ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీం అధికారులు
కల్హేర్(నారాయణఖేడ్): రెండు గ్రామాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. 11 ఇళ్ల తాళాలు పగులగొట్టి అలజడి సృష్టించారు. కల్హేర్ మండలం దేవునిపల్లి, మాసాన్‌పల్లిలో మంగళవారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో తాళాలు పగులగొట్టారు. దేవునిపల్లిలో ఎనిమిది ఇళ్లు, మాసాన్‌పల్లిలో 3 ఇళ్లలోకి దొంగలు చొరబడ్డారు. రూ. 80 వేల నగదు, బంగారు ఆభరణాలు, ఒక మేకను అపహరించారు. దేవునిపల్లి గ్రామానికి చెందిన నమిళ్ల రవి, పద్మ వెంకయ్య, ఇప్పల బాలయ్య, గంగవ్వ, వడ్ల నర్సింలు, వడిశర్ల విఠల్, జగ్గారెడ్డిగారి సాయిరెడ్డి, అంజయ్యకు సంబంధించిన ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. బీరువాలు, వస్తువులు ధ్వంసం చేశారు. బట్టలు చిందరవందరగా పడేశారు. జగ్గారెడ్డిగారి సాయిరెడ్డి ఇంట్లో రూ. 20 వేల నగదు, 10 గ్రాముల బంగారం అపహరించారు. ఇప్పల బాలయ్య ఇంటి నుంచి ఒక మేకను ఎత్తుకెళ్లారు. మిగతా ఆరు ఇళ్లలో బంగారు ఆభరణాలు, నగదు దొరకలేదు.
దీంతో ఇళ్లలో సామానంతా చిందరవందరగా పడేశారు. మాసాన్‌పల్లిలో చీటి సాయవ్వ, కొర్ల కాశిరెడ్డి, బంజ శశికల ఇంటి తాళాలు పగులగొట్టి చొరబడ్డారు. చీటి సాయవ్వ ఇంట్లో డ్వాక్రా గ్రూపులో చెల్లించేందుకు దాచిపెట్టిన రూ. 50 వేల నగదు అపహరించారు. కొర్ల కాశిరెడ్డి ఇంట్లో రూ. 10 వేలు, శశికళ ఇంట్లో 3 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. కంగ్టి సీఐ వెంకటేశ్వర్‌రావు, కల్హేర్ ఎస్‌ఐ అనిల్‌గౌడ్ దేవునిపల్లి, మాసాన్‌పల్లి గ్రామాలను సందర్శించారు. చోరీ సంఘటనలపై విచారణ జరిపారు. దొంగలు బీభత్సం సృష్టించడంతో మిస్టరీని ఛేదించేందుకు క్లూస్ టీంను రంగంలోకి దించారు. క్లూస్ టీం అధికారులు వేలిముద్రలు సేకరించారు. దొంగలు బీభత్సం సృష్టించి చోరీలు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్‌ఐ లక్ష్మణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment