two villages
-
రెండు గ్రామాల మధ్య రోడ్డు తవ్వేశారు
చిల్లకూరు : రెండు గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలో ఉన్న రోడ్డును టీడీపీ నేతలు తవ్వేయడంతో తీర ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టు సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టు పనులు చేసే వారి మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణం. తీర ప్రాంతంలోని వరగలి ప్రాంతంలో వెంకటాచలం మండలం నారికేళ్లపల్లి నుంచి వరగలి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న జాతీయ రహదారి నుంచి పల్లెవానిదిబ్బ వరకు మరో కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు.అయితే ప్రభుత్వం మారాక స్థానిక టీడీపీ నాయకులు వరగలి ప్రాంతంలో పనులు చేసే కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని సబ్ కాంట్రాక్టు కింద మట్టి, గ్రావెల్ తవ్వి తరలించే పనులు చేస్తున్నారు. ఈ పనుల కోసం వరగలి – మన్నెగుంట గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై నుంచే వాహనాలు వెళ్లాల్సి ఉంది. అయితే ఇదే మార్గంలో మరో కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాలు పల్లెవానిదిబ్బ వరకూ వెళ్లాల్సి ఉంది. ఆ పనులు కూడా తమకే అప్పగించాలని టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో వారు అందుకు ఒప్పుకోలేదు.దీంతో టీడీపీ నాయకులు ఆ సంస్థకు చెందిన వాహనాలు చుట్టూ తిరిగి వచ్చేలా మన్నేగుంట – వరగలి మధ్యలో ఉన్న రోడ్డును తవ్వేశారు. ప్రభుత్వ భూమిలోని ఈ రోడ్డుపై ఎన్నో ఏళ్లుగా రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దానిని తవ్వేయడంతో చుట్టూ తిరిగి మూడు కి.మీ. దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్థానిక వీఆర్వో మునిబాబును వివరణ కోరగా సాగరమాల రహదారి పనుల్లో ఇంజినీరింగ్ అధికారుల ఆదేశాల మేరకు పనులు చేస్తున్నారని అన్నారు. -
మూడు దశాబ్దాల తర్వాత ఒక్కటైన గ్రామస్తులు
సాక్షి, పలమనేరు/బైరెడ్డిపల్లి: ఆ గ్రామంలో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత మూడు దశాబ్దాలుగా వర్గపోరు సాగుతూనే ఉంది. ఏటా గ్రామంలో జరిగే పండుగలు సైతం రెండు వర్గాలు వేర్వేరుగానే చేసుకునేవారు. ఈ రెండు వర్గాల మధ్య పోరు చాలాకాలం పాటు సాగింది. ఫలితంగా గ్రామంలో అనాదిగా సాగే మార్గసహేశ్వరస్వామి ఉత్సవాలు 32 ఏళ్లుగా జరగలేదు. అయితే గ్రామస్తులు, ఇరువర్గాల పెద్దమనుషులు, గ్రామ యువత ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కంకణం కట్టుకున్నారు. గత పదిరోజులుగా జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో గ్రామంలోని మార్గసహేశ్వురుని సాక్షిగా గ్రామం ఒక్కటైంది. సినిమాను తలపించేలా ఉన్న యదార్థ కథనం ఇది. బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఫలించిన ఇరువర్గాల పెద్దల కృషి అడవికి ఆనుకుని ఉండే నెల్లిపట్ల చాలా పాత గ్రామం. ఈ గ్రామానికి తమిళనాడు రాష్ట్రం దగ్గరగా ఉంటుంది. తెలుగు, తమిళ సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. ఆ మండలంలో ఇదే పెద్దపంచాయతీ. 1995లో రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరి ఊరు రెండుగా చీలింది. అప్పటినుంచి ఎన్నికల సమయంలో, జాతరలప్పుడు గొడవలు జరుగుతుండేవి. గ్రామంలో జరిగే అన్ని పండుగలు రెండు దఫాలుగా రెండు వర్గాలు జరుపుకునేవి. గత 32 ఏళ్లుగా ఇరువర్గాల మధ్య జరిగిన సంఘర్షణలు, ఎన్నో ఇబ్బందులు వారిలో కొత్త ఆలోచనలకు దారితీశాయి. పాతతరం పెద్దలకు నేటి తరం యువత ఆలోచనలు కలిశాయి. గ్రామం బాగుపడాలంటే ప్రజలు సుఃఖసంతోషాలతో జీవించాలంటే గ్రామం ఒక్కటవ్వాలని భావించారు. దీంతో ఇరువర్గాలకు చెందిన పెద్దలు ఇంటికో మనిషిని రమ్మని ఇటీవల పంచాయతీ నిర్వహించారు. ఇకపై ఎటువంటి వర్గాలు లేకుండా కలిసిపోదామని మూ కుమ్మడిగా తీర్మానించారు. గ్రామ సమపంలోని పట్నపల్లి కల్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రమాణాలు చేసుకున్నారు. దీంతో గ్రామం ఒక్కటైంది. మార్గసహేశ్వరునికి సామూహిక పూజలు పౌర్ణమి సందర్భంగా బుధవారం గ్రామంలోని అందరూ కలసిపోయారు. ఊరంతా కలసి మహిళలు కలశాలతో గ్రామంలోని మార్గసహేశ్వరుని ఆలయంలో సామూహిక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆగిపోయిన ఉత్సవాలను ఇకపై ఏటా కొనసాగించనున్నట్టు పెద్దలు తెలిపారు. గ్రామస్తులంతా కలసి సహపంక్తి భోజనాలు చేశారు. -
రెండు గ్రామాల్లో దొంగల బీభత్సం
కల్హేర్(నారాయణఖేడ్): రెండు గ్రామాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. 11 ఇళ్ల తాళాలు పగులగొట్టి అలజడి సృష్టించారు. కల్హేర్ మండలం దేవునిపల్లి, మాసాన్‌పల్లిలో మంగళవారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో తాళాలు పగులగొట్టారు. దేవునిపల్లిలో ఎనిమిది ఇళ్లు, మాసాన్‌పల్లిలో 3 ఇళ్లలోకి దొంగలు చొరబడ్డారు. రూ. 80 వేల నగదు, బంగారు ఆభరణాలు, ఒక మేకను అపహరించారు. దేవునిపల్లి గ్రామానికి చెందిన నమిళ్ల రవి, పద్మ వెంకయ్య, ఇప్పల బాలయ్య, గంగవ్వ, వడ్ల నర్సింలు, వడిశర్ల విఠల్, జగ్గారెడ్డిగారి సాయిరెడ్డి, అంజయ్యకు సంబంధించిన ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. బీరువాలు, వస్తువులు ధ్వంసం చేశారు. బట్టలు చిందరవందరగా పడేశారు. జగ్గారెడ్డిగారి సాయిరెడ్డి ఇంట్లో రూ. 20 వేల నగదు, 10 గ్రాముల బంగారం అపహరించారు. ఇప్పల బాలయ్య ఇంటి నుంచి ఒక మేకను ఎత్తుకెళ్లారు. మిగతా ఆరు ఇళ్లలో బంగారు ఆభరణాలు, నగదు దొరకలేదు. దీంతో ఇళ్లలో సామానంతా చిందరవందరగా పడేశారు. మాసాన్‌పల్లిలో చీటి సాయవ్వ, కొర్ల కాశిరెడ్డి, బంజ శశికల ఇంటి తాళాలు పగులగొట్టి చొరబడ్డారు. చీటి సాయవ్వ ఇంట్లో డ్వాక్రా గ్రూపులో చెల్లించేందుకు దాచిపెట్టిన రూ. 50 వేల నగదు అపహరించారు. కొర్ల కాశిరెడ్డి ఇంట్లో రూ. 10 వేలు, శశికళ ఇంట్లో 3 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. కంగ్టి సీఐ వెంకటేశ్వర్రావు, కల్హేర్ ఎస్ఐ అనిల్‌గౌడ్ దేవునిపల్లి, మాసాన్‌పల్లి గ్రామాలను సందర్శించారు. చోరీ సంఘటనలపై విచారణ జరిపారు. దొంగలు బీభత్సం సృష్టించడంతో మిస్టరీని ఛేదించేందుకు క్లూస్ టీంను రంగంలోకి దించారు. క్లూస్ టీం అధికారులు వేలిముద్రలు సేకరించారు. దొంగలు బీభత్సం సృష్టించి చోరీలు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. -
ఇరు గ్రామాల మధ్య కొట్లాట
ఎచ్చెర్ల క్యాంపస్ : ఆటోలో ప్రయాణికులను తీసుకువెళ్లే విషయంలో బడివానిపేట, కొత్తవానిపేట గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రామాల యువకులు ఒకరిపై ఒకరు దాడికి దిగేవరకు దారి తీసింది. బడివానిపేట గ్రామానికి చెందిన ప్రయాణికులను కొత్తవానిపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తీసుకువెళ్లలేదని వారి వాదన. అయితే కొత్తవానిపేట ఆటోను బడివానిపేట గ్రామస్తులు మార్గమధ్యలో శుక్రవారం నిలిపివేశారు. దీంతో ఇరు గ్రామాల యువకులు కొయ్యాం రోడ్డులో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇరు గ్రామాలకు చెందిన మైలపల్లి నారాయుడు, లక్ష్మణ, చంటి కొత్త అప్పన్న, అలుపాన అప్పన్న, నిమ్మ రాములతో పాటు మరి కొందరికి గాయాలయ్యాయి. విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో ఆయా గ్రామాలకు వెళ్లి సందర్శించారు. ఈ గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి, శాంతి భద్రతలు సమీక్షిస్తున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. -
నీటి కోసం ఘర్షణ : 300 మందిపై కేసు!
చంఢీఘర్ : నీటి కోసం హర్యానాలోని రెండు గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12మందికి గాయాలు కాగా.. దీనితో సంబంధం ఉన్న 300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. హిసర్ జిల్లాలోని పుతి మంగల్ఖాన్, పీరాన్‌వాలీ గ్రామాల మధ్య దగ్గర్లోని కెనాల్ నుంచి నీటి తరలింపు విషయంలో వివాదం తలెత్తింది. పీరాన్‌వాలీ గ్రామస్థులు కెనాల్ నుంచి అనుమతులు లేకుండా పంపుసెట్ ఏర్పాటు చేసి నీటి తరలింపు చేపడుతున్నారని ఆరోపిస్తూ మంగల్ఖాన్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో పీరాన్‌వాలీ ప్రజలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన గొడవ ఇరు వర్గాల మధ్య పెనుగులాటకు దారితీసింది. ఈ దాడుల్లో బైకులకు కూడా నిప్పు పెట్టారు. కొత్తగా ఏర్పాటు చేసిన పంపుసెట్ కూడా కాలిపోయింది. ఇరు గ్రామాలకు చెందిన వందలాది మంది ఘర్షణలో పాల్గొన్నారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలు కాగా, 8 బైక్‌లు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న దాదాపు 300 మందిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు గ్రామాల మధ్య మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు. -
రెండు గ్రామాల మధ్య పంక్షన్ తెచ్చిన తంటా
-
పంక్షన్ తెచ్చిన తంటా.. గ్రామాల మధ్య ఘర్షణ
సాక్షి, తూర్పు గోదావరి : మూడు రోజుల క్రితం ఓ ఫంక్షన్లో తలెత్తిన వివాదంతో మొదలైన ఘర్షణ నేటికి కొనసాగుతుంది. దీంతో జిల్లాలోని తొర్రేడు, వెంకటనగరం గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలివి.. తొర్రేడు గ్రామానికి చెందిన యువకులు ఆదివారం వెంకటనగరం వెళ్లడంతో గొడవ మళ్లీ మొదలైంది. అనంతరం ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో గ్రామస్తులతో పాటు వారిని చెదరగొట్టడానికి వచ్చిన పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రెండు గ్రామాల ప్రజలను చెదరగొట్టారు. అంతేకాక పోలీసులు ఇరు గ్రామాల ప్రజల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో వెంకటనగరం గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. -
రెండు గ్రామాల్లో దొంగల హల్చల్
రామచంద్రాపురం(భువనగిరి అర్బన్) భువనగిరి మండలంలోని రామచంద్రాపురం, రామకృష్ణపురం గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దొంగలు హల్చల్ చేశారు. నాలుగు ఇళ్లలో చోరీ చేశారు. మరో రెండిళ్లలో దొంగతనానికి ప్రయత్నించారు. ఈ ఇళ్లలో మొత్తం అరతులం బంగారం, 40 తులాల వెండి, రూ. 2వేల నగదు అపహరించుకుపోయారు. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన స్వప్న భర్త బుచ్చిరెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తన చిన్న కూతురు స్వర్ణలతతో కలిసి ఉంటున్నారు. శనివారం తమ ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని నాగారంలో ఉన్న ఆమె పెద్ద కుమార్తె స్వాతి ఇంటికి వె ళ్లారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు ఇంటికి ఉన్న తాళంను తమ వెంట తెచ్చుకున్న గడ్డపారతో పగులగొట్టి లోనికి ప్రవేశించి బెడ్ రూంలో ఉన్న రెండు బీరువాలను తెరిచారు. అందులో ఉన్న అర తులం బంగారం, 20 తులాల వెండి, 1000 రూపాయల నగదును అపహరించకపోయారు. మరో ఇంట్లో.. అక్కడి నుంచి వారి ఇంటికి ఎదురుగా ఉన్న కొమ్మురెల్లి వెంకట్‌రెడ్డి గృహంలోకి ప్రవేశించారు. కాగా వెంకటరెడ్డి కొన్ని రోజులుగా తన ఇంటికి కీడు వచ్చిందని పక్కన మరో ఇంట్లో ఉంటూ సామగ్రి అందులోనే ఉంచాడు. దాంతో వదిలేసిన ఇంట్లోని బీరువాను తెరచి అందులో ఉన్న 24 తులాల వెండి సామగ్రిని, రూ. వెయ్యి నగదు చోరీ చేశారు. రామకృష్ణాపురంలో.. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన భువనగిరి సోమయ్య ఇంట్లో ఎవరూ లేక పోవడంతో బీరువాలో ఉ న్న రూ. 5 వేల నగదును అపహరించుకుని, పక్కనే ఉన్న కోళ్ల మహేష్‌కు చెందిన ఎఫ్‌జెడ్ బైకును తీసుకెళ్లారు. అక్కడి నుంచి వెళ్లి సుర్పంగ మల్లేష్, భువన గిరి ఈశ్వర్ ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు. ఇళ్లలో ఉన్న వారు గమనించడంలో అక్కడి నుంచి పారిపోయారు. బైక్‌ను గ్రామ సమీపంలో వదిలి వెళ్లారు. ఉదయం 5 గంటల సమయంలో తలుపులు తెరచి ఉండటాన్ని చూసిన గ్రామస్తులు చోరీ జరిగిందని భావించి వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ అర్జునయ్య, ఎస్ఐ సాజిదుల్లా, సిబ్బంది వెంటనే అక్కడికి చెరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిం చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్ఐ ఎండీ.సాజిదుల్లా తెలిపారు.