విజయనగరం కంటోన్మెంట్ : తన భర్త మృతికి సంబంధించి డెత్ సర్టిఫికెట్ మంజూరుకు కార్యదర్శి డేవిడ్ రాజు ఐదు వేల రూపాయల లంచం అడుగుతున్నారని రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన పి. నరస అనే మహిళ సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో అధికారులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్లుగా సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. డెత్ సర్టిఫికెట్ వస్తే పొదుపు సంఘం ద్వారా తనకు బీమా సొమ్ము వస్తుందని, అధికారులు స్పందించి వెంటనే సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరింది. దీనికి అధికారులు స్పందిస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 219 వినతులను కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ బి.రామారావు, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, తదితరులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
బోటు వేయండి
తాటిపూడి రిజర్వాయర్ బోటు పాడవ్వడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కొండపర్తి సర్పంచ్ పి. తిరుపతిరావు, ఉప సర్పంచ్ కొర్లాపు ఉగాది, తదితరులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి కిలోమీటర్ల కొద్దీ నడచి వెళ్లాల్సి వస్తోందన్నారు. బోటు ఉంటే ఉద్యోగులు, సామన్యులు సులువుగా రాకపోకలు చేయవచ్చన్నారు. దీనికి కలెక్టర్ కాంతిలాల్ దండే స్పందిస్తూ పాతబోటును వేలం వేసి వచ్చిన సొమ్ముకు ఐటీడీఏ సొమ్ము కలిపి కొత్తబోటు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అక్రమాల నిగ్గు తేల్చండి!
బొండపల్లి మండలం రాచకిండాంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘంలో దీర్ఘ, స్వల్పకాలిక రుణాల మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిని పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డెరైక్టర్లు బి. నారాయణరావు, పీవీఎస్ నాయుడు ఫిర్యాదు చేశారు.
బలవంతంగా రాజీనామా చేయించారు
ఎంపీటీసీగా పోటీ చేయాలంటే ఉద్యోగానికి తప్పకరాజీనామా చేయాలని తనతో కొంతమంది బలవంతంగా రాజీనామా చేయించారని ఎల్.కోట మండలం వీరభద్రపేట గ్రామ సాక్షరభారత్ కోఆర్డినేటర్ తూర్పాటి చిన్నమ్మలు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి వెంటనే పోటీ నుంచి తప్పుకున్నా, తనతో రాజీనామా చేయించారని వాపోయింది. తెలియక చేసిన తప్పును మన్నించి తన ఉద్యోగం తనకు ఇప్పించాలని వినతిప్రతం అందజేసింది.
డెత్ సర్టిఫికెట్‌కు.. రూ. ఐదు వేలు ఇమ్మంటున్నారు..
Published Tue, Jul 1 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM
Advertisement
Advertisement