బాణం గుచ్చుకుని మృతి చెందిన భూమని వెంకటేశం
సాక్షి, పెద్దదోర్నాల (ప్రకాశం): పెండ్లి బాజాలు మోగిన ఆ యింట్లో పక్షం రోజుల్లోనే మృత్యుఘంటికలు మోగాయి. పచ్చని తోరణాలు ఇంకా వాడకముందే ఆ ఇంట బంధు మిత్రుల రోదనలు మిన్నంటాయి. ఇంటికి పెద్ద దిక్కయి పెళ్లి పెద్దగా వ్యవహరించిన రక్తంపంచుకుపుట్టిన అన్నే సొంత తమ్ముడిని బాణాన్ని సంధించి దారుణంగా హతమార్చాడు. పెండ్లికి చేసిన అప్పు విషయమై సోదరుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఈ దుర్ఘటనకు కారణంగా తెలుస్తోంది. మండల పరిధిలోని భ్రమరాంబ చెంచు కాలనీలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన లో గూడేనికి చెందిన గిరిజన యువకుడు భూమని వెంకటేశం (22) అన్న భూమని కొండయ్య చేతితో హతమయ్యాడు.
ఎస్సై సుబ్బారావు కథనం మేరకు మండల పరిధిలోని భ్రమరాంబ చెంచు కాలనీకి చెందిన భూమని కొండయ్య, వెంకటేశంలు అన్నాతమ్ముళ్లు. భూమని వెంకటేశంకు కొర్రప్రోలుకు చెందిన లక్ష్మీతో 15 రోజుల క్రితం వివాహం జరిగింది. గిరిజన సంప్రదాయరీతిలో అట్టహాసంగా పెండ్లిని జరిపించారు. ఈ పెండ్లికి పెద్దగా బాధ్యతలు తీసుకున్న భూమని కొండయ్య తమ్ముడి పెండ్లి ఖర్చుల కోసం 25 వేల రూపాయలను అప్పుగా తీసుకుని ఆ డబ్బును తమ్ముడికి అందజేశాడు. ఈ క్రమంలో అన్నాతమ్ముల మధ్య ఆదివారం రాత్రి డబ్బు విషయంలో చిన్నపాటి వివాదం జరిగింది. పెండ్లి కోసం అందజేసిన డబ్బును తిరిగి ఇవ్వాలని కొండయ్య తమ్ముడిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో తన వద్ద ఉన్న మేకలను అమ్మి ఇవ్వాల్సిన మొత్తం డబ్బులను ఇస్తానని వెంకటేశం తెలిపాడు.
అయితే మధ్యం మత్తులో ఉన్న కొండయ్య తమ్ముడితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగి అందుబాటులో ఉన్న విల్లంబుతో వెంకటేశంపై బాణాన్ని సంధించాడు. బాణం ఛాతి మధ్యభాగలో దిగటంతో వెంకటేశం సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదుతో మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఇన్‌చార్జ్ సీఐ శ్రీరామ్, ఎస్సై సుబ్బారావులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ శ్రీరామ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment