‘తేవర్’ వార్తలపై రాజ్‌బబ్బర్ దిగ్భాంతి
Published Sat, Apr 12 2014 10:29 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
ముంబై: ఎన్నికల పేరు చెప్పి తేవర్ సినిమా షూటింగ్‌లకు ఎగనామం పెట్టి నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడని తనపై వస్తున్న వార్తలను నటుడు, ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి రాజ్‌బబ్బర్ ఖండించారు. ఇటువంటి అవాస్తవ వార్తలు తన ప్రతిష్టను దిగజారుస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. తనకు తల్లి వంటి చిత్ర పరిశ్రమను ఇబ్బందిపెట్టే పనులు ఎన్నడూ చేయలేదని, రాజకీయాలకు, సినిమాలకూ సమాన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు నటుడిగా తమను ఇబ్బంది పెట్టినట్లు తనపై ఏ నిర్మాత కూడా ఫిర్యాదు చేయలేదన్నారు.
బోనీ, సంజయ్‌కపూర్‌లు నిర్మిస్తున్న తేవర్’ సినిమా షూటింగ్‌కు ఎగనామం పెట్టి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని కథనాలు రావడం దురదృష్టమన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మొదటిదశ ఎన్నికల ప్రచారం వల్ల సినిమా షూటింగులకు హాజరు కాలేనని ‘దేవర్’ సినిమా నిర్మాతలకు తాను మొదటే చెప్పానన్నారు. ఆ సినిమా కోసం తాను 15 రోజులు కేటాయించాల్సి ఉందని, ప్రస్తుత తరుణంలో అంత సమయం ఆ సినిమాకు కేటాయించడం తన వల్లకాదని, అందువల్ల ప్రచారానికి ముందుగానే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకోవాలని కోరానని చెప్పారు. అయితే వారు సిద్ధంగా లేకపోవడం తన తప్పు కాదన్నారు. ‘ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నాను కాబట్టి ఒక నటుడిగా నా మాతృ సంస్థ(సినిమా పరిశ్రమ) నుంచి కనీస సహకారాన్ని ఆశిస్తున్నా. నేను షూటింగ్‌ను ఆపేయమని అడగలేదు.. షెడ్యూల్ సర్దుబాటు కోసం అర్ధిస్తున్నా..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement