సాక్షి, ఒంగోలు టూటౌన్: సంక్షేమంలో మళ్లీ ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు వరకు డైట్ చార్జిలు, పిల్లలకు రావాల్సిన కాస్మొటిక్ చార్జిలు విడుదల విషయంలో ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం అనంతరం వాటిని విడుదల చేసి కొంత ఊరట కలిగించింది. ఇక అప్పటి నుంచి మళ్లీ వసతి గృహాలకు డైట్ చార్జిలు మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వసతి గృహాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో వార్డెన్లు అప్పుల తిప్పలు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి ఆర్థిక కష్టాలు పడుతూ కూడా ఎవరికి చెప్పుకోలేక ఎవరికి వారే మదనపడుతున్నారు.
జిల్లాలో 89 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో బాలురకు 71 వసతి గృహాలు, బాలికలకు 18 వసతి గృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాల్లో దాదాపు 9,300 మంది వరకు పేద విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. వెనుకబడిన వసతి గృహాలు 76 ఉన్నాయి. వీటిలో బాలురకు 58, బాలికల కోసం 18 నిర్వహిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో మూడు వసతి గృహాలు, 14 గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు 17 ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నారు.
విడుదలకు నోచని డైట్ చార్జిలు..
ప్రతి నెల వసతి గృహాలకు డైట్‌చార్జీలు (మెస్ చార్జీలు) విడుదల చేయాల్సి ఉంది. ఆ నిధులు విడుదల చేస్తేనే దుకాణాలలో కొన్ని నిత్యవసర వస్తువులకు, కూరగాయలకు, చికెన్ బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. వీటన్నింటికి ఆయా సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు తమ సొంత పూచికత్తుపై అప్పులు తెస్తుంటారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే దుకాణాదారులకు చెల్లిస్తుంటారు. ఈ సారి సాంఘిక సంక్షేమ శాఖలో ఆరు నెలలుగా డైట్ చార్జిలు విడుదలకు నోచుకోలేదు.
వార్డెన్లు కూడా నెలల తరబడి డైట్ చార్జిలు విడుదల కాకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే మా పరిస్థితి ఏంటని కలవరపడుతున్నారు. వసతి గృహాల్లో పిల్లలకు నిబంధనల ప్రకారం అన్ని సమకూర్చాలని ఆదేశాలిస్తుంటారని వాపోతున్నారు. నిధులు మాత్రం సకాలంలో విడుదల కాక అప్పుల తెచ్చిన దుకాణాల వద్ద మాట పోతుందని కొందరు సంక్షేమ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన వసతి గృహాలకు జనవరి నుంచి మెస్ చార్జీలు రావాల్సి ఉంది. అదే విధంగా ఎస్టీ వసతి గృహాలకు సైతం బడ్డెట్ విడుదల కాక వార్డెన్లు మదనపడుతున్నారు. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీల భారం పడుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని వార్డెన్లు కొంత వాపోతున్నారు.
సంక్షేమ అధికారులు బిల్లులను సకాలంలో బిల్లులను ట్రెజరీకి పంపిస్తున్నప్పటికీ అక్కడ బడ్జెట్ లేకపోవడమో లేక ఫ్రీజింగ్ పెట్టడమో చేయడం మూలంగా సంక్షేమంలో ఆర్థిక కష్టాలకు మూలమవుతోంది. ప్రభుత్వం మాత్రం సంక్షేమంపై ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదన్న విమర్శలు దళిత సంఘాల నుంచి వెల్లువెతుతున్నాయి. పేదల విద్యార్థుల సంక్షేమానికి విడుదల చేయాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకుండా కాలయాపన చేయడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నాయి. కనీసం వసతి గృహాల్లో విద్యార్థులకు నెలనెలా చేయాల్సిన వైద్య పరీక్షలు సైతం చేయకుండా వదిలేయడంపై దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
అడ్డంకిగా మారనున్న ఎన్నికల కోడ్..
ఒక్క సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకే రూ. మూడు కోట్ల నుంచి నుంచి నాలుగు కోట్ల వరకు రావాల్సి ఉందని తెలుస్తోంది. అదే విధంగా కళాశాలలో చదువుకుంటున్న పిల్లలకు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ కొంత అడ్జెట్‌మెంట్ కావాల్సి ఉన్నట్లు ఆ శాఖ అధికారులే ఒప్పుకుంటున్నారు. సంక్షేమ వసతి వసతి గృహాలకు విడుదల చేయాల్సిన డైట్ చార్జిలను ఎన్నికల కోడ్ రాక చేయక ముందే విడుదల చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లుల పెండింగ్ విషయంపై సాంఘిక సంక్షేమశాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకు రాగా వారం పది రోజులలో నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ట్రెజరీలో కదలని బిల్లులు..
జిల్లా ట్రెజరీలో ఏ ఒక్క బిల్లు కదలటంలేదు. గత రెండు నెలలకుపైగా ఏ బిల్లుకు మోక్షం లభించడంలేదు. ఒక్క జీతాలు బిల్లులు తప్పితే మిగతా బిల్లులన్నింటికీ ఒక్క పైసా విడుదల చేయని పరిస్థితి నెలకొంది. దీంతో ట్రెజరీకి బిల్లులు పెట్టే వివిధ వర్గాలు నిత్యం ఖజానా కార్యాలయం చుట్టు తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పైగా వివిధ రకాల బిల్లులకు మంజూరు చేయాల్సి ఉందని ఖజానా వర్గాలు చెబుతున్నాయి. అయితే ట్రెజరీకి సంబంధించిన సర్వర్‌ను పూర్తిగా రాష్ట్ర స్థాయిలోనే నిలుపుదల చేయడంతో జిల్లా ట్రెజరీలలో ఏమి చెప్పలేకపోతుండటం గమనార్హం.
ఎన్నికల తాయిలాలకు నిధులు మళ్లింపు..
సార్వత్రిక ఎన్నికల సమీపిస్తుండటంతో ఓట్ల కొనుగోలుకు తెర లేపిన సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధులన్నీ దారి మళ్లించేస్తున్నారు. ఇప్పటికే పసుపు–కుంకుమ పథకానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. ఇంకా రైతుల ఓట్ల కోసం మరికొన్ని నిధులను మళ్లిస్తూ అన్ని జిల్లాలను ఆర్థిక కష్టాల్లోకి నెడుతుండటంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment