మరణ ధ్రువీకరణకూ ఆధార్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వ్యక్తుల గుర్తింపులో మోసాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు మినహా దేశమంతటా ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాల కోసం త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఆధార్‌ను తప్పనిసరి చేయడం ద్వారా మరణ ధ్రువీకరణ పత్రం కోసం రకరకాల డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదని హోంశాఖ నేతృత్వంలో పనిచేసే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం(ఓఆర్‌జీ) తెలిపింది. ఈ విషయమై తమ అభిప్రాయాలను అక్టోబర్ 1కల్లా తెలియజేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరినట్లు వెల్లడించింది. మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసే సమయంలో చనిపోయిన వ్యక్తి ఆధార్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో పాటు అతని/ఆమె జీవిత భాగస్వామి ఆధార్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది.
దీంతో పాటు దరఖాస్తుదారు కూడా తన ఆధార్‌ను సమర్పించాల్సి ఉంటుందని ఓఆర్‌జీ పేర్కొంది. చనిపోయినవారి ఆధార్ వివరాలపై స్పష్టత లేకుంటే..తనకు తెలిసినంతవరకు మృతుడు/మృతురాలికి ఆధార్ లేదని దరఖాస్తుదారు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ దరఖాస్తుదారు తప్పుడు వివరాలు ఇస్తే ఆధార్ చట్టం–2016, జనన, మరణాల రిజిస్ట్రేషన్ చట్టం–1969 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.