Death certification
-
నేను చనిపోలేదు మహాప్రభో..
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: బతికుండగానే తనకు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారని సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్‌కు చెందిన 74 ఏళ్ల షాపురం పండరిగౌడ్ గురువారం అదనపు కలెక్టర్ రాజర్షిషాను కలసి ఫిర్యాదు చేశారు. పంచాయతీ అధికారులు తనను మనస్తాపానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్‌ను ప్రతినెలా తీసుకుంటున్నానని, రేషన్‌షాపుల్లో కూడా ప్రతినెలా నిత్యావసరాలను తీసుకుంటున్నానని పేర్కొన్నారు. తన ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా ఈ విషయం బయటపడిందని తెలిపారు. 2010 అక్టోబర్ 11న పంచాయతీ అధికారులు తన మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసినట్లు తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ ‘సాక్షి’తో తెలిపారు. -
మరణ ధ్రువీకరణకూ ఆధార్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వ్యక్తుల గుర్తింపులో మోసాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు మినహా దేశమంతటా ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాల కోసం త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆధార్‌ను తప్పనిసరి చేయడం ద్వారా మరణ ధ్రువీకరణ పత్రం కోసం రకరకాల డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదని హోంశాఖ నేతృత్వంలో పనిచేసే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం(ఓఆర్జీ) తెలిపింది. ఈ విషయమై తమ అభిప్రాయాలను అక్టోబర్ 1కల్లా తెలియజేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరినట్లు వెల్లడించింది. మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసే సమయంలో చనిపోయిన వ్యక్తి ఆధార్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీతో పాటు అతని/ఆమె జీవిత భాగస్వామి ఆధార్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. దీంతో పాటు దరఖాస్తుదారు కూడా తన ఆధార్‌ను సమర్పించాల్సి ఉంటుందని ఓఆర్జీ పేర్కొంది. చనిపోయినవారి ఆధార్ వివరాలపై స్పష్టత లేకుంటే..తనకు తెలిసినంతవరకు మృతుడు/మృతురాలికి ఆధార్ లేదని దరఖాస్తుదారు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ దరఖాస్తుదారు తప్పుడు వివరాలు ఇస్తే ఆధార్ చట్టం–2016, జనన, మరణాల రిజిస్ట్రేషన్ చట్టం–1969 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
డెత్ సర్టిఫికెట్‌కు.. రూ. ఐదు వేలు ఇమ్మంటున్నారు..
విజయనగరం కంటోన్మెంట్ : తన భర్త మృతికి సంబంధించి డెత్ సర్టిఫికెట్ మంజూరుకు కార్యదర్శి డేవిడ్ రాజు ఐదు వేల రూపాయల లంచం అడుగుతున్నారని రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన పి. నరస అనే మహిళ సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో అధికారులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్లుగా సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. డెత్ సర్టిఫికెట్ వస్తే పొదుపు సంఘం ద్వారా తనకు బీమా సొమ్ము వస్తుందని, అధికారులు స్పందించి వెంటనే సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరింది. దీనికి అధికారులు స్పందిస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 219 వినతులను కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ బి.రామారావు, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, తదితరులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. బోటు వేయండి తాటిపూడి రిజర్వాయర్ బోటు పాడవ్వడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కొండపర్తి సర్పంచ్ పి. తిరుపతిరావు, ఉప సర్పంచ్ కొర్లాపు ఉగాది, తదితరులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి కిలోమీటర్ల కొద్దీ నడచి వెళ్లాల్సి వస్తోందన్నారు. బోటు ఉంటే ఉద్యోగులు, సామన్యులు సులువుగా రాకపోకలు చేయవచ్చన్నారు. దీనికి కలెక్టర్ కాంతిలాల్ దండే స్పందిస్తూ పాతబోటును వేలం వేసి వచ్చిన సొమ్ముకు ఐటీడీఏ సొమ్ము కలిపి కొత్తబోటు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్రమాల నిగ్గు తేల్చండి! బొండపల్లి మండలం రాచకిండాంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘంలో దీర్ఘ, స్వల్పకాలిక రుణాల మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిని పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డెరైక్టర్లు బి. నారాయణరావు, పీవీఎస్ నాయుడు ఫిర్యాదు చేశారు. బలవంతంగా రాజీనామా చేయించారు ఎంపీటీసీగా పోటీ చేయాలంటే ఉద్యోగానికి తప్పకరాజీనామా చేయాలని తనతో కొంతమంది బలవంతంగా రాజీనామా చేయించారని ఎల్.కోట మండలం వీరభద్రపేట గ్రామ సాక్షరభారత్ కోఆర్డినేటర్ తూర్పాటి చిన్నమ్మలు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి వెంటనే పోటీ నుంచి తప్పుకున్నా, తనతో రాజీనామా చేయించారని వాపోయింది. తెలియక చేసిన తప్పును మన్నించి తన ఉద్యోగం తనకు ఇప్పించాలని వినతిప్రతం అందజేసింది.