రాజ్ బబ్బర్ తరఫున సల్లూభాయ్ ప్రచారం? | Raj Babbar plans to engage Salman Khan for campaigning | Sakshi
Sakshi News home page

రాజ్ బబ్బర్ తరఫున సల్లూభాయ్ ప్రచారం?

Published Wed, Apr 2 2014 6:08 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

రాజ్ బబ్బర్ తరఫున సల్లూభాయ్ ప్రచారం? - Sakshi

రాజ్ బబ్బర్ తరఫున సల్లూభాయ్ ప్రచారం?

ఘజియాబాద్: ఎన్నికల ప్రచారంలో పార్టీల తరఫున తారలు పాల్గొనడం సాధారణమే. అయితే ఆ తారలే ఎన్నికల బరిలో దిగుతుండడంతో పార్టీలతో సంబంధం లేకుండా తమ సహచరుల తరఫున ప్రచారం చేసేందుకు బాలీవుడ్ తారలు సిద్ధమవుతున్నారు. ఘజియాబాద్ లోక్‌సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఒకప్పటి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ తన తరఫున ప్రచారం చేసేందుకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ను బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 
 
 దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యువకుల్లో సల్లూభాయ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో అతనితో ప్రచారం చేయిస్తే రాజ్ బబ్బర్ విజయం ఖాయమనే అభిప్రాయాన్ని పలువురు కాంగ్రెస్ పెద్దలే వ్యక్తం చేయడంతో బబ్బర్ ఈ దిశగా యోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఈ విషయమై మాట్లాడుతూ... ‘ఇప్పటికే రాజ్ బబ్బర్ సల్మాన్‌ఖాన్‌ను కలిశారు. తనకోసం ప్రచారం చేయడానికి కొంత సమయం కేటాయించాల్సిందిగా కోరారు. సల్మాన్‌ఖాన్ ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా కొంత సమయం ఇవ్వాల్సిందిగా అడిగారు. రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకొని, ఫోన్ చేస్తానని చెప్పారు. సల్మాన్ తండ్రితో కూడా బబ్బర్ ఈ విషయమై మాట్లాడారు. దీంతో నేరుగా సల్మాన్‌తోనే మాట్లాడాలని ఆయన సూచించారు.
 
 మొత్తానికి సల్మాన్, బబ్బర్ తరఫున ప్రచారం చేసే విషయంలో అందరూ సానుకూలంగానే ఉన్నార’న్నారు. ఒకవేళ సల్మాన్‌ఖాన్, రాజ్‌బబ్బర్ తరఫున ప్రచారం చేస్తే ఆయన విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రాజ్‌బబ్బర్‌కు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న షాజియా ఇల్మీ, ఆప్ తరఫున పోటీ చేస్తుండగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్మీ మాజీ చీఫ్ వి.కె. సింగ్ పోటీ చేస్తున్నారు. దీంతో ఇప్పటిదాకా జరిగిన ప్రచార సరళితో పోలిస్తే కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. సల్మాన్ వంటి  నటు లు ప్రచారం చేస్తే తప్ప పరిస్థితి మెరుగుపడే అవ కాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement