- ఎస్సీ హెచ్‌డబ్ల్యూఓలకు ల్యాప్‌టాప్‌లు
- బయో మెట్రిక్ విధానంతో హాజరు నమోదు
- ఆన్‌లైన్‌లో విద్యార్థుల, సామగ్రి వివరాలు
- స్థానికంగా ఉండని వార్డెన్లకు తప్పని ఇక్కట్లు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ల్యాప్‌టాప్, మిషన్లు పంపిణీ చేసింది. ఆయా వసతి గృహాల్లో ఎన్ని కేజీల బియ్యం, కందిపప్పు, కూరగాయలు తదితర నిత్యావసర సరుకులు వినియోగించారనే విషయాలను నిత్యం హాస్టల్ వార్డెన్లు ల్యాప్‌టాప్ ద్వారా హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంది. అలాగే ఇక నుంచి ప్రతిరోజు బయోమెట్రిక్ విధానం ద్వారా విద్యార్థుల, హాస్టల్ వార్డెన్ వేలి ముద్రలతో హాజరును నమోదు చేసి ఆన్‌లైన్ చేయాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ వల్ల జిల్లాలోని 102 ఎస్సీ వసతి గృహాల్లో దాదాపు 10 వేలకు పైగా విద్యార్థుల, వార్డెన్ల సమగ్ర సమాచారం ఆన్‌లైన్‌లో నిక్షిప్తం కానున్నాయి.
అన్ని వివరాలు ఆన్‌లైన్‌లోనే..
ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన దుప్పట్లు, కార్పెట్లు, దుస్తులు, నోటు పుస్తకాలు, ట్రంకు పెట్టెలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి వుంది. విద్యార్థులకు ఇచ్చిన వస్తువుల ఫొటోలను కూడా ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌లో పంపాల్సి వుంది. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతమంది విద్యార్థులు వసతి గృహంలో ఉన్నారు? ఎంత మంది గైర్హాజరయ్యారు? విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, టిఫెన్ అందిస్తున్నారా? లేదా? వార్డెన్ స్థానికంగా ఉంటున్నారా, లేదా, అనే వివరాలు బయోమెట్రిక్ విధానం ద్వారా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు క్షణాల్లో తెలిసే అవకాశం ఏర్పడింది.
స్థానికంగా ఉండని వార్డెన్లకు ఇబ్బందులే..
బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో స్థానికంగా ఉండని వార్డెన్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలోని పలు వసతి గృహాలకు చెందిన వార్డెన్లు స్థానికంగా ఉండకుండా వంట మనుషులు, వాచ్‌మెన్లకు బాధ్యతలు అప్పగించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం హాస్టల్ వార్డెన్లకు ల్యాప్‌టాప్‌లు, బయో మెట్రిక్ మిషన్లను పంపిణీ చేసిన నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థులతో పాటు వార్డెన్లు కూడా వేలి గుర్తులు వేయాల్సి ఉంటుంది. దీంతో వార్డెన్లు స్థానికంగా ఉండక తప్పదు.
జిల్లాకు 71 ల్యాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ మిషన్లు..
జిల్లాలో మొత్తం 102 ప్రీమెట్రిక్ వసతి గృహాలు ఉండగా, ప్రస్తుతం 80 మంది విద్యార్థుల కంటే తక్కువ సంఖ్య ఉన్న 31 వసతి గృహాలను మినహాయించి మిగిలిన 71 వసతి గృహాలకు సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ల్యాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ మిషన్లను సరఫరా చేశారు. వీటిని ఆయా సహాయ సంక్షేమాధికారి కార్యాలయాల నుంచి వార్డెన్లు తీసుకువెళ్లే పనిలో ఉన్నారు. ల్యాప్‌టాప్‌లను సరఫరా చేసిన కంపెనీకి చెందిన ప్రతినిధులే జిల్లాకు వచ్చి ల్యాప్‌టాప్, బయోమెట్రిక్ మిషన్ల వినియోగానికి సంబంధించి అవగాహన కల్పిస్తున్నారు.
హాస్టళ్లలో అక్రమాలకు చెక్
Published Sat, Sep 20 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement
Advertisement