టీడీపీ నాయకుల నిర్వాకం
చిల్లకూరు : రెండు గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలో ఉన్న రోడ్డును టీడీపీ నేతలు తవ్వేయడంతో తీర ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టు సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టు పనులు చేసే వారి మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణం. తీర ప్రాంతంలోని వరగలి ప్రాంతంలో వెంకటాచలం మండలం నారికేళ్లపల్లి నుంచి వరగలి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న జాతీయ రహదారి నుంచి పల్లెవానిదిబ్బ వరకు మరో కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు.
అయితే ప్రభుత్వం మారాక స్థానిక టీడీపీ నాయకులు వరగలి ప్రాంతంలో పనులు చేసే కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని సబ్ కాంట్రాక్టు కింద మట్టి, గ్రావెల్ తవ్వి తరలించే పనులు చేస్తున్నారు. ఈ పనుల కోసం వరగలి – మన్నెగుంట గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై నుంచే వాహనాలు వెళ్లాల్సి ఉంది. అయితే ఇదే మార్గంలో మరో కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాలు పల్లెవానిదిబ్బ వరకూ వెళ్లాల్సి ఉంది. ఆ పనులు కూడా తమకే అప్పగించాలని టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో వారు అందుకు ఒప్పుకోలేదు.
దీంతో టీడీపీ నాయకులు ఆ సంస్థకు చెందిన వాహనాలు చుట్టూ తిరిగి వచ్చేలా మన్నేగుంట – వరగలి మధ్యలో ఉన్న రోడ్డును తవ్వేశారు. ప్రభుత్వ భూమిలోని ఈ రోడ్డుపై ఎన్నో ఏళ్లుగా రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దానిని తవ్వేయడంతో చుట్టూ తిరిగి మూడు కి.మీ. దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్థానిక వీఆర్వో మునిబాబును వివరణ కోరగా సాగరమాల రహదారి పనుల్లో ఇంజినీరింగ్ అధికారుల ఆదేశాల మేరకు పనులు చేస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment