ప్రకృతికి ఫ్రెండ్‌ | Jnaneshwar Has Been Making The Journey For Eight Years To Protect Nature | Sakshi
Sakshi News home page

ప్రకృతికి ఫ్రెండ్‌

Published Wed, Dec 4 2019 12:55 AM | Last Updated on Wed, Dec 4 2019 12:55 AM

Jnaneshwar Has Been Making The Journey For Eight Years To Protect Nature - Sakshi

కాలేజీకి సెలవులు వస్తే యువత విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు   వెళ్తుండటం సహజమే. కానీ జ్ఞానేశ్వర్‌ మాత్రం తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన ప్రకృతి దగ్గరికి వెళ్లి పలకరిస్తుంటాడు! చిన్నారులతో కలిసి మొక్కలు నాటుతుంటాడు. ప్రకృతి సంరక్షణపై గ్రామస్తులకు సంగీత వాయిద్యాలతో పాటలు పాడి వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటాడు.

జ్ఞానేశ్వర్‌ది సంగారెడ్డి జిల్లా నాగల్‌ గిద్ద మండలం ముక్తాపూర్‌ గ్రామం. ప్రకృతిని పరిరక్షిస్తానని ప్రతిన బూని పాదరక్షలు లేకుండా ఎనిమిదేళ్లుగా పాదయాత్రలు చేస్తున్నారు! జ్ఞానేశ్వర్‌ ఎంఎస్సీ జువాలజీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిద్దిపేటలో బీఈడీ చదువుతున్నారు. స్వగ్రామం మంజీరా నది పరివాహకంలో ఉండటంతో రోజూ నది అందాలు ప్రకృతి చూస్తూ పెరిగారాయన. 2017లో నది చుట్టుపక్కల ఉన్న చెట్లను నరకడంతో మంజీరా నది మొత్తం ఎండిపోయిన దృశ్యమూ చూశారు. నదిలోని మొసళ్లు గ్రామాల్లోకి వచ్చేవి. పక్షులు మృతి చెందేవి. దీంతో చలించిపోయి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టారు. అందుకు బాలల్ని తన సైన్యంగా మలుచుకున్నాడు.

చిన్నారులతో కలిసి వేసవి కాలంలో సీడ్‌బాల్స్‌ (విత్తన బంతులు) తయారు చేసి మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో వాటిని విసిరారు. వర్షాలు కురిస్తే అందులోని విత్తనాలు మొల కెత్తేవి. మొదట్లో చిన్నారులను తీసుకొని వెళ్తే వారి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పేవారు. తర్వాత్తర్వాత వాళ్లూ ముందుకు వచ్చారు. మొక్కలు నాటేందుకు  చిన్నారులతో కలిసి వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లేవారు జ్ఞానేశ్వర్‌. దీంతో గ్రామస్తుల్లోనూ  చైతన్యం వచ్చింది. చెట్లను పూజించడం, తామూ మొక్కలు నాటడం  ప్రారంభించారు. ఒక్కో దఫా మంజీరా తీరంలో వెయ్యి మొక్కలు నాటాలనే లక్ష్యంతో వెళ్తారు.

అక్కడికే విద్యార్థులు భోజనం తెచ్చుకొని సాయంత్రం వరకు మొక్కలు నాటుతారు. జ్ఞానేశ్వర్‌ గత ఏడాది ఉమ్మడి మెదక్‌ జిల్లా, హైదరాబాద్, బీదర్‌లలో సైకిల్‌ యాత్ర నిర్వహించారు. నిరుడు దసరా సెలవుల్లో మంజీరా నది రక్షించాలని కోరుతూ నారాయణఖేడ్‌లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నదుల ఆవశ్యకతను తెలియజేస్తూ వాటిని ఎందుకు పరిరక్షించుకోవాలో వివరించారు. అలాగే ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి కలిగే నష్టంపై హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ ఏడాది దసరా సెలవుల్లోనూ సిద్దిపేట జిల్లా నుంచి నారాయణఖేడ్‌ వరకు ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలపై పాదయాత్ర చేపట్టారు.
– రవి ముదిరాజ్‌ తాటికొండ,
సాక్షి, మెదక్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement