ఇరు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో దగ్దమైన బైక్
చంఢీఘర్ : నీటి కోసం హర్యానాలోని రెండు గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12మందికి గాయాలు కాగా.. దీనితో సంబంధం ఉన్న 300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. హిసర్ జిల్లాలోని పుతి మంగల్‌ఖాన్, పీరాన్‌వాలీ గ్రామాల మధ్య దగ్గర్లోని కెనాల్ నుంచి నీటి తరలింపు విషయంలో వివాదం తలెత్తింది. పీరాన్‌వాలీ గ్రామస్థులు కెనాల్ నుంచి అనుమతులు లేకుండా పంపుసెట్ ఏర్పాటు చేసి నీటి తరలింపు చేపడుతున్నారని ఆరోపిస్తూ మంగల్‌ఖాన్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో పీరాన్‌వాలీ ప్రజలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
చిన్నగా మొదలైన గొడవ ఇరు వర్గాల మధ్య పెనుగులాటకు దారితీసింది. ఈ దాడుల్లో బైకులకు కూడా నిప్పు పెట్టారు. కొత్తగా ఏర్పాటు చేసిన పంపుసెట్ కూడా కాలిపోయింది. ఇరు గ్రామాలకు చెందిన వందలాది మంది ఘర్షణలో పాల్గొన్నారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలు కాగా, 8 బైక్‌లు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న దాదాపు 300 మందిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు గ్రామాల మధ్య మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment