డాకూర్ గ్రామ పంచాయతీ భవనం
సాక్షి, జోగిపేట: గ్రామ సర్పంచ్‌తోపాటు పాలకవర్గ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గురుతర బాధ్యతలు అప్పగించింది. వారు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే పదవికే గండం వాటిల్లేలా నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజాప్రతినిధుల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఏదో గెలిచాం. గ్రామాభివృద్ధి చూసుకుందాం అనుకున్నవారికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోకుంటే పదవికే ఎసరు వచ్చే కొత్త చిక్కు వచ్చిపడడం ఆందోళనలో పడేసింది.
ఇకపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు విధిగా హరితహారం, పారిశుధ్య, జల సంరక్షణ వంటి అంశాలపై అత్యంత శ్రద్ధ పెట్టాలి. నాటిన ప్రతీ మొక్కను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. గ్రామాల్లో ఇంటింటా ఇంకుడు గుంతలను విధిగా తవ్వించి వర్షపు నీటిని ఒడిసిపట్టే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత సర్పంచ్‌లకు అప్పగించింది.
ప్రతీ గ్రామంలో శత శాతం పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకునేలా ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత, దోమలు, ఈగల నిర్మూలన వంటి అంశాల్లో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతీ శుక్రవారం ‘స్వచ్ఛ శుక్రవారం’ పేరిట అన్ని పంచాయతీల్లోని ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి అపరిశుభ్రతను పారదోలడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ విషయంలోనూ గ్రామ సర్పంచ్‌లే క్రియాశీలకంగా వ్యవహరించాలి. అన్నీ తానై.. తానే అన్నీ అన్న చందంగా వారు పని చేయాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవి గతంకంటే భిన్నంగా.. మరింత బాధ్యతాయుతంగా ఉండనుంది. ఒకవైపు పాలనాపరమైన నిర్ణయాలతోపాటు మరోవైపు పదవిని కాపాడుకునేందుకు ఎలాగైనా ప్రభుత్వ లక్ష్యాలను విధిగా పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే సర్పంచ్ పదవీ గండం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.
పారిశుధ్య నిర్వహణపై సమగ్ర కార్యాచరణ
పారిశుధ్య నిర్వహణలో భాగంగా ప్రతీ గ్రామంలో మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాల్సిన బాధ్యత సర్పంచ్‌లపై ఉంది. దీంతోపాటు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వారు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. క్రమక్రమంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పడం, ప్రజలను ప్లాస్టిక్‌కు దూరంగా ఉంచడం, ఇంటింటికి చెత్తబుట్టల పంపిణీని సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలి. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపు యార్డులకు సక్రమంగా తరలిస్తున్నారో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యత సర్పంచ్‌లపై ఉంటుంది. గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త ఉంటే దానికి ఆ గ్రామ సర్పంచ్, కార్యదర్శులే బాధ్యులవుతారని ప్రభుత్వం హెచ్చరించింది. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్న క్రమంలో సర్పంచ్‌లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
మొక్క ఎండితే పదవికి ముప్పే
జిల్లావ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో 1.91 కోట్ల మొక్కలను నాటించాలనే సంకల్పంతో యంత్రాంగం పనులు ప్రారంభించింది. వర్షాభావ పరిస్థితులతో హరితహారం కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిర్వహించ లేదు. అక్కడక్కడా ఎవెన్యూ ప్లానిటేషన్‌ను ప్రారంభించారు. గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో నీటి లభ్యత లేక మొక్కలు ఎండిపోయాయి. ఈ క్రమంలో పరిస్థితి ఇలాగే ఉంటే నాటిన మొక్కల సంరక్షణ అనేది సర్పంచ్‌లకు కఠిన సవాలుగా మారనుంది. అధికారుల లెక్కల ప్రకారం ఉన్న మొక్కలు, నర్సరీల్లో ఉన్న మొక్కలకు చాలా వ్యత్యాసాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 647 గ్రామపంచాయతీల్లో 80 శాతం వరకు మొక్కలను సర్పంచ్‌లే రక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తేల్చింది. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం అవినీతికి పాల్పడినా, విధులు, బాధ్యతల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహించినా ఆ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, కార్యదర్శులను తీసివేసే అధికారం ప్రభుత్వానికి ఉండటంతో పంచాయతీ పాలకవర్గాల్లో గుబులు మొదలైంది. అంతే కాకుండా ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొత్త చట్టంపై పునరాలోచించాలి
ప్రజాస్వామ్య పద్ధతిలో సర్పంచ్‌గా ఎన్నికై గ్రామ ప్రథమ పౌరులుగా ఉండే వ్యక్తులను మొక్కల పెంపకం సాకుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. పారదర్శకమైన పాలన అందించకుండా, గ్రామాభివృద్ధి, గ్రామ సమస్యలపై నిర్లక్ష్యం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేయడం వంటి విషయాలపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది తప్ప వాతావరణ పరిస్థితులపై ఆధారపడే మొక్కల పెరుగుదలకు లింకు పెట్టడంపై అభ్యంతరాలున్నాయి. ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు. నాతో చాలా మంది సర్పంచ్‌లు ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రజాప్రతినిధుల గౌరవం పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కత్తి పట్టుకొని సర్పంచ్‌లతో పని చేయించే విధంగా కొత్త చట్టం ఉందనిపిస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి.
– కలాలి పూజ, డాకూరు సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment