Bio-metric system
-
హాస్టళ్లలో అక్రమాలకు చెక్
- ఎస్సీ హెచ్‌డబ్ల్యూఓలకు ల్యాప్‌టాప్‌లు - బయో మెట్రిక్ విధానంతో హాజరు నమోదు - ఆన్లైన్లో విద్యార్థుల, సామగ్రి వివరాలు - స్థానికంగా ఉండని వార్డెన్లకు తప్పని ఇక్కట్లు కర్నూలు(అర్బన్): జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ల్యాప్‌టాప్, మిషన్లు పంపిణీ చేసింది. ఆయా వసతి గృహాల్లో ఎన్ని కేజీల బియ్యం, కందిపప్పు, కూరగాయలు తదితర నిత్యావసర సరుకులు వినియోగించారనే విషయాలను నిత్యం హాస్టల్ వార్డెన్లు ల్యాప్‌టాప్ ద్వారా హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంది. అలాగే ఇక నుంచి ప్రతిరోజు బయోమెట్రిక్ విధానం ద్వారా విద్యార్థుల, హాస్టల్ వార్డెన్ వేలి ముద్రలతో హాజరును నమోదు చేసి ఆన్లైన్ చేయాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ వల్ల జిల్లాలోని 102 ఎస్సీ వసతి గృహాల్లో దాదాపు 10 వేలకు పైగా విద్యార్థుల, వార్డెన్ల సమగ్ర సమాచారం ఆన్లైన్లో నిక్షిప్తం కానున్నాయి. అన్ని వివరాలు ఆన్లైన్లోనే.. ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన దుప్పట్లు, కార్పెట్లు, దుస్తులు, నోటు పుస్తకాలు, ట్రంకు పెట్టెలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే వివరాలను కూడా ఆన్లైన్లో నమోదు చేయాల్సి వుంది. విద్యార్థులకు ఇచ్చిన వస్తువుల ఫొటోలను కూడా ఉన్నతాధికారులకు ఆన్లైన్లో పంపాల్సి వుంది. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతమంది విద్యార్థులు వసతి గృహంలో ఉన్నారు? ఎంత మంది గైర్హాజరయ్యారు? విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, టిఫెన్ అందిస్తున్నారా? లేదా? వార్డెన్ స్థానికంగా ఉంటున్నారా, లేదా, అనే వివరాలు బయోమెట్రిక్ విధానం ద్వారా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు క్షణాల్లో తెలిసే అవకాశం ఏర్పడింది. స్థానికంగా ఉండని వార్డెన్లకు ఇబ్బందులే.. బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో స్థానికంగా ఉండని వార్డెన్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలోని పలు వసతి గృహాలకు చెందిన వార్డెన్లు స్థానికంగా ఉండకుండా వంట మనుషులు, వాచ్మెన్లకు బాధ్యతలు అప్పగించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం హాస్టల్ వార్డెన్లకు ల్యాప్‌టాప్‌లు, బయో మెట్రిక్ మిషన్లను పంపిణీ చేసిన నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థులతో పాటు వార్డెన్లు కూడా వేలి గుర్తులు వేయాల్సి ఉంటుంది. దీంతో వార్డెన్లు స్థానికంగా ఉండక తప్పదు. జిల్లాకు 71 ల్యాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ మిషన్లు.. జిల్లాలో మొత్తం 102 ప్రీమెట్రిక్ వసతి గృహాలు ఉండగా, ప్రస్తుతం 80 మంది విద్యార్థుల కంటే తక్కువ సంఖ్య ఉన్న 31 వసతి గృహాలను మినహాయించి మిగిలిన 71 వసతి గృహాలకు సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ల్యాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ మిషన్లను సరఫరా చేశారు. వీటిని ఆయా సహాయ సంక్షేమాధికారి కార్యాలయాల నుంచి వార్డెన్లు తీసుకువెళ్లే పనిలో ఉన్నారు. ల్యాప్‌టాప్‌లను సరఫరా చేసిన కంపెనీకి చెందిన ప్రతినిధులే జిల్లాకు వచ్చి ల్యాప్‌టాప్, బయోమెట్రిక్ మిషన్ల వినియోగానికి సంబంధించి అవగాహన కల్పిస్తున్నారు. -
ఐదున్నర లక్షల పెన్షన్ల నిలిపివేత
బయోమెట్రిక్ నమోదుకు రాని పెన్షనర్లు అవి బోగస్ పెన్షన్లే అని భావిస్తున్న అధికారులు ఈ లెక్కలన్నీ తేలాకే పెంపుపై సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐదున్నర లక్షల మందికి పెన్షన్లు నిలిపివేశారు. పెన్షన్లు తీసుకునే వారు విధిగా బయోమెట్రిక్ విధానంలో తమ చేతివేలి గుర్తులను నమోదు చేసుకోవాల్సిందేనని గ్రామీణాభివృద్ధి శాఖలోని ‘సెర్ప్’ అధికారవర్గాలు స్పష్టం చేశాయి. బయోమెట్రిక్ విధానంలో బొటనవేలి గుర్తు ఇవ్వడానికి లక్షల సంఖ్యలో పెన్షనర్లు ముందుకు రావడం లేదని, నగరాల్లోనే వీరి సంఖ్య అధికంగా ఉందని గుర్తించారు. వీరంతా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పెన్షన్లు పొందుతున్నవారన్న అనుమానంతో అధికారులు పెన్షన్లు నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, చేనేత , గీత కార్మికులకు వెయ్యి రూపాయల పెన్షన్, వికలాంగులకు రూ.1,500 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఇందులోఅర్హులైన వారికి తప్ప.. అనర్హులకు ఈ లబ్ధిచేకూర రాదన్న ఉద్దేశంతోనే పెన్షన్లు నిలిపివేసినట్లు సమాచారం. తెలంగాణలో 31 లక్షల మంది వరకు పెన్షనర్లు ఉంటే.. అందులో ఆరున్నర లక్షల వరకు బయోమెట్రిక్ విధానంలోకి రాలేదని, వీరిలో కుష్టురోగులు, మరీ వృద్ధులైనవారి బొటన వేలి గుర్తులను బయోమెట్రిక్ సాఫ్ట్వేర్ గుర్తించని వారు లక్ష వరకు ఉన్నారని భావించినా మిగిలిన వారంతా బోగస్ అనే భావన అధికారుల్లో వ్యక్తం అవుతోంది. కుటుంబాల కంటే.. అధికంగా తెల్లరేషన్‌కార్డులు, గులాబీ కార్డులు ఉన్న నేపథ్యంలో వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెల్లరేషన్‌కార్డుల ఆధారంగా గతంలో ఈ పెన్షన్లు మంజూరు చేశారు. నగరాలు, పట్టణాల్లోనే బోగస్ పెన్షనర్లు అధికంగా ఉన్నారని అధికారులు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు నెలకు రూ.రెండు వందల, వికలాంగులకు రూ.500 పెన్షన్ ఇస్తున్నారు. ఈ పెన్షన్‌ను భారీగా పెంచనున్న నేపథ్యంలో బయోమెట్రిక్ విధానంలోకి రానివారిని తొలగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇలా చేస్తే.. ఏడాదికి రూ. 660 కోట్ల మేరకు ఆదా అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల అంచనా. సీఎం చంద్రశేఖర్‌రావు పెన్షన్ల పెంపుపై సమావేశం నిర్వహించడానికి ముందుగానే అధికారులు ఈ కసరత్తు ప్రారంభించారు. జూన్‌కు సంబంధించి పెన్షన్‌ను నిలిపివేసినట్లు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. తెలంగాణలో 31,67,013 మంది పెన్షనర్లు ఉండగా.. ఏప్రిల్‌లో 30,89,914 మందికి నిధులు విడుదల చేశారు. అయితే 16,68,059 మందికి మాత్రమే నిధుల పంపిణీ జరగడం గమనార్హం. -
బాధపెడుతున్న ‘బయోమెట్రిక్’!
తాళ్లూరు, న్యూస్‌లైన్ : సామాజిక పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రవేశ పెట్టిన బయోమెట్రిక్ విధానం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. కొందరు వృద్ధ లబ్ధిదారుల వేలి ముద్రలు సరిపోలక వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేతివేలి ముద్రలు అరిగిపోయిన వృద్ధుల అవస్థ వర్ణనాతీతంగా ఉంది. ఇప్పటికే మూడు నెలల నుంచి పింఛన్లు అందుకోలేక పోవడంతో ఇకపై పింఛన్ వస్తుందో రాదో అన్న ఆందోళన వారిలో నెలకొంది. దర్శి నియోజకవర్గంలో దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో మొత్తం 21,222 మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అందులో 1805 మంది లబ్ధిదారులకు పింఛన్ నగదు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒక్కొక్క పంచాయతీకిఒక్కొక్క ఫినో సంస్థ కో-ఆర్డినేటర్ ఉండి పింఛన్ల నగదును పంచేవారు. ప్రస్తుతం పోస్టాఫీసులకు అనుసంధానం చేయడంతో పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముండ్లమూరు మండలం వేములలోని పోస్టాఫీసు నుంచి పింఛన్ సొమ్ము తీసుకోవాలంటే వేముల బండకు చెందిన వృద్ధులు 4 కిలోమీటర్ల మేర నడిచివెళ్లలేక నరకయాతన పడుతున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోక పోతే రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో పింఛనుదారులు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద అర్జీలు పెట్టుకునేందుకు వెళుతున్నారు. అక్కడ కూడా సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.