
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు (ఫైల్ ఫొటో)
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకోబోతున్నాయి. సముద్రమట్టానికి ఎత్తై న ప్రాంతంలో ఉండే నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు గోదావరి జలాలను తరలించాలనే ఇక్కడి రైతుల ఎన్నో ఏళ్ల కళ సాకారమవబోతోంది. ఈ రెండు ఎత్తిపోతల పనులకు సీఎం కేసీఆర్ సోమవారం భూమి పూజ చేయనున్నారు. తర్వాత నారాయణఖేడ్ శివారులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.
మల్లన్నసాగర్ నుంచి 12 టీఎంసీలు తరలించి..
సంగమేశ్వర, బసవేశ్వర పథకాలకు రాష్ట్రం రూ.4,427 కోట్లు ఖర్చు చేయనుంది. వీటి నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. మొత్తం 397 గ్రామాలకు చెందిన రైతులు లబ్ధి పొందనున్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ జలాశయం నుంచి సుమారు 12 టీఎంసీల నీటిని సింగూరు జలాశయానికి తరలిస్తారు. అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా ఆయకట్టుకు మళ్లించేలా ఈ పథకాలను డిజైన్ చేశారు. రెండు ఎత్తిపోతల పథకాలకు కలిపి 5 పంప్‌హౌజ్‌లను నిర్మించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నీటి పారుదల శాఖ ఇప్పటికే టెండరు ప్రక్రియను పూర్తి చేయగా మెగా కంపెనీ పనులు దక్కించుకుంది.
సంగారెడ్డి సస్యశ్యామలం: హరీశ్
నారాయణఖేడ్: సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న రెండు ఎత్తిపోతల పథకాలు సంగారెడ్డి జిల్లాకు వరప్రదాయనిగా మారనున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం నారాయణఖేడ్‌లో జరగనున్న సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలసి ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఈ ప్రాంత అభివృద్ధికోసం రూ.4,500 కోట్లతో రూ.3.89 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను మంజూరు చేశారన్నారు.
ఈ ప్రాజెక్టులతో జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో 406 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, సర్వే పనులు పూర్తయ్యేందుకు ఏడాది పట్టిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment