అందరికీ తీపిని పంచే చెరకు రైతన్న చేదును చవిచూస్తున్నాడు. కోవిడ్ దెబ్బకు కుదేలై విలవిల్లాడుతున్నాడు. కనీసం పెట్టుబడి ఖర్చులు రావడం కూడా కష్టంగా మారడంతో నష్టాలకు గురవుతున్నాడు. చెరకు పంట ఏపుగా పెరిగినా మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో బావురుమంటున్నాడు. ఆశగా తయారు చేసిన బెల్లం బుట్టలు అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. కోవిడ్ పరిస్థితుల నుంచి కోలుకునే కాలం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు.
తాళ్లూరు: కరోనా ప్రభావానికి అల్లకల్లోలంగా మారిన అనేక రకాల మార్కెట్లలో బెల్లం మార్కెట్ కూడా ఉంది. ఆ ప్రభావం చెరకు రైతుపై తీవ్రంగా పడింది. గతంలో ఎన్నడూ తలెత్తని దుర్భర పరిస్థితుల్లోకి వారిని నెట్టేసింది. అమ్ముడుపోని బెల్లం బుట్టలతో పాటు నష్టాలను కూడా మూటగడుతోంది. ప్రకాశం జిల్లాలో సుమారు 3,000 ఎకరాల్లో చెరకు సాగవుతోంది. అందులో అధికంగా 1500 ఎకరాల వరకు తాళ్లూరు మండలంలో సాగవుతోంది.
చెరకును బెల్లంగా మార్చేందుకు తాళ్లూరు ప్రాంతంలో ప్రత్యేకంగా బట్టీలు కూడా ఉన్నాయి. సుమారు 15 నుంచి 20 వరకు ఉన్న బట్టీల ద్వారా బెల్లం తయారు చేసి బుట్టల్లో అమర్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. స్థానికంగా కూడా మార్కెట్ చేసుకుంటారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా కూలీలు వస్తుంటారు. వారికి రోజుకు రూ.500కుపైగా కూలి ఇస్తుంటారు. అయితే, కోవిడ్ కారణంగా ప్రస్తుతం బెల్లం మార్కెట్ బాగా పడిపోయింది. ఎగుమతులు సైతం నిలిచిపోయాయి. తయారు చేసిన బెల్లం నిల్వలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. ఫలితంగా రైతులు సాగుచేసిన చెరకుతో పెద్దగా పనిలేకుండా పోయింది. ఆ రైతులంతా నష్టాల బాట పట్టారు.
ఖర్చు ఎక్కువ.. మిగిలేది తక్కువ..!
తాళ్లూరు పరిసర ప్రాంతాల్లో 33 ఏళ్లుగా చెరకు పంట సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఎకరా పొలంలో చెరకు సాగుచేసేందుకు రూ.లక్ష వరకూ ఖర్చవుతోంది. ఎకరాకు మూడు టన్నుల బెల్లం ఉత్పత్తవుతుంది. కోవిడ్ కారణంగా బెల్లం విక్రయాలు తగ్గడంతో ధర కూడా తగ్గింది. కేజీ రూ.36 మాత్రమే ఉంది. దాని ప్రకారం ఎకరా చెరకుతో తయారు చేసిన బెల్లం విక్రయిస్తే రాబడి రూ.1.08 లక్షలే ఉంది. అంటే.. ఎకరాకు రూ.8 వేలు మాత్రమే మిగులుదల ఉంది. చెరకు సాగు నుంచి బెల్లం తయారు చేయడం, మార్కెట్ చేసుకోవడం వరకూ అష్టకష్టాలుపడితే కనీసం పది వేలు కూడా మిగలడం గగనంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో బెల్లం తయారీ వ్యయం తక్కువ కాగా, ఆదాయం ఆశాజనకంగా ఉండేదని, ఇప్పుడు ఖర్చులు పెరగడంతో పాటు మార్కెట్లో బెల్లం ధరలు తగ్గడం, విక్రయాలపై కరోనా కాటేయడం వలన నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
కోవిడ్ వలన బెల్లం వాడకం, అమ్మకం తగ్గి పెట్టుబడులు కూడా రావడం లేదు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. తాళ్లూరు ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీ నెలకొల్పి చెరకు రైతులను గట్టెక్కించాలి. లేకుంటే కోలుకోలేము.
– లింగారెడ్డి, రైతు, తాళ్లూరు
చీడపీడలతో చెరకు రైతుకు వెతలు
బల్లికురవ: జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో సాగుచేసిన చెరకు పంటను చీడపీడలు ఆశించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. బల్లికురవ, అద్దంకి మండలాల్లో తిరునాళ్లు, ఉత్సవాల్లో అమ్మే నల్ల చెరకును జూన్ మొదటి వారం నుంచి సాగుచేస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది సాగుచేసిన నెల రోజుల చెరకు పంటను చీడపీడలు ఆశించాయి.
బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు, వైదన, రామాంజనేయపురం, ఎస్‌ఎల్ గుడిపాడు, అంబడిపూడి, అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం, సాధునగర్, చక్రాయపాలెంలో ఇప్పటికే సుమారు 55 ఎకరాల్లో సాగు చేసిన పంటకు నెలరోజులు పూర్తయింది. ప్రస్తుతం మరో 50 ఎకరాల్లో సాగు చేసేందుకు బల్లికురవ మండలంలోని రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో పీక పురుగు, ఎర్రనల్లి ఉధృతంగా పంటపై దాడిచేశాయి. పంటంతా ఎండిపోతుండటంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి తలెత్తలేదని రైతులు గొల్లుమంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు స్పందించి చీడపీడల నివారణకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.
కార్బాపైరాన్ గుళికలు వేసుకోవాలి
వర్షాధార పంటను పీకపురుగు ఆశిస్తుంది. పైరు పిలకలు వేసే దశలో మొవ్వలోకి చేరి తినడం వలన ఎండిపోతోంది. పీకపురుగు ఆశించకుండా గడల ముక్కలు నాటే ముందు ఎకరాకు 12 నుంచి 13 కేజీలు కార్బాపైరాన్ గుళికలను చాళ్లలో వేసుకోవాలి. పైరు నెలరోజుల దశలో ఉన్నందున కోరాజన్ 0.3 మిల్లీలీటరును లీటరు నీటికి కలిపి మొవ్వ పూర్తిగా తడిసేలా ఐదు రోజులకోసారి పిచికారీ చేసుకోవాలి.
– ఎస్‌వీపీ కుమారి, వ్యవసాయాధికారిణి, బల్లికురవ
Comments
Please login to add a commentAdd a comment