ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాస్టల్ వార్డెన్ శ్రీదేవి
విశాఖపట్నం , కశింకోట(అనకాపల్లి): చందాల కోసం కొందరు స్థానికులు పెడుతున్న వేధింపులు భరించలేక మనస్తాపంతో స్థానిక హాస్టల్ వార్డెన్ ఆత్మహత్యా యత్నం చేశారు. ఏఎస్‌ఐ టి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సమగ్ర బాలికల వసతి గృహం సంక్షేమ అధికారి(వార్డెన్) లొడగల శ్రీదేవి ప్రధానంగా మూడు అంశాల్లో స్థానికులు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నిం చారు. స్థానిక గ్రామ ఉత్సవాలకు చందాలతోపాటు మరో అంశం ఇందుకు కారణం. నాలుగు నెలల క్రితం ఇక్కడ నిర్వహించిన ఓ ఉత్సవానికి నిర్వాహకులు చందా కోసం వెళ్లి రూ.పది వేలు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమనడంతో ససేమిరా అంటూ బెదిరించారు.
అలాగే రెండు నెలల క్రితం వసతి గృహం నుంచి చెప్పాపెట్టకుండా ఇంటికి వెళ్లిపోయిన పదవ తరగతి విద్యార్థి మూడు రోజుల తర్వాత తల్లితో వస్తే చేర్చుకోవడానికి వార్డెన్ నిరాకరించారు. దీంతో విద్యార్థి తల్లి స్థానికులను తీసుకు వచ్చి వార్డెన్‌పై వత్తిడి చేశారు. దీంతో సంజా యిషి పత్రం రాసి ఇస్తే చేర్చుకుంటాననడంతో అందుకు వారు సమ్మతించడంతో చేర్చుకున్నారు. తాజాగా ఇటీవల జరిగిన ఒక ఉత్సవానికి చందా కోసం ఒకరు వెళితే రూ.2 వేలు ఇచ్చారు. అది సరిపోదని ఎక్కువ ఇవ్వాలని వత్తిడి చేశారు. ఈ సంఘటనలన్నింటినీ మనసులో పెట్టుకొని ఒత్తిడికి గురై మనస్తాపం చెంది సోమవారం మోతాదుకు మించి 40 వరకు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలు శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు సంఘటనలకు సంబంధించి స్థానికులతోపాటు విద్యార్థిని తల్లిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment