పండరి గౌడ్
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: బతికుండగానే తనకు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారని సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్‌కు చెందిన 74 ఏళ్ల షాపురం పండరిగౌడ్ గురువారం అదనపు కలెక్టర్ రాజర్షిషాను కలసి ఫిర్యాదు చేశారు. పంచాయతీ అధికారులు తనను మనస్తాపానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్‌ను ప్రతినెలా తీసుకుంటున్నానని, రేషన్‌షాపుల్లో కూడా ప్రతినెలా నిత్యావసరాలను తీసుకుంటున్నానని పేర్కొన్నారు. తన ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా ఈ విషయం బయటపడిందని తెలిపారు. 2010 అక్టోబర్ 11న పంచాయతీ అధికారులు తన మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసినట్లు తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ ‘సాక్షి’తో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment