చికిత్స పొందుతున్న విద్యార్థి
పుల్‌కల్(అందోల్): సంగారెడ్డి జిల్లా పుల్‌కల్ మండలంలోని సింగూరు గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఒంటిపై సాంబారు పడటంతో తీవ్రగాయాలపాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుల్‌కల్ గ్రామానికి చెందిన మైసనగారి ప్రణయ్ సింగూరు గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న ఉదయం క్యాంటీన్‌లోంచి సాంబారును డైనింగ్ హాల్‌లోకి తీసుకురావడానికి ప్రణయ్ సహకారాన్ని వంటమనిషి కోరాడు.
సాంబరు గిన్నె తీసుకెళ్తుండగా వేడివేడి సాంబారు ప్రమాదవశాత్తు ప్రణయ్ రెండు చేతులు, కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రిన్సిపాల్ బాలస్వామి వెంటనే ప్రణయ్ కుటుంబసభ్యులకు సమాచారమందించి అతడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గురుకులంలో నలుగురు వంటమనుషులు ఉండాలి. కానీ, ఒక్కరే ఉండటంతో రోజూ సీనియర్ విద్యార్థులను సహాయకులుగా వాడుకుంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులతో పనులు చేయించుకుంటున్న సింగూరు గురుకుల ప్రిన్సిపాల్, కేర్ టేకర్‌పై చర్యలు తీసుకోవాలని స్వేరోస్ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment