రెండు గ్రామాల్లో దొంగల హల్‌చల్
రామచంద్రాపురం(భువనగిరి అర్బన్) భువనగిరి మండలంలోని రామచంద్రాపురం, రామకృష్ణపురం గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దొంగలు హల్‌చల్ చేశారు. నాలుగు ఇళ్లలో చోరీ చేశారు. మరో రెండిళ్లలో దొంగతనానికి ప్రయత్నించారు. ఈ ఇళ్లలో మొత్తం అరతులం బంగారం, 40 తులాల వెండి, రూ. 2వేల నగదు అపహరించుకుపోయారు.
పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన స్వప్న భర్త బుచ్చిరెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తన చిన్న కూతురు స్వర్ణలతతో కలిసి ఉంటున్నారు. శనివారం తమ ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని నాగారంలో ఉన్న ఆమె పెద్ద కుమార్తె స్వాతి ఇంటికి వె ళ్లారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు ఇంటికి ఉన్న తాళంను తమ వెంట తెచ్చుకున్న గడ్డపారతో పగులగొట్టి లోనికి ప్రవేశించి బెడ్ రూంలో ఉన్న రెండు బీరువాలను తెరిచారు. అందులో ఉన్న అర తులం బంగారం, 20 తులాల వెండి, 1000 రూపాయల నగదును అపహరించకపోయారు.
మరో ఇంట్లో..
అక్కడి నుంచి వారి ఇంటికి ఎదురుగా ఉన్న కొమ్మురెల్లి వెంకట్‌రెడ్డి గృహంలోకి ప్రవేశించారు. కాగా వెంకటరెడ్డి కొన్ని రోజులుగా తన ఇంటికి కీడు వచ్చిందని పక్కన మరో ఇంట్లో ఉంటూ సామగ్రి అందులోనే ఉంచాడు. దాంతో వదిలేసిన ఇంట్లోని బీరువాను తెరచి అందులో ఉన్న 24 తులాల వెండి సామగ్రిని, రూ. వెయ్యి నగదు చోరీ చేశారు.
రామకృష్ణాపురంలో..
రామకృష్ణాపురం గ్రామానికి చెందిన భువనగిరి సోమయ్య ఇంట్లో ఎవరూ లేక పోవడంతో బీరువాలో ఉ న్న రూ. 5 వేల నగదును అపహరించుకుని, పక్కనే ఉన్న కోళ్ల మహేష్‌కు చెందిన ఎఫ్‌జెడ్ బైకును తీసుకెళ్లారు. అక్కడి నుంచి వెళ్లి సుర్పంగ మల్లేష్, భువన గిరి ఈశ్వర్ ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు. ఇళ్లలో ఉన్న వారు గమనించడంలో అక్కడి నుంచి పారిపోయారు. బైక్‌ను గ్రామ సమీపంలో వదిలి వెళ్లారు. ఉదయం 5 గంటల సమయంలో తలుపులు తెరచి ఉండటాన్ని చూసిన గ్రామస్తులు చోరీ జరిగిందని భావించి వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ అర్జునయ్య, ఎస్‌ఐ సాజిదుల్లా, సిబ్బంది వెంటనే అక్కడికి చెరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిం చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్‌ఐ ఎండీ.సాజిదుల్లా తెలిపారు.