కబడ్డీకి సరైన ప్రాధాన్యత లేదు
కబడ్డీకి సరైన ప్రాధాన్యత లేదు
Published Sat, Feb 8 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
మన దేశంలో కబడ్డీ క్రీడకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ వాపోయాడు. తన తదుపరి చిత్రం ‘తేవర్’లో అర్జున్ కాలేరూ. విద్యార్థిగా, కబడ్డీ ఆటగానిగా కనిపించనున్నాడు. తెలుగులో మహేశ్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమాను అర్జున్ తండ్రి బోనీకపూర్ హిందీలో తేవర్‌గా రీమేక్ చేస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు చిత్రానికి కొన్ని మార్పులు చేశామని అర్జున్ తెలిపాడు. ఈ చిత్రంలో తాను కాలేరూ. విద్యార్థిగా, కబడ్డీ క్రీడాకారునిగా నటిస్తున్నానని చెప్పాడు.
తన యాంగ్రీ యంగ్‌మ్యాన్ ఇమేజ్‌కు కాస్త భిన్నంగా ఈ పాత్ర ఉందని తెలిపాడు. ఈ పాత్ర కోసం తాను కబడ్డీ నేర్చుకున్నానని, ఆ క్రమంలో తీవ్రంగా గాయపడ్డానని కూడా చెప్పాడు. ఆ గాయం కారణంగా డిసెంబర్ నెల అంతా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. ఆ సమయంలోనే కొంతమంది కబడ్డీ క్రీడాకారులను కలుసుకొని ఆటపై అవగాహన పెంచుకున్నానని చెప్పాడు. అయితే ఈ సినిమా కథ కబడ్డీ క్రీడపై కాదని అన్నాడు. ఇది యాక్షన్ చిత్రమని, ఓ సాధారణ యువకుడు, అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడమే చిత్ర కథాంశమని చెప్పాడు. తొలిసారిగా తన తండ్రితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నాడు. ఇది తన చిరకాల స్వప్నమని అర్జున్ చెప్పాడు. తన కోసం ఈ సినిమాను నిర్మించడం లేదని, చిత్ర నిర్మాణం ఆయన వృత్తి అని అన్నాడు.
Advertisement