సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రూ.2750కు పెంచి పంపిణీ చేస్తోంది. దీంతో గత మూడ్రోజులుగా కోలాహలంగా పెన్షన్ వారోత్సవాలు జరుగుతున్నాయి. పెన్షన్ వారోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వితంతు పింఛన్ అందుకుంటున్న రాజమండ్రిలోని మున్సిపల్ కాలనీకి చెందిన కోటా సామ్రాజ్యం అనే మహిళ మాట్లాడారు. తనకు ఈ ప్రభుత్వం నుంచి అందిన పథకాలను గుర్తు చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
‘గత ప్రభుత్వం హయాంలో నా భర్త చనిపోయాడు. నాకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవడంతో రోడ్డుమీద పడ్డ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలో నేను తిరగని రోజే లేదు. రోజూ వెళ్లి చెట్లకింద కూర్చుని పెన్షన్ దరఖాస్తు చేశాను. ఎవరూ మమ్మల్నీ పట్టించుకోలేదు. తిరిగి తిరిగి విసుగొచ్చి మేమే మానుకున్నాం. ఎప్పుడైతే మీరు సీఎం అయ్యారో, ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందే.. వాలంటీరు నేరుగా మా ఇంటికే వచ్చారు. వితంతు పెన్షన్‌కు నేను దరఖాస్తు చేసుకున్నాను. ఏడాదిన్నర తిరిగితే రాని పెన్షన్ ఒక్క నెలకే వచ్చింది. ప్రతి నెల 1వ తేదీన వాలంటీరు వచ్చి మా చేతిలే పెన్షన్ డబ్బులు పెడుతుంటే పండగలాగా అనిపిస్తోంది.’అంటూ తన కుటుంబం లబ్ధిపొందిన వివరాలను చెబుతూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు సామ్రాజ్యం.
వేదికపై మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌పై ఓ పాట పాడారు కోటా సామ్రాజ్యం. తన ఇంట్లో ఎప్పుడూ సీఎంను తలుచుకుంటూ ఓ పాట పాడుకుంటానని చెప్పారు. ‘దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే..నా అన్నలా ఉంటాడని అంటాను నేను.’అని పాట అందుకున్నారు. సీఎం జగన్ అంటే తమకు దేవుడని, జై జగనన్న, జైజై జగనన్న అంటూ ముగించారు.
ఇదీ చదవండి: అమితానందం..పండుగలా ఫించన్ల పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment