సాక్షి, పటాన్‌చెరు: అతడు పాములను ప్రేమించేవాడు. ఎవరైనా పాము అని భయపడుతున్నారంటే వారి భయం పోగొట్టేందుకు వాటిని పట్టుకునేవాడు. వాటిని మనుషుల సంచారం లేని చోట సురక్షితంగా వదిలివేసేవాడు. ఇది అతడి వృత్తి కాదు.. ప్రవృత్తి. పాములు పట్టడం అతడికో హాబీ.. ఇంట్లోవాళ్లు వద్దన్నా వినేవాడు కాదు. అతడికి ఉద్యోగం ఉంది. అయినా పాములంటే భయపడే జనానికి ఊరట కలిగించడానికి వాటిని పట్టుకోవడం అభిరుచిగా పెట్టుకున్నాడు. చివరికి ఆ హాబీ అతడి ప్రాణం తీసిన హృదయ విదారక సంఘటన పటాన్‌చెరు ప్రజలను కలచివేసింది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో, గ్రామంలో, జిల్లాలో ఇతర చోట్ల ఎక్కడైనా పాము కనిపిస్తే ముందుగా అందరికి అభిరుచిగా పాములు పట్టే వ్యక్తి శ్రీనివాస్ ముదిరాజ్ అలియాస్ ధనుష్ గుర్తుకు వచ్చేవాడు. శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థలో కొంత కాలంగా కొనసాగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన రాజు, జయలక్ష్మిలు ముగ్గురు పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం 30 సంవత్సరాల క్రితం పటాన్‌చెరు పట్టణానికి వచ్చి శాంతినగర్ కాలనీలో ఉండేవారు.
రాజు, జయలక్ష్మిల పెద్ద కూతురు వివాహం కాగా, రెండో కుమారుడు శ్రీనివాస్ ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమలో ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయంలో ఎవరైనా పాములు తిరుగుతున్నాయని, ఇబ్బందులు పడుతున్నామని చెపితే చాలు శ్రీనివాస్ ఉచితంగా పాములను పట్టి మనుషులు తిరగని చోట్ల వదిలే వాడు. ఇది అతడికో హాబీగా మారింది. పాములు పట్టొద్దని ఇంట్లో వారు చెప్పినా సరే వారికి చెప్పకుండా వెళ్లి అదే పని చేసేవాడు. అలాంటి శ్రీనివాస్ గురువారం వికారాబాద్ జిల్లాకు పనిపై వెళ్లగా అక్కడ మోమిన్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో మర్పల్లి మండలం కొంశెట్టిపల్లి గ్రామంలో ఓ ఇంట్లోకి నాగుపాము వచ్చిందని ఫోన్ రావడంతో అక్కడే ఉన్న శ్రీను దాన్ని పట్టడానికి వెళ్లాడు.
అయితే పామును పట్టే క్రమంలో అది రెండు సార్లు శ్రీనివాస్‌ను కాటు వేసింది. అయినా ఆ పామును పట్టుకొని భద్రపరిచాడు. అనంతరం సదాశివపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. దీంతో చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ వార్త తెలియడంతో పటాన్‌చెరు పట్టణంలో విషాదం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment