తాళ్లూరు, న్యూస్‌లైన్ : సామాజిక పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రవేశ పెట్టిన బయోమెట్రిక్ విధానం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. కొందరు వృద్ధ లబ్ధిదారుల వేలి ముద్రలు సరిపోలక వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేతివేలి ముద్రలు అరిగిపోయిన వృద్ధుల అవస్థ వర్ణనాతీతంగా ఉంది. ఇప్పటికే మూడు నెలల నుంచి పింఛన్లు అందుకోలేక పోవడంతో ఇకపై పింఛన్ వస్తుందో రాదో అన్న ఆందోళన వారిలో నెలకొంది. దర్శి నియోజకవర్గంలో దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో మొత్తం 21,222 మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు.
అందులో 1805 మంది లబ్ధిదారులకు పింఛన్ నగదు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒక్కొక్క పంచాయతీకిఒక్కొక్క ఫినో సంస్థ కో-ఆర్డినేటర్ ఉండి పింఛన్ల నగదును పంచేవారు. ప్రస్తుతం పోస్టాఫీసులకు అనుసంధానం చేయడంతో పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముండ్లమూరు మండలం వేములలోని పోస్టాఫీసు నుంచి పింఛన్ సొమ్ము తీసుకోవాలంటే వేముల బండకు చెందిన వృద్ధులు 4 కిలోమీటర్ల మేర నడిచివెళ్లలేక నరకయాతన పడుతున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోక పోతే రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో పింఛనుదారులు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద అర్జీలు పెట్టుకునేందుకు వెళుతున్నారు. అక్కడ కూడా సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.
బాధపెడుతున్న ‘బయోమెట్రిక్’!
Published Thu, May 22 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement