త్రిలింగ దేశం.. ఆ తర్వాత తిలింగరాజ్యం.. కొందరు మహమ్మదీయ రాజులు తిలింగ్, తెలింగ అని.. మరికొందరు విదేశీయులు ట్రిలింగాన్ అని.. వేర్వేరు సామ్రాజ్యాలు, కాలాల్లో ఇలా రకరకాల పేర్లతో సంబోధించారు. ఆ ప్రాంతమే ప్రస్తుత తెలంగాణ. మరి మొదటిసారి తెలంగాణ అన్న పదాన్ని ఎవరు, ఎప్పుడు వాడారో తెలుసా? ఇప్పుడు దానికి సంబంధించిన శాసనమే ఆసక్తి రేపుతోంది. ఆరు శతాబ్దాల క్రితం వేయించిన ఆ శాసనం ఇరుకు సందులో ఇళ్ల మధ్య బందీ అయిపోయింది. దాని గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకుండా పోయింది. కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు రికార్డు చేసినా, అది కొంతమందికే పరిమితమైంది. దేశంలో 29వ రాష్ట్రం (కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారకముందు)గా ఆవిర్భవించిన తెలంగాణ పేరును తొలిసారి లిఖితపూర్వకంగా వాడింది ఈ శాసనంలోనే. అంటే ‘తెలంగాణ’అస్తిత్వానికి తొలి నిదర్శనం అన్నమాట. - సాక్షి, హైదరాబాద్
‘తెలుంగాణపురం’ఎక్కడుంది?
ఈ ప్రశ్నకు...‘అది మన రాష్ట్రం పేరు, ఆ పేరుతో ఊరు కూడా ఉందా?’అన్న ఎదురు ప్రశ్నే సమాధానంగా వస్తుంది. కానీ ఆ పేరుతో ఓ ఊరు కూడా ఉండేది.. అది ఎక్కడో కాదు... భాగ్యనగర శివార్లలోనే. అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ పురోగతికి ఇప్పుడు చిరునామాగా కనిపిస్తున్న తెల్లాపూరే... ఒకప్పటి తెలుంగాణపురం. కాలక్రమంలో తెలుంగాణపు రం కాస్తా క్రమంగా తెల్లాపూర్‌గా మారిపోయింది. తెలంగాణ అన్న పదం ఉన్న తొలి తెలుగు శాసనం వెలుగుచూసింది ఈ గ్రామంలోనే. ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోకి వస్తుంది.
604 ఏళ్ల కిందట..
బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా తన రాజ్యాన్ని విస్తరించే క్రమంలో 1417లో విజయనగర రాజు రెండో దేవరాయల అధీనంలో ఉన్న పానగల్లు కోట మీద దాడికి బయలుదేరాడు. దారిలో కనిపించిన హిందూ సంప్రదాయ కట్టడాలను ధ్వంసం చేయటం ఆ సైన్యం పనిగా పెట్టుకుంది. ఈ క్రమంలో పలు మందిరాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో తెల్లాపూర్ కూడా ప్రణాళికాబద్ధంగా ఎదిగిన పట్టణం. తెలుంగాణ పురమన్న పేరుతో అభివృద్ధి చెందిన ప్రాంతం. కొందరు విశ్వకర్మలు ఈ ప్రాంతంలో మంచి పనిమంతులైన శిల్పులుగా పేరుపొంది ఉన్నారు. వారు నగల తయారీలోనే కాకుండా, నగర ప్రణాళికల రూపకల్పనలోనూ నేర్పు ఉన్నవారు. అందులో కొండమీది మల్లోజు, అతని కొడుకులు నాగోజు, అయ్యలోజు, వల్లబోజు తదితరులు ఇక్కడ పెద్ద మామాడి తోటను నిర్వహించేవారు. దానికి నీటి కోసం విశాలమైన దిగుడు బావి తవ్వించి ఏతాం పద్ధతిలో నీటి సాగుకు వాడేవారు. పానగల్లు కోటపై దాడి కోసం ఫిరోజ్ షా ఇదే మార్గంలో వెళ్లనున్నారని తెలిసి, వారు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఫిరోజ్ షా భార్యకు బంగారు పూదండలు దిద్దిన కంఠాభరణం, బంగారు గాజులు అందంగా తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాలను వివరిస్తూ ప్రత్యేకంగా ఆ మల్లోజు వంశస్తులు ప్రశస్తి శాసనం చెక్కి దిగుడుబావి పైన ఏతాం కోసం ఏర్పాటు చేసిన రాతి స్తంభాల మధ్య ఏర్పాటు చేయించారు. అదే ఈ శాసనం. అందులో ఈ ప్రాంతాన్ని తెలుంగాణపురంగా పేర్కొన్నారు. ఆ శాసనంపై తెలుగులో24 పంక్తుల వివరాలున్నాయి.
రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా పురావస్తు శాఖలో స్తపతి ఈమని శివనాగిరెడ్డి ఈ శాసనాన్ని 2008లో పరిశీలించారు. అప్పటికే బావిని సింహభాగం పూడ్చేశారు. కొన్ని మెట్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. పైగా గిరక కోసం ఏర్పాటు చేసిన రెండు రాతి శిలలు పడిపోయే పరిస్థితిలో ఉండటంతో ఆయన వాటిని క్రమపద్ధతిలో పూర్వపు స్థితిలో తిరిగి ఏర్పాటు చేయించారు. ఆ శిలల దిగువన కాకతీయ శైలిలో కళాత్మకంగా చెక్కిన భారీ రాతి బేస్ ఉంది. ఆ తర్వాత మొత్తం బావిని స్థానికులు పూడ్చేశారు. ఇప్పుడు దాని చుట్టూ ఇళ్లు వెలియటంతో పూర్తి ఇరుకు స్థలంలో ఆ శాసనం బందీగా ఉండిపోయింది. అప్పట్లోనే శివనాగిరెడ్డి... నేతలను తీసుకెళ్లి దీన్ని చూపించారు.
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి
‘తెలంగాణ అన్న పేరును వాడిన తొలి శాసనానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యం దక్కాలి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ఇంత పెద్ద ఉద్యమంతో ఏర్పడ్డ రాష్ట్రంలో.. రాష్ట్రం పేరును తొలిసారి వాడిన శాసనంగా దానికి అందలం దక్కాల్సి ఉంది. -శివనాగిరెడ్డి, చరిత్రకారులు
Comments
Please login to add a commentAdd a comment