ్లూరు: కరోనా ప్రభావానికి అల్లకల్లోలంగా మారిన అనేక రకాల మార్కెట్లలో బెల్లం మార్కెట్ కూడా ఉంది. ఆ ప్రభావం చెరకు రైతుపై తీవ్రంగా పడింది. గతంలో ఎన్నడూ తలెత్తని దుర్భర పరిస్థితుల్లోకి వారిని నెట్టేసింది. అమ్ముడుపోని బెల్లం బుట్టలతో పాటు నష్టాలను కూడా మూటగడుతోంది. ప్రకాశం జిల్లాలో సుమారు 3,000 ఎకరాల్లో చెరకు సాగవుతోంది. అందులో అధికంగా 1500 ఎకరాల వరకు తాళ్లూరు మండలంలో సాగవుతోంది. చెరకును బెల్లంగా మార్చేందుకు తాళ్లూరు ప్రాంతంలో ప్రత్యేకంగా బట్టీలు కూడా ఉన్నాయి. సుమారు 15 నుంచి 20 వరకు ఉన్న బట్టీల ద్వారా బెల్లం తయారు చేసి బుట్టల్లో అమర్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. స్థానికంగా కూడా మార్కెట్ చేసుకుంటారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా కూలీలు వస్తుంటారు. వారికి రోజుకు రూ.500కుపైగా కూలి ఇస్తుంటారు. అయితే, కోవిడ్ కారణంగా ప్రస్తుతం బెల్లం మార్కెట్ బాగా పడిపోయింది. ఎగుమతులు సైతం నిలిచిపోయాయి. తయారు చేసిన బెల్లం నిల్వలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. ఫలితంగా రైతులు సాగుచేసిన చెరకుతో పెద్దగా పనిలేకుండా పోయింది. ఆ రైతులంతా నష్టాల బాట పట్టారు. ఖర్చు ఎక్కువ.. మిగిలేది తక్కువ..! తాళ్లూరు పరిసర ప్రాంతాల్లో 33 ఏళ్లుగా చెరకు పంట సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఎకరా పొలంలో చెరకు సాగుచేసేందుకు రూ.లక్ష వరకూ ఖర్చవుతోంది. ఎకరాకు మూడు టన్నుల బెల్లం ఉత్పత్తవుతుంది. కోవిడ్ కారణంగా బెల్లం విక్రయాలు తగ్గడంతో ధర కూడా తగ్గింది. కేజీ రూ.36 మాత్రమే ఉంది. దాని ప్రకారం ఎకరా చెరకుతో తయారు చేసిన బెల్లం విక్రయిస్తే రాబడి రూ.1.08 లక్షలే ఉంది. అంటే.. ఎకరాకు రూ.8 వేలు మాత్రమే మిగులుదల ఉంది. చెరకు సాగు నుంచి బెల్లం తయారు చేయడం, మార్కెట్ చేసుకోవడం వరకూ అష్టకష్టాలుపడితే కనీసం పది వేలు కూడా మిగలడం గగనంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో బెల్లం తయారీ వ్యయం తక్కువ కాగా, ఆదాయం ఆశాజనకంగా ఉండేదని, ఇప్పుడు ఖర్చులు పెరగడంతో పాటు మార్కెట్లో బెల్లం ధరలు తగ్గడం, విక్రయాలపై కరోనా కాటేయడం వలన నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి కోవిడ్ వలన బెల్లం వాడకం, అమ్మకం తగ్గి పెట్టుబడులు కూడా రావడం లేదు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. తాళ్లూరు ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీ నెలకొల్పి చెరకు రైతులను గట్టెక్కించాలి. లేకుంటే కోలుకోలేము. – లింగారెడ్డి, రైతు, తాళ్లూరు చీడపీడలతో చెరకు రైతుకు వెతలు బల్లికురవ: జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో సాగుచేసిన చెరకు పంటను చీడపీడలు ఆశించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. బల్లికురవ, అద్దంకి మండలాల్లో తిరునాళ్లు, ఉత్సవాల్లో అమ్మే నల్ల చెరకును జూన్ మొదటి వారం నుంచి సాగుచేస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది సాగుచేసిన నెల రోజుల చెరకు పంటను చీడపీడలు ఆశించాయి. బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు, వైదన, రామాంజనేయపురం, ఎస్ఎల్ గుడిపాడు, అంబడిపూడి, అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం, సాధునగర్, చక్రాయపాలెంలో ఇప్పటికే సుమారు 55 ఎకరాల్లో సాగు చేసిన పంటకు నెలరోజులు పూర్తయింది. ప్రస్తుతం మరో 50 ఎకరాల్లో సాగు చేసేందుకు బల్లికురవ మండలంలోని రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో పీక పురుగు, ఎర్రనల్లి ఉధృతంగా పంటపై దాడిచేశాయి. పంటంతా ఎండిపోతుండటంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి తలెత్తలేదని రైతులు గొల్లుమంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు స్పందించి చీడపీడల నివారణకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు. కార్బాపైరాన్ గుళికలు వేసుకోవాలి వర్షాధార పంటను పీకపురుగు ఆశిస్తుంది. పైరు పిలకలు వేసే దశలో మొవ్వలోకి చేరి తినడం వలన ఎండిపోతోంది. పీకపురుగు ఆశించకుండా గడల ముక్కలు నాటే ముందు ఎకరాకు 12 నుంచి 13 కేజీలు కార్బాపైరాన్ గుళికలను చాళ్లలో వేసుకోవాలి. పైరు నెలరోజుల దశలో ఉన్నందున కోరాజన్ 0.3 మిల్లీలీటరును లీటరు నీటికి కలిపి మొవ్వ పూర్తిగా తడిసేలా ఐదు రోజులకోసారి పిచికారీ చేసుకోవాలి. – ఎస్వీపీ కుమారి, వ్యవసాయాధికారిణి, బల్లికురవ -
అత్తా ! నీ కూతుర్ని చంపా.. పోయి చూసుకో
సాక్షి, తాళ్లూరు(ప్రకాశం) : భార్యపై అనుమానం పెంచుకున్న ప్రబుద్ధుడు ఆమె తలను గోడకేసి కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని తూర్పుగంగవరంలో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నగళ్ల అంజయ్య, రాణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె నాగరత్నా (28)న్ని దొనకొండ మండలం పెద్దన్నపాలేనికి చెందిన కండె పెద పుల్లయ్య కుమారుడు పుల్లయ్యకు ఇచ్చి 11 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారు నాలుగేళ్లు స్వగ్రామంలోనే ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం తూర్పుగంగవరం అత్త గారింటికి కాపురం వచ్చారు. వారికి కుమారుడు మధుశివ, కుమార్తె కావ్య ఉన్నారు. పుల్లయ్య గ్రామంలో ముఠా పనిచేసి జీవిస్తుంటాడు. నాగరత్నం కూలి పనులకు వెళ్తుంటోంది. నిత్యం వివాదాలే ముఠా పనిచేసే పుల్లయ్య మితభాషి. ఎవరితో పెద్దగా మాట్లాడే కాదు. కొన్నాళ్లుగా భార్యపై అనుమానంతో నిత్యం మద్యం తాగి వచ్చి ఇంట్లో భార్యతో ఘర్షణ పడుతున్నాడు. కుమారుడు మధుశివ (10), కుమార్తె కావ్య (8) కూడా తండ్రి చేష్టలకు బాధపడేవారు. భార్యపై అనుమానం రోజురోజుకూ పెరిగి పోవడంతో ఆమెను ఎలాగైనా తుదముట్టించాలని కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అవకాశం చిక్కినప్పుడల్లా ఆమెను చిత్ర హింసలు పెట్టేవాడు. ఈ నేపథ్యంలో నాగరత్నం నిద్రించేందుకు శుక్రవారం అర్ధరాత్రి మిద్దెపైకి వెళ్లింది. అర్ధరాత్రి వరకు మద్యం తాగి వీధుల్లో తిరిగి వచ్చిన భర్త పుల్లయ్య నేరుగా మిద్దెపైకి వెళ్లాడు. ఆ సమయంలో భార్య ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో ఉన్నట్లు అనుమానించాడు. నాగరత్నంపై దాడి చేసి ఆమె తలను స్లాబు కేసి బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన నాగరత్నం అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మిద్దెపై నుంచి నిందితుడు కిందకు వచ్చి మృతురాలి తల్లి రాణిని నిద్ర లేపి మీ కుమార్తెను చంపాను..పోయి చూసుకో..అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఇరుగు పొరుగు బంధువులకు విషయం తెలపగా వారు ఎస్ఐ వై.నాగరాజుకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని దర్శి డీఎస్పీ ప్రకాశ్‌రావు, సీఐ ఎండీ మొయిన్‌లు శనివారం ఉదయం పరిశీలించి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు వచ్చి ఆధారాలు సేకరించాయి. ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేయగా సీఐ ఎండీ మొయిన్ దర్యాప్తు చేస్తున్నారు. -
చట్టాలు కొందరికేనా?
తాళ్లూరు: సమాజంతో పాటు సమానంగా పరిగెత్తలేకపోయినా అవమానాలు భరించి.. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వికలాంగుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల పోరాటం అనంతరం భారత ప్రభుత్వం పీడబ్లూడీ యాక్ట్-1995 విడుదల చేసింది. దీని ప్రకారం వికలాంగుల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి. అయితే అప్పటికీ ఎలాంటి కదలిక లేకపోవడంతో ప్రభుత్వ శాఖల్లోని వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ‘ ఆసియన్ పసిఫిక్ ఒప్పదం 1993- 2002’ ఏర్పడింది. దీనిని కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన డీఏఈడబ్ల్యూఎస్ (వికలాంగుల సంఘం) పోరాటం చేయడంతో.. ఆంధ్రప్రదేశ్ 2011 అక్టోబర్ 19న జీఓ నంబర్ 42 విడుదల చేసింది. దీని ప్రకారం వికలాంగుల ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లలో 3శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఇంత చేసినా.. సాధించుకున్న జీఓ కూడా బుట్ట దాఖలే అయింది. దీనివల్ల రాష్ట్రంలో 2వేల మంది ఉద్యోగులు నష్టపోతుండగా.. జిల్లాలో వందమంది దాకా లబ్ధి పొందలేకపోతున్నారు. ఏబీసీడీ వర్గాలకూ ఓకే.. వికలాంగులు సమస్యలపై కొంతమంది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. 4 ఆగస్టు 2010న వికలాంగ రిజర్వేషన్లను ఏబీసీడీ వర్గాలకు కూడా ఇవ్వాలంటూ తీర్పు (డబ్ల్యూపీసీ 2821/2011) ఇచ్చింది. మూడు నెలల్లో అమలు చేయాలంటూ ఆదేశించింది. దీనిపై సుప్రీం కోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటీషన్ వేయగా అక్కడ కూడా సానుకూలంగానే తీర్పు లభించింది. ఇదిలా ఉంటే ముంబై, ఒడిస్సా హైకోర్టుల తీర్పుల అనంతరం ఆయా రాష్ట్రాల్లో వికలాంగ ఉద్యోగులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కూడా వికలాంగులకు సానుకూలంగా 2013 మార్చి 5న తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ఏడాది జూలై 14న ప్రభుత్వం జీఓ నంబర్ 2593 విడుదల చేసింది. కోర్టుకు విన్నవించుకున్న వికలాంగ ఉద్యోగులకు తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు మొదలు కాలేదు. ప్రొమోషన్లు లేకుండా రిటైర్డ్ అవుతున్నారు: హనుమంతరావు: ఏఈ, పీఆర్, యూనియన్ రాష్ట్ర సెక్రటరీ ప్రమోషన్లు, బదిలీల విషయంలో వికలాంగ ఉద్యోగులకు దశాబ్ద కాలంగా అన్యాయం జరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కోర్టుల ఆదేశాల మేరకు న్యాయం చేస్తున్నారు. ఇక్కడ హైకోర్టు కూడా స్పందించింది. ఆ తర్వాత రెండు జీఓలు వచ్చాయి. కానీ వాటిని అమలు చేయటంలో ఉన్నతాధికారులు అలసత్వం వహిస్తున్నారు. ప్రమోషన్లు లేకుండా రిటైర్డు అవ్వాల్సి వస్తోంది. -
1993లో ఓ స్థలం
తాళ్లూరు: మండలం కేంద్రంలో నిరుపేదలకు కేటాయించిన నివాస స్థలాలకు పొజిషన్ చూపడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. 1993లో తాళ్లూరు గ్రామానికి దక్షణంవైపున ఉన్న సర్వే నెం.294/2లో ఎనిమిది ఎకరాలు 300 మంది నిరుపేదలకు పంపిణీ చేశారు. 1996లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ స్థలాల్లో ఇంటిని నిర్మించుకోవాలని లబ్ధిదారులకు ఒక లేఖ కూడా పంపారు. అధికారులు మాత్రం పొలాన్ని సబ్ డివిజన్‌గా విడగొట్టి నేటికీ పొజిషన్ చూపించలేదు. ఇదిలా ఉండగా 2010 సెప్టెంబర్‌లో మోడల్ పాఠశాల నిర్మాణానికి రెవెన్యూ అధికారులు పేదలకు కేటాయించిన సర్వే నెం.294/2లో భూమి అనుకూలంగా ఉందని గ్రహించి పట్టాలు రద్దుచేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన లబ్ధిదారులు ఈ సర్వే నంబర్లో మొత్తం 13 ఎకరాలున్నాయని, పేదలకు పంపిణీ చేయగా మిగిలిన స్థలాన్ని మోడల్ స్కూల్‌కు మంజూరుచేయాలని సూచించారు. కాని ఆదిశగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూశాఖ స్పందించి పంపిణీ చేసిన పట్టాలకు పొజిషన్ చూపాలను లబ్ధిదారులు కోరుతున్నారు. దీనిపై తహశీల్దార్ ఇంద్రాదేవి మాట్లాడుతూ నిరుపేదలకు పట్టాలు ఇచ్చినట్లు, వాటిని రద్దు చేస్తూ నోటీసులు జారీ అయినట్టు తెలిసిందన్నారు. నేను బాధ్యతలు తీసుకుని 47 రోజులు మాత్రమే అయ్యింది, పూర్తిగా అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. -
బాధపెడుతున్న ‘బయోమెట్రిక్’!
తాళ్లూరు, న్యూస్‌లైన్ : సామాజిక పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రవేశ పెట్టిన బయోమెట్రిక్ విధానం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. కొందరు వృద్ధ లబ్ధిదారుల వేలి ముద్రలు సరిపోలక వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేతివేలి ముద్రలు అరిగిపోయిన వృద్ధుల అవస్థ వర్ణనాతీతంగా ఉంది. ఇప్పటికే మూడు నెలల నుంచి పింఛన్లు అందుకోలేక పోవడంతో ఇకపై పింఛన్ వస్తుందో రాదో అన్న ఆందోళన వారిలో నెలకొంది. దర్శి నియోజకవర్గంలో దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో మొత్తం 21,222 మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అందులో 1805 మంది లబ్ధిదారులకు పింఛన్ నగదు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒక్కొక్క పంచాయతీకిఒక్కొక్క ఫినో సంస్థ కో-ఆర్డినేటర్ ఉండి పింఛన్ల నగదును పంచేవారు. ప్రస్తుతం పోస్టాఫీసులకు అనుసంధానం చేయడంతో పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముండ్లమూరు మండలం వేములలోని పోస్టాఫీసు నుంచి పింఛన్ సొమ్ము తీసుకోవాలంటే వేముల బండకు చెందిన వృద్ధులు 4 కిలోమీటర్ల మేర నడిచివెళ్లలేక నరకయాతన పడుతున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోక పోతే రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో పింఛనుదారులు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద అర్జీలు పెట్టుకునేందుకు వెళుతున్నారు. అక్కడ కూడా సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. -
ఎవరికోసం ఈ వా(ట)ర్?
తాళ్లూరు, న్యూస్‌లైన్: ఆర్డబ్ల్యూఎస్.. విద్యుత్ శాఖ మధ్య సమన్వయ లోపం 31 గ్రామాలకు నీరు లేకుండా చేస్తోంది. దివంగత నేత వైఎస్ సహకారంతో రామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద *9 కోట్లతో మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. దీని ద్వారా తాళ్లూరు మండలంలోని 26 గ్రామాలతో పాటు దర్శి మండలంలోని నాలుగు, ముండ్లమూరు మండలంలోని ఓ గ్రామానికి పైప్లైన్లు నిర్మించారు. 2012 ఏప్రిల్ నుంచి ప్రాజెక్టు ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. అయితే నీటి పథకానికి సంబంధించిన విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఉప్పలపాడు సబ్‌స్టేషన్ ఏఈ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఐదు రోజులుగా నీటి సరఫరా జరగక జనం తిప్పలు పడుతున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ డీఈ కొండయ్యను వివరణ కోరగా విద్యుత్ శాఖ.. అధిక మొత్తంలో బిల్లులు వేస్తోందని ఆరోపించారు. పథకానికి 70 హెచ్‌పీ మోటార్లను మాత్రమే ఏర్పాటు చేశామని.. దీనికి నెలకు *70 వేల లోపు మాత్రమే బిల్లు రావాల్సి ఉంటుందని చెప్పారు. అయితే నెలకు * 2లక్షల వరకు బిల్లు వస్తోందని తెలిపారు. బిల్లులు కట్టాలని ఒత్తిడి తెస్తూ.. కనెక్షన్ తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బడ్జెట్ మంజూరయిన సమయంలో మాత్రమే బిల్లులు చెల్లించగలమన్నారు. తాగు నీటి పథకాలకు విద్యుత్ తొలగించకూడదని కలెక్టర్ ఆదేశాలున్నప్పటికీ నిబంధనలు అతిక్రమించడం విడ్డూరంగా ఉందన్నారు. హార్స్ పవర్‌ను బట్టి బిల్లులు వేయాలే తప్ప.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం పద్ధతి కాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇదే విషయంపై విద్యుత్ అధికారుల వివరణ కోసం ప్రయత్నించగా వారు స్పందించలేదు.