హిసార్ : 'క్రికట్ కంటే నాకు ఈ పోలీస్ డ్యూటీనే కష్టంగా ఉందంటూ' 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ పేర్కొన్నాడు. జోగిందర్ శర్మ క్రికెట్‌కు దూరమైన తర్వాత హర్యానాలోని హిసార్ జిల్లా డీఎప్పీగా విధుల నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. జోగిందర్ కూడా అందరి పోలీసుల్లాగే డీఎస్పీగా కరోనా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తాను 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నానని జోగి చెప్పుకొచ్చాడు. ఆటతో పోలిస్తే ఈ డ్యూటీ కొంచెం కష్టంగానే అనిపిస్తున్నప్పటికి తాను దేశం కోసమే సేవ చేస్తుండడంతో బాధ అనేది లేదని పేర్కొన్నాడు. (ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ అవసరమా?)
'పొద్దున ఉదయం 6గంటలకు లేవడంతో నా డ్యూటీ మొదలవుతుంది. రోజూ ఉదయం 9గంటలకు డ్యూటీ నిమ్మిత్తం వెళ్లి రాత్రి 8గంటల తర్వాత కూడా ఎమర్జెన్సీ కాల్స్ ఉండడంతో 24 గంటల పాటే విధులు నిర్వహిస్తున్నా. నా పరిధిలో హిసార్ జిల్లా రూరల్ భాగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతీరోజు చెక్‌పోస్ట్ వద్ద నిలబడి బస్ డ్రైవర్లకు, ప్రైవేటు వాహనాలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం. ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి.. అవసరం ఉంటేనే బయటికి రండి అని సూచిస్తున్నాం. ఇంకా కొన్ని సందర్భాల్లో దేశంలో లాక్‌డౌన్ ఉండడంతో యూపీ, బీహార్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కాలి నడకన వారి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. నేను నా టీంతో కలిసి వారిని ఆపి కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లకు తరలిస్తున్నాం. ఇదంతా కష్టంగా అనిపిస్తున్నా దేశంకోసమే చేస్తున్నాననుకొని సరిపెట్టుకుంటున్నా. నా కుటుంబంతో కలిసి రోహ్‌తక్‌లో నివసిస్తున్న నాకు హిసార్ ప్రాంతం 110 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నా.. డ్యూటీ నేపథ్యంలో రోజుకు ఎంతోమందిని కలవడంతో ఇంటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.(నెట్‌వర్క్ కోసం చెట్లు ఎక్కుతూ అంపైర్ పాట్లు!)
2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. దీంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన జోగిందర్ 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్‌లో అందించిన సేవలకుగానూ హర్యానా ప్రభుత్వం అతన్ని డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమించిన విషయం తెలిసిందే. జోగిందర్ శర్మ టీమిండియా తరపున 4 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 6వేలకు పైగా చేరుకోగా, మృతుల సంఖ్య 206కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment