Tevar
-
కారు ప్రమాదంలో గాయపడ్డ బోని కపూర్
ముంబై: బాలీవుడ్ నిర్మాత, ప్రముఖ నటి శ్రీదేవి భర్త బోని కపూర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ముంబైలో జరిగిన కారు ప్రమాదంలో బోని కపూర్ కు స్వల్ప గాయాలైనట్టు ఆయన మేనేజర్ మీడియాకు తెలిపారు. అయితే స్వల్పంగా గాయపడిన బోని కపూర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. 'ముంబైలోని వహి ప్రదేశంలో తేవర్ చిత్ర షూటింగ్ ను ముగించుకుని వస్తుండగా సతారా హైవేపై ట్రాక్టర్ ను బోని కారు ఢికొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారును ఆయన డ్రైవర్ నడుపుతున్నారు. బోని శరీరపు వెనక భాగంలో గాయాలయ్యాయి' అని శ్రీదేవి మేనేజర్ పంకజ్ కర్భందా మీడియాకు సమాచారం అందించారు. -
‘తేవర్’ వార్తలపై రాజ్‌బబ్బర్ దిగ్భాంతి
ముంబై: ఎన్నికల పేరు చెప్పి తేవర్ సినిమా షూటింగ్‌లకు ఎగనామం పెట్టి నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడని తనపై వస్తున్న వార్తలను నటుడు, ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి రాజ్‌బబ్బర్ ఖండించారు. ఇటువంటి అవాస్తవ వార్తలు తన ప్రతిష్టను దిగజారుస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. తనకు తల్లి వంటి చిత్ర పరిశ్రమను ఇబ్బందిపెట్టే పనులు ఎన్నడూ చేయలేదని, రాజకీయాలకు, సినిమాలకూ సమాన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు నటుడిగా తమను ఇబ్బంది పెట్టినట్లు తనపై ఏ నిర్మాత కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. బోనీ, సంజయ్కపూర్లు నిర్మిస్తున్న తేవర్’ సినిమా షూటింగ్‌కు ఎగనామం పెట్టి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని కథనాలు రావడం దురదృష్టమన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మొదటిదశ ఎన్నికల ప్రచారం వల్ల సినిమా షూటింగులకు హాజరు కాలేనని ‘దేవర్’ సినిమా నిర్మాతలకు తాను మొదటే చెప్పానన్నారు. ఆ సినిమా కోసం తాను 15 రోజులు కేటాయించాల్సి ఉందని, ప్రస్తుత తరుణంలో అంత సమయం ఆ సినిమాకు కేటాయించడం తన వల్లకాదని, అందువల్ల ప్రచారానికి ముందుగానే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకోవాలని కోరానని చెప్పారు. అయితే వారు సిద్ధంగా లేకపోవడం తన తప్పు కాదన్నారు. ‘ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నాను కాబట్టి ఒక నటుడిగా నా మాతృ సంస్థ(సినిమా పరిశ్రమ) నుంచి కనీస సహకారాన్ని ఆశిస్తున్నా. నేను షూటింగ్‌ను ఆపేయమని అడగలేదు.. షెడ్యూల్ సర్దుబాటు కోసం అర్ధిస్తున్నా..’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
ప్రత్యేక పాటకు రెండున్నర కోట్లు!
క్రేజ్ ఉన్నవాళ్లు కోరుకున్నంత అన్న చందంగా బాలీవుడ్ తయారయ్యింది. అందుకు ఉదాహరణ ‘తేవర్’ చిత్రంలోని ఐటమ్ సాంగ్. మహేష్‌బాబు, భూమిక జంటగా నటించిన ‘ఒక్కడు’కి రీమేక్ ఇది. అర్జున్‌కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఉన్న ప్రత్యేక గీతానికి కాలు కదపమని సోనాక్షీ సిన్హాని కోరారట చిత్ర నిర్మాత బోనీకపూర్. ‘చేస్తా కానీ.. రెండున్నర కోట్లు ఇస్తేనే’ అని డిమాండ్ చేశారట ఈ ముద్దుగుమ్మ. మాస్ పాటలకు సోనాక్షి బాగా డాన్స్ చేస్తారు కాబట్టి, ఆమె అడిగినంత ఇవ్వడానికి బోనీ అంగీకరించేశారట. ఆ పాట కోసం భారీ సెట్ కూడా వేయించారట. ఈ పాటకు సాజిద్-వాజిద్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారని బోనీ తెలిపారు. ఇటీవలే ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాట కోసం సోనాక్షి ధరించిన కాస్ట్యూమ్స్ ఖరీదు 75 లక్షల రూపాయలట. ఇక.. పాట ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. -
కబడ్డీకి సరైన ప్రాధాన్యత లేదు
మన దేశంలో కబడ్డీ క్రీడకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ వాపోయాడు. తన తదుపరి చిత్రం ‘తేవర్’లో అర్జున్ కాలేరూ. విద్యార్థిగా, కబడ్డీ ఆటగానిగా కనిపించనున్నాడు. తెలుగులో మహేశ్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమాను అర్జున్ తండ్రి బోనీకపూర్ హిందీలో తేవర్గా రీమేక్ చేస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు చిత్రానికి కొన్ని మార్పులు చేశామని అర్జున్ తెలిపాడు. ఈ చిత్రంలో తాను కాలేరూ. విద్యార్థిగా, కబడ్డీ క్రీడాకారునిగా నటిస్తున్నానని చెప్పాడు. తన యాంగ్రీ యంగ్‌మ్యాన్ ఇమేజ్‌కు కాస్త భిన్నంగా ఈ పాత్ర ఉందని తెలిపాడు. ఈ పాత్ర కోసం తాను కబడ్డీ నేర్చుకున్నానని, ఆ క్రమంలో తీవ్రంగా గాయపడ్డానని కూడా చెప్పాడు. ఆ గాయం కారణంగా డిసెంబర్ నెల అంతా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. ఆ సమయంలోనే కొంతమంది కబడ్డీ క్రీడాకారులను కలుసుకొని ఆటపై అవగాహన పెంచుకున్నానని చెప్పాడు. అయితే ఈ సినిమా కథ కబడ్డీ క్రీడపై కాదని అన్నాడు. ఇది యాక్షన్ చిత్రమని, ఓ సాధారణ యువకుడు, అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడమే చిత్ర కథాంశమని చెప్పాడు. తొలిసారిగా తన తండ్రితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నాడు. ఇది తన చిరకాల స్వప్నమని అర్జున్ చెప్పాడు. తన కోసం ఈ సినిమాను నిర్మించడం లేదని, చిత్ర నిర్మాణం ఆయన వృత్తి అని అన్నాడు.