ఇద్దరు కుమారులతో శివశంకర్ జోస్నా దంపతులు (ఫైల్)
సంగారెడ్డి అర్బన్: పిల్లలకు నయం కాని అనారోగ్యం, ఆస్పత్రులకు అవుతున్న ఖర్చులు.. మనస్తాపంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను చున్నీతో ఉరేసి.. తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇండియన్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న శివశంకర్ ఏడు నెలల కింద ఆదిలాబాద్ నుంచి బదిలీపై వచ్చి భార్య జోస్నా, ఇద్దరు కుమారులతో కలసి సంగారెడ్డి జిల్లా కేంద్రం శాంతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. పెద్దబాబు రుద్రాక్షు (6)కు పుట్టినప్పటి నుంచి కిడ్నీల సమస్య ఉంది. చిన్నబాబు దేవాన్షు(4)కు మోషన్ (మలవిసర్జన సరిగా లేకపోవడం) సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
దీంతో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. డాక్టర్లు కూడా ఈ జబ్బులు నయం కావని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జోస్నా తన ఇద్దరు పిల్లలను చంపి తానూ చనిపోవాలని నిర్ణయించుకుంది. భర్త శివశంకర్ శుక్రవారం ఉదయం బ్యాంకుకు వెళ్లిన సమయం చూసి మధ్యాహ్నం సమయంలో ఇద్దరు కుమారులను చున్నీతో ఉరేసింది. ఇంటికి తాళం వేసి పట్టణ పరిధిలోని మహబూబ్‌సాగర్ చెరువు వద్దకు వెళ్లి భర్తకు వాట్సాప్‌లో ఫొటో పెట్టి చెరువులో దూకింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు ఆమెను పైకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న శివశంకర్ చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా, ఇద్దరు పిల్లలు బెడ్‌పై విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే భార్య, పిల్లలను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు పిల్లలిద్దరూ మృతి చెందారని నిర్ధారించారు. ప్రస్తుతం జోస్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శివశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment