historians
-
తెలుంగాణపురం ఎక్కడుందో తెలుసా?
త్రిలింగ దేశం.. ఆ తర్వాత తిలింగరాజ్యం.. కొందరు మహమ్మదీయ రాజులు తిలింగ్, తెలింగ అని.. మరికొందరు విదేశీయులు ట్రిలింగాన్ అని.. వేర్వేరు సామ్రాజ్యాలు, కాలాల్లో ఇలా రకరకాల పేర్లతో సంబోధించారు. ఆ ప్రాంతమే ప్రస్తుత తెలంగాణ. మరి మొదటిసారి తెలంగాణ అన్న పదాన్ని ఎవరు, ఎప్పుడు వాడారో తెలుసా? ఇప్పుడు దానికి సంబంధించిన శాసనమే ఆసక్తి రేపుతోంది. ఆరు శతాబ్దాల క్రితం వేయించిన ఆ శాసనం ఇరుకు సందులో ఇళ్ల మధ్య బందీ అయిపోయింది. దాని గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకుండా పోయింది. కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు రికార్డు చేసినా, అది కొంతమందికే పరిమితమైంది. దేశంలో 29వ రాష్ట్రం (కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారకముందు)గా ఆవిర్భవించిన తెలంగాణ పేరును తొలిసారి లిఖితపూర్వకంగా వాడింది ఈ శాసనంలోనే. అంటే ‘తెలంగాణ’అస్తిత్వానికి తొలి నిదర్శనం అన్నమాట. - సాక్షి, హైదరాబాద్ ‘తెలుంగాణపురం’ఎక్కడుంది? ఈ ప్రశ్నకు...‘అది మన రాష్ట్రం పేరు, ఆ పేరుతో ఊరు కూడా ఉందా?’అన్న ఎదురు ప్రశ్నే సమాధానంగా వస్తుంది. కానీ ఆ పేరుతో ఓ ఊరు కూడా ఉండేది.. అది ఎక్కడో కాదు... భాగ్యనగర శివార్లలోనే. అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ పురోగతికి ఇప్పుడు చిరునామాగా కనిపిస్తున్న తెల్లాపూరే... ఒకప్పటి తెలుంగాణపురం. కాలక్రమంలో తెలుంగాణపు రం కాస్తా క్రమంగా తెల్లాపూర్‌గా మారిపోయింది. తెలంగాణ అన్న పదం ఉన్న తొలి తెలుగు శాసనం వెలుగుచూసింది ఈ గ్రామంలోనే. ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోకి వస్తుంది. 604 ఏళ్ల కిందట.. బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా తన రాజ్యాన్ని విస్తరించే క్రమంలో 1417లో విజయనగర రాజు రెండో దేవరాయల అధీనంలో ఉన్న పానగల్లు కోట మీద దాడికి బయలుదేరాడు. దారిలో కనిపించిన హిందూ సంప్రదాయ కట్టడాలను ధ్వంసం చేయటం ఆ సైన్యం పనిగా పెట్టుకుంది. ఈ క్రమంలో పలు మందిరాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో తెల్లాపూర్ కూడా ప్రణాళికాబద్ధంగా ఎదిగిన పట్టణం. తెలుంగాణ పురమన్న పేరుతో అభివృద్ధి చెందిన ప్రాంతం. కొందరు విశ్వకర్మలు ఈ ప్రాంతంలో మంచి పనిమంతులైన శిల్పులుగా పేరుపొంది ఉన్నారు. వారు నగల తయారీలోనే కాకుండా, నగర ప్రణాళికల రూపకల్పనలోనూ నేర్పు ఉన్నవారు. అందులో కొండమీది మల్లోజు, అతని కొడుకులు నాగోజు, అయ్యలోజు, వల్లబోజు తదితరులు ఇక్కడ పెద్ద మామాడి తోటను నిర్వహించేవారు. దానికి నీటి కోసం విశాలమైన దిగుడు బావి తవ్వించి ఏతాం పద్ధతిలో నీటి సాగుకు వాడేవారు. పానగల్లు కోటపై దాడి కోసం ఫిరోజ్ షా ఇదే మార్గంలో వెళ్లనున్నారని తెలిసి, వారు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఫిరోజ్ షా భార్యకు బంగారు పూదండలు దిద్దిన కంఠాభరణం, బంగారు గాజులు అందంగా తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాలను వివరిస్తూ ప్రత్యేకంగా ఆ మల్లోజు వంశస్తులు ప్రశస్తి శాసనం చెక్కి దిగుడుబావి పైన ఏతాం కోసం ఏర్పాటు చేసిన రాతి స్తంభాల మధ్య ఏర్పాటు చేయించారు. అదే ఈ శాసనం. అందులో ఈ ప్రాంతాన్ని తెలుంగాణపురంగా పేర్కొన్నారు. ఆ శాసనంపై తెలుగులో24 పంక్తుల వివరాలున్నాయి. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా పురావస్తు శాఖలో స్తపతి ఈమని శివనాగిరెడ్డి ఈ శాసనాన్ని 2008లో పరిశీలించారు. అప్పటికే బావిని సింహభాగం పూడ్చేశారు. కొన్ని మెట్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. పైగా గిరక కోసం ఏర్పాటు చేసిన రెండు రాతి శిలలు పడిపోయే పరిస్థితిలో ఉండటంతో ఆయన వాటిని క్రమపద్ధతిలో పూర్వపు స్థితిలో తిరిగి ఏర్పాటు చేయించారు. ఆ శిలల దిగువన కాకతీయ శైలిలో కళాత్మకంగా చెక్కిన భారీ రాతి బేస్ ఉంది. ఆ తర్వాత మొత్తం బావిని స్థానికులు పూడ్చేశారు. ఇప్పుడు దాని చుట్టూ ఇళ్లు వెలియటంతో పూర్తి ఇరుకు స్థలంలో ఆ శాసనం బందీగా ఉండిపోయింది. అప్పట్లోనే శివనాగిరెడ్డి... నేతలను తీసుకెళ్లి దీన్ని చూపించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి ‘తెలంగాణ అన్న పేరును వాడిన తొలి శాసనానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యం దక్కాలి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ఇంత పెద్ద ఉద్యమంతో ఏర్పడ్డ రాష్ట్రంలో.. రాష్ట్రం పేరును తొలిసారి వాడిన శాసనంగా దానికి అందలం దక్కాల్సి ఉంది. -శివనాగిరెడ్డి, చరిత్రకారులు -
2 వేల ఏళ్లనాటి శాసనాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండు వేల ఏళ్లకు పూర్వపు రెండు అపురూప శాసనాలు జగిత్యాల జిల్లాలో వెలుగుచూశాయి. ఇందులో ఒకటి గతంలోనే చరిత్రకారులు గుర్తించారు. రెండోది దానికి చేరువలోనే లభించిన కొత్త శాసనం. శాతవాహనుల తొలి రాజధాని కోటలింగాలకు సమీ పంలోనే ఇవి లభించడం విశేషం. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం మొక్కట్రావుపేటలోని మునులగుట్టపై ఇవి చెక్కి ఉన్నాయి. ఈ గుట్టపై జైనుల స్థావరాలున్నాయని ప్రముఖ చరిత్రకారులు పరబ్రహ్మశాస్త్రి గతంలో పేర్కొనగా, బౌద్ధుల ఆవాసాలని జితేంద్రబాబులాంటి మరికొందరు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన చరిత్రకారుడు రాజారాంసింగ్ ఇక్కడ శాసనమున్నట్టు గతంలో పేర్కొన్నారు. తాజాగా స్థానిక యువకుడు సముద్రాల సునీల్ వీటిని గుర్తించారని, అవి శాతవాహనులకు సంబంధించినవేనని చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రాకృత భాష, బ్రాహ్మీలిపిలో ఉన్న ఈ శాసనాల్లో ఒకదానిలోని అక్షరాలు బాగా చెరిగిపోయాయి. ఇందులో ఒకవైపు స్వస్తికం, మరోవైపు బౌద్ధంలోని త్రిరత్న గుర్తులున్నాయి. ఇది బుద్ధపాదాలను దానం చేసినపుడు వేయించిన శాసనంగా భావిస్తున్నారు. రెండో శాసనంలో ‘మణికరస సామిరేవస ధమథానం... సివప ఖరితస వాపి’అన్న అక్షరాలున్నాయి. మణికారుడు (వజ్రాల వ్యాపారి) సామిరేవుని ఆదేశంతో సివప అనే వ్యక్తి ఆ ధర్మస్థలంలో బావిని తవ్వించాడన్న అర్థంలో ఉన్నట్టు చెప్పారు. -
రాకాసి పట్టణం
సాక్షి, హైదరాబాద్: అదో పట్టణం.. విచిత్రమైన రాకాసి పట్టణం. అక్కడ మనకులాగే మనుషులు, ఇళ్లుంటాయని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ పట్టణంలో మనుషులు మచ్చుకు కూడా కనిపించరు. ఎటు చూసినా సమాధులే దర్శనమిస్తాయి. అవేవో ఈమధ్య కట్టినవి కావు. వీటి వయసు దాదాపు 3వేల ఏళ్లు. అంటే ఇనుపయుగం నాటివి. గుట్టపైకెక్కి తిరుగుతుంటే ఒక్కో రాయికి ఓ సమాధి కనిపిస్తుంది, అందుకే ఆ ప్రాంతానికి స్థానికులు పెట్టుకున్న పేరు.. ‘రాకాసి పట్టణం’. భద్రాచలం దట్టమైన అడవుల్లో ఈ ప్రాంతం ఉంది. జ్యోండిగో.. దక్షిణ కొరియాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడి గుట్టల్లో వేల సంఖ్యలో ఆదిమానవుల సమాధులు కనిపిస్తాయి. భారీ బండరాళ్లు చుట్టూ పేర్చి.. వాటిపై దాదాపు 15 అడుగుల మందం ఉండే పెద్ద రాయిని మూతగా పెట్టి దాని కింద ఓ గది కట్టి అందులో మృతదేహాన్ని ఉంచేవారు. ఇది వేల ఏళ్లనాటి సమాధి చేసే విధానం. ఒకే ప్రాంతంలో వేల సంఖ్యలో ఇలాంటి సమాధులు ఉండటం ప్రపంచంలో మరెక్కడా లేవనేది ఇప్పటి వరకు ఉన్న మాట. అందుకే దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ సమాధులను చూసేందుకు నిత్యం కొన్ని వేల మంది పర్యాటకులు, పరిశోధకులు అక్కడికి వస్తుంటారు. గోదావరి తీరంలోని పూర్వపు వరంగల్–ఖమ్మం ప్రాంతం.. మల్లూరు, దామరవాయి, జానంపేట, పాండురంగాపురం.. ఇలాంటి గుట్టలతో నిండిన ప్రాంతాలెన్నో. ఈ గుట్టలపై ఆదిమానవుల కాలంనాటి గూడు సమాధులు వేలల్లో ఉన్నాయి. అలా విస్తరించిన ప్రాంతాల పరిధి ఏకంగా దాదాపు 200 కిలోమీటర్లకు పైబడే! ఆదిమానవుల గూడు సమాధులు (డోలమైన్స్, డోల్మనాయిడ్స్) ఇంత విశాలమైన ప్రాంతంలో విస్తరించి ఉండటం.. ప్రపంచంలో మరెక్కడా లేదన్న అభిప్రాయం ఉంది. కొరియాలో సమాధుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఆ ప్రాంత విస్తీర్ణం తక్కువ. మనదగ్గర ఆ పరిధి విస్తీర్ణం ఎక్కువ. కానీ వీటికి యునెస్కో కాదు కదా, కనీసం రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తింపు కూడా లేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మరొక కొత్త గుట్ట వెలుగు చూసింది. ఇంతకాలం స్థానిక పశువుల కాపరులు తప్ప బయటి వ్యక్తులు వాటిని చూడలేదు. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వాటిని పరిశీలించారు. స్థానికులు రాకాసి పట్టణంగా పేర్కొనే ఈ ప్రాంతం పినపాక మండలంలోని బయ్యారం నుంచి పాండురంగాపురం వెళ్లేదారిలో దట్టమైన అడవిలో ఉంది. పైన కప్పు.. లోపల రాతి తొట్టి! లోహయుగంలో మానవులు చనిపోయిన తర్వాత ప్రత్యేక గౌరవాన్ని పొందేవారు. చనిపోయాక సమాధి చేయటం సాధారణ విషయమే. కానీ, ఆ సమాధిలో సంబంధీకులు ఇష్టపడే ఆహారం, ఆహార్య వస్తువులు ఉంచేవారు. ఆ ఆత్మ తిరిగి వస్తుందన్న నమ్మకంతోనే ఇలా చేసేవారు. పెద్దపెద్ద బండరాళ్లను చెక్కి చుట్టూ కొంతమేర పాతి దాదాపు పదడుగుల గుహను రూపొందించేవారు. దానిపై విశాలమైన పెద్ద బండరాయిని కప్పుగా ఏర్పాటు చేసేవారు. లోనికి వెళ్లేలా చతురస్రాకారంలో మార్గాన్ని ఏర్పాటు చేసేవారు. దాదాపు ఎనిమిదడుగుల రాతి తొట్టిని రూపొందించి మృతదేహాన్ని అందులో ఉంచి ఆ గుహకు పెద్ద రాయితో మూసేసేవారు. పక్కనే వారికి ఇష్టమైన ఆహారం, అలంకరణ వస్తువులను ఆ తొట్టే లో ఉంచేవారు. కొన్ని గుహల్లో రెండు, మూడు తొట్లు కూడా ఉండేవి. పూర్తిగా భూ ఉపరితలంపై ఇలాంటి సమాధులు కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. వాటిని డోలమైన్స్గా చరిత్రకారులు పేర్కొంటారు. కొంతమేర భూమిలోకి పాతినట్టు ఉండేవాటిని డోల్మనాయిడ్స్గా పేర్కొంటారు. ఇప్పుడు తాజాగా వెలుగుచూసిన ప్రాంతంలో వందల సంఖ్యలో డోల్మనాయిడ్స్ కనిపించాయి. స్థానిక పశువుల కాపరులు ఇచ్చిన సమాచారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం, ఔత్సాహిక పరిశోధకులు కొండవీటి గోపి, నాగులపల్లి జగన్మోహన్రావు, సింహాద్రి నారాయణలు వాటిని పరిశీలించారు. స్థానిక అమరారం గ్రామం నుంచి పదిహేను కిలోమీటర్ల పాటు దట్టమైన అడవిలోకి వెళ్తే ఇలాంటి వందల సంఖ్యలో సమాధులున్న గుట్టలు కనిపిస్తున్నాయి. గతంలో భూపాలపల్లి జిల్లా దామరవాయి అడవిలో వెలుగుచూసిన సమాధులకు కాస్త భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. గోదావరి తీరంలో ఇలా సమాధులున్న ప్రాంతం మరింత విస్తారంగా ఉందని తాజాగా గుర్తించిన సమాధులు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకీ నిర్లక్ష్యం? ప్రపంచంలో ఇలా ఒకేచోట వేల సంఖ్యలో ఆదిమానవుల సమాధులు భద్రంగా ఉన్న ప్రాంతాలు చాలా అరుదు. తెలంగాణలోని గోదావరి తీరంలో 200 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతాలు ఇప్పటి వరకు యునెస్కో దృష్టికి వెళ్లలేదు. వీటిని పరిరక్షించి యునెస్కో గుర్తింపునకు యత్నించాలన్న ఆలోచన కూడా మన ప్రభుత్వానికి రాలేదు. వెంటనే ఇలాంటి అరుదైన ప్రాంతాలను ప్రపంచ పర్యాటక పటంలో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇక్కడికి చేరువలో ఉన్న జానంపేటలో ఆంగ్లేయుల కాలంలోనే పరిశోధనలు జరిగాయి. ఇవి చాలా అద్భుత చారిత్రక సంపద అని నాటి పరిశోధకులు తేల్చారు. ఇలాంటి భారీ బండరాళ్లలో భూగర్భంలో సమాధి గూళ్లు రెండేళ్ల క్రితం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) తవ్వకాలు జరిపి నాటి ఆదిమానవుల అవశేషాలు గుర్తించి డీఎన్ఏ పరీక్షలకు తరలించింది. భూపాలపల్లి జిల్లా దామరవాయి ప్రాంతానికి అమెరికాలోని శాండియాగో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ థామస్ ఈ లెవీ ఆధ్వర్యంలో బృందం వచ్చి ప్రాథమిక పరిశోధన జరిపి ప్రపంచంలోనే ఇవి అరుదైన ప్రాంతాలుగా గుర్తించింది. ప్రభు త్వం సహకరిస్తే ఈ మొత్తం ప్రాంతాన్ని లైడా ర్ సర్వే చేసి ఆధునిక పద్ధతిలో పరిశోధనలు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మన పర్యాటక శాఖ, పురావస్తు శాఖ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. వీటిని యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే వాటి పరిరక్షణకు, పరిశోధనకు పెద్దమొత్తంలో నిధులు సమకూరుతాయి. ఇక వివిధ దేశాల నుంచి పర్యాటకులు వాటిని చూసేందుకు క్యూ కడతారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయంతోపాటు స్థానికుల ఉపాధికి అవకాశం కలుగుతుంది. -
ఈ గైడ్ ఫీజ్ అడగడు
ఈ రోజుల్లో కుర్రాళ్లు సెల్ఫోన్లలో కూరుకుపోయి చాటింగ్‌లలో చతికిలపడుతుంటే పకిడే అరవింద్ మాత్రం తెలంగాణా అంతా చారిత్రక ప్రాంతాలను గాలిస్తూ, వాటి గొప్పతనాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. పురావస్తు శాఖకు తెలియని విశేషాలు కూడా అరవింద్‌కు తెలుసు అంటే అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంzచనపల్లికి చెందిన పకిడే అరవింద్ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న అరవింద్ హన్మకొండలోని ఏకశిల జూనియర్ కాలేజిలో ఇంటర్ మీడియట్, డిగ్రీ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జర్నలిజం పూర్తి చేశాడు.అరవింద్‌కు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అందులోనూ చరిత్ర పుస్తకాలంటే ప్రాణం. పుస్తకంలో చదివిన ప్రదేశాలకు వెళ్లి, అక్కడి చరిత్రను స్వయంగా తెలుసుకోవాలని కోరిక. తలిదండ్రులు, ఉపాధ్యాయులు ఇతని కోరికలోని నిజాయితీని గుర్తించి ప్రోత్సహించడం మొదలు పెట్టారు. గూగుల్ మ్యాప్ ద్వారా వివిధ చారిత్రక ప్రదేశాలను గుర్తించి దానిని ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఆరంభించాడు. అంతవరకే అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర లేదేమో, తన పరిశోధనల్లో భాగంగా అరవింద్ ఇటీవల దట్టమైన అడవుల్లో ముళ్లపొదల మధ్య కనుమరుగవుతున్న పురాతన విగ్రహాలను వెలికి తీశాడు. పురావస్తు శాఖ శోధించని అనేక ప్రాంతాలను గుర్తించి వెలుగులోకి తీసుకు వచ్చాడు. అంతేకాదు, వివిధ ప్రదేశాల చారిత్రక అంశాలను డాక్యుమెంటేషన్ చేయడంలో ప్రావీణ్యం సాధించాడు. దాంతో తాను కనుగొన్న వాటిని సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. కాకతీయుల కట్టడాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాడు! పరిశోధనలో భాగంగా అరవింద్ అనేక ప్రాచీన దేవాలయాలు, చెరువులను సందర్శించాడు. విలువైన సమాచారాన్ని సేకరించాడు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంద్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చరిత్రను తెలుసుకున్నాడు. చరిత్రను సోషల్‌మీడియా ద్వారా తెలియ చెబుతుండటంతో ఇతర దేశాలకు చెందిన చరిత్ర పరిశోధకులు కూడా రావడం మొదలు పెట్టారు. ఇలా దాదాపు 10 దేశాల నుంచి చరిత్ర పరిశోధకులు వచ్చారు. ఈ క్రమంలో అరవింద్‌కు పలువురు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తన పరిశోధనలో భాగంగా అరవింద్ సుమారు 750 పురాతనకట్టడాలు, చారిత్రక ప్రదేశాలను గుర్తించాడు. వాటిలో కాకతీయుల కట్టడలు అధికం. వీటిపై గతంలో వెలువడిన పుస్తకాలను సేకరించాడు. వ్యాసాల ద్వారా వచ్చే డబ్బుతో... తనకు తెలిసిన చరిత్రను అందరికి చాటి చెప్పేందుకు ప్రైవేట్ వెబ్సైట్లు, పత్రికలు, సోషల్ మీడియాను వినియోగించుకున్నాడు. ప్రైవేట్ వెబ్సైట్లకు వ్యాసాలు రాయడం ద్వారా వచ్చే డబ్బును కూడా పురాతన కట్టడాలకు వెళ్ళి పరిశీలించడానికి వెచ్చిస్తున్నాడు. ఫోటో ఎగ్జిబిషన్ అరవింద్ సందర్శించిన పురాతన కట్టడాలు, ఆలయాలను ఫోటోల రూపంలో బంధించారు. ఇప్పటివరకు 30 వేల ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలలో ఎవరికీ తెలియని కట్టడాలు, దేవాలయాల ఫోటోలను ఎంపిక చేసుకున్నాడు. వాటిని ఇటీవల హైదారాబాద్‌లోని రవీంద్ర భారతిలో అన్‌టోల్డ్ తెలంగాణ పేరుతో ఫోటో ఎగ్జిబిషన్‌ను ఐదు రోజులపాటు నిర్వహించారు. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఫోటోలతో పాటు దాని చరిత్రను రాసి బుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, వరంగల్ రూరల్ ఫోటోలు: పెద్దపెల్లి వరప్రసాద్ పురాతన కట్టడాలు, దేవాలయాలు ఎక్కడ ఉన్నా వెళ్ళి దాని చరిత్ర తెలుసుకోవడం ఇష్టం. పుస్తకాలలో ఉన్నవే చరిత్ర కాదు, అంతకు మించిన చరిత్ర తెలంగాణ గడ్డపైన ఉంది. ఒక్క కొత్త విషయం తెలుసుకుని ప్రపంచానికి చాటి చెబితే ఆ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. 32 కిలో మీటర్ల గుట్టను సైతం ఎక్కి అక్కడికి వెళ్ళి చరిత్రను తెలుసుకుని వచ్చాను. రెండు సంవత్సరాలు కష్టపడి కాకతీయుల వంశీయులను సైతం కలిశాను. ప్రభుత్వం సాయం చేస్తే నేను మరింత లోతుగా పరిశోధిస్తాను. – అరవింద్, యువ చరిత్రకారుడు -
సింగరాయకొండలో ‘అమ్మ దేవత’
సాక్షి, హైదరాబాద్: అత్యంత పురాతన ‘మాతృ దేవత’ ప్రతిమ సిద్దిపేట సమీపంలో వెలుగు చూసింది. సంతాన సాఫల్యానికి ప్రతిరూపంగా ‘అమ్మ’ శిల్పాన్ని ఆరాధించే పద్ధతి వేల ఏళ్ల కిందటే మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విగ్రహాలు వివిధ రూపాల్లో వెలుగు చూశాయి. మన దేశంలో అమ్మ దేవత, లజ్జా గౌరీగా ఆరాధించిన ఆనవాళ్లు తేలాయి. నగ్నరూపంలో ఉండే ఈ భంగిమ అమ్మ తనానికి చిహ్నంగా భావిస్తారు. గతంలో అమరావతి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఇలాంటి శిల్పాలు వెలుగు చూడగా, హైదరాబాద్ శివారులోని కీసరగుట్ట క్షేత్రం చేరువలో పురావస్తు తవ్వకాల్లో ఇలాంటి ఓ శిల్పం వెలుగు చూసింది. తాజాగా ఇదే ఆనవాళ్లతో సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సింగరాయ కొండ గ్రామ శివారు గుట్టపై లభించింది. సున్నపు రాయిపై చెక్కింది కావటం, దాన్ని తొలగించే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో కొంత ధ్వంసమైంది. తాజాగా దాన్ని ఔత్సాహిక చరిత్రకారులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, వేముగంటి మురళీకృష్ణ, శ్రీరామోజు హరగోపాల్ తదితరులు పరిశీలించి అమ్మదేవత ప్రతిరూప మని తేల్చారు. గతంలో లభించిన విగ్రహాల కంటే ఇది చాలా పురాతనమైందని, దాదాపు క్రీ.పూ. రెండో శతాబ్దానికి చెందినదై ఉంటుందని భావిస్తున్నట్లు హరగోపాల్ వెల్లడించారు. రూపమే విచిత్రం.. అమ్మ తనానికి ప్రతీకగా ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయటం గతంలో ఉండేది. తల్లి ప్రసవించేటప్పుడు ఉండే భంగిమగా దీన్ని గతంలో కొందరు చరిత్రకారులు తేల్చారు. నగ్నంగా ఉండే రూపం అయినందున ముఖం ఉండేది కాదని, తల స్థానంలో విచ్చుకున్న పద్మం చెక్కేవారని చెప్పారు. భౌతిక, మానసిక పరిపక్వతకు చిహ్నంగా వికసిత పద్మాన్ని పేర్కొంటారని చరిత్రకారులు చెబుతున్నారు. సింగరాయకొండ గుట్టపై లభించిన శిల్పానికి కూడా శిరస్సు స్థానంలో పద్మం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడే గతంలో బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. స్థానికంగా ఉన్న దేవాలయం దిగువన బౌద్ధ స్తూపం ఉండేదని, ఇక్కడే ఆరో శతాబ్దానికి చెందిన చతుర్ముఖ బౌద్ధ బ్రహ్మ శిల్పం, మట్టి ఒరల బావి వెలుగు చూసినట్లు హరగోపాల్ తెలిపారు. -
వేలుపుగొండలో కొత్త రాతి చిత్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రాతిచిత్రాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రాచీన మానవుని గురించి తెలుసుకోమంటూ సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లా టేక్మల్ మండలం వేలుపుగొండకి పడమరన ఉన్న చిన్న రాతి గుట్టపైన విష్ణుకుండినుల కాలంనాటి శివాలయం గుండం, నివాస నిర్మాణాల జాడలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశీలించింది. ఈ పరిశోధనల్లో 4 రాతి చిత్రాల ప్రదేశాలను గుర్తించింది. పగులు అంచుల్లో.. గుట్టపైకి వెళ్లే మెట్ల మార్గానికి ఎడమ వైపున 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఎరుపు రంగులో వేసిన రాతి చిత్రం ఉంది. ఈ చిత్రంలో అక్కడక్కడ చెట్ల కొమ్మలు, మనిషి తలలు కనిపిస్తున్నాయి. రాతి చిత్ర పరిశోధకులకు చాలెంజ్ విసిరినట్లు ఉన్న ఈ చిత్రం రంగు తాజాదనం, చిత్రణ ఆధారంగా చారిత్రక కాలానిదని పరిశోధకులు చెబు తున్నారు. ఈ రాతి చిత్రంబండను ఆనుకుని ఉన్న పడగరాయిలో శీర్ష కోణంలో ఉన్న పగులు రెండం చుల్లో రాతిచిత్రాలు ఉన్నాయి. వీటిలో ఓ నెమలి బొమ్మ.. దాని అంచులో పైకి సాగిన తీగ, తీగ వెం బడి ఆకులు, మొగ్గలు కనిపిస్తున్నాయి. రాతి తావుకు రెండంచుల్లో ఒకే పూలతీగ కనిపిస్తోంది. ఇక్కడ కూడా ప్రాచీన మానవుని రాతి చిత్రాలు తక్కువగానే ఉన్నాయి. పాత రాతి చిత్రాల మీద కొత్తగా చారిత్రక దశలో గీసిన రాతి చిత్రాల్లా ఇవి కనిపిస్తున్నాయి. మధ్యరాతి యుగానివా? 3, 4 రాతి చిత్రాల ప్రదేశాలు మెట్ల మార్గానికి కుడివైపున 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి 30 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పున్న రాతి కాన్వాసు మీద గీసిన ఎరుపురంగు రాతి చిత్రాలు. ఈ చిత్రాలున్న ప్రదేశం కింద రాతి గుహలున్నాయి. ఇక్కడ ఒక గుహ ద్వారం అంచున రాతి చిత్రాలు, తెల్లని రం గులో హనుమంతుని చిత్రమూ కనిపిస్తోంది. ఇక్కడి రాతి చిత్రాలు కూడా చారిత్రక దశకు చెందినవే. కానీ బృంద సభ్యుడు బొగ్గుల శంకర్‌రెడ్డికి గుహలో లభించిన రాతి పనిముట్లలో కొన్ని మధ్య రాతియుగం, కొత్త రాతియుగానికి చెందినవి ఉన్నాయి. ఈ రాతిగుహల్లో మానవులు మధ్య రాతియుగాల నుంచి నివసించినట్లు వీటి ద్వారా రుజువవుతోంది. ఇప్పుడు కనిపిస్తున్న రాతి చిత్రాలు పాత రాతి చిత్రాల మీద వేసిన కొత్త చిత్రాల్లా కనిపిస్తున్నాయి. పరిసరాల్లో పరిశోధిస్తే మరెన్నో చిత్రా లు కనిపించే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రభుత్వమే రక్షించాలి మానవ పరిణామ క్రమం తెలుసుకోడానికి ఆదిమ కాలం నాటి ఆధారాలే కీలకం. అందుకే అలాంటి ప్రదేశాలను ప్రభుత్వం రక్షించాలి. తద్వారా అవి పరిశోధకులు, పర్యాటకులకు కేంద్రంగా నిలుస్తాయి. అప్పటి గుహలు, సమాధుల్లో లభించే ఆధారాలే నేటి తరానికి గొప్ప వారసత్వ సంపద. ఇలాంటి రాతి చిత్రాల గురించి పురావస్తు శాఖ విస్తృతంగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. – రామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం టేక్మల్ మండలం వేలుపుగొండ గ్రామం వద్ద గుహలో లభ్యమైన రాతి పనిముట్లు రాతిపై నెమలి బొమ్మ -
కాలగర్భంలో కళా వైభవం!
అద్భుత శిల్పకళా సంపద మట్టిలో కలిసిపోతోంది. నిత్యం పూజలు, అభిషేకాలతో విలసిల్లిన దేవాలయాలు, శిల్పాలు రాళ్ల కుప్పలవుతున్నాయి. గుప్త నిధుల వేటలో రాతి కట్టడాలు ధ్వంసమవుతున్నాయి. చరిత్ర కాలగర్భంలో సమాధి అవుతోంది. తెలంగాణలో గుప్తనిధుల తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పురాతన దేవాలయాల్లోని విగ్రహాల కింద బంగారం, వజ్రాలు ఉన్నాయన్న ఆశతో కొందరు దుండగులు నేరాలకు పాల్పడుతున్నారు. జంతు బలులు చేయడానికీ వెనుకాడటం లేదు. దీంతో కాకతీయులు, రాష్ట్ర కూటులు, చాళుక్యుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న అనేక ఆలయాలు, ఉప ఆలయాలు శిథిలమైపోయాయి. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా పేర్కొనే వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆలయాల ప్రస్తుత పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. – సాక్షి, హైదరాబాద్ శిథిలావస్థలో రామప్ప ఆలయాలు కాకతీయుల కళావైభవానికి, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం రామప్ప ఆలయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రముఖ ఆలయాల్లో రామప్ప ఒక్కటి. రామప్ప ఆలయంతోపాటు దాని చుట్టు పక్కల కిలోమీటర్ దూరంలో 20 ఉప ఆలయాలను కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయాలు ఆదరణ కరువై శిథిలమవుతున్నాయి. ఘనకీర్తి గల చారిత్రక ఆలయంలోని స్తంభాలు కూలిపోతున్నాయి. కొన్ని కట్టడాలపై మొలచిన పిచ్చి మొక్కల మధ్య శిల్పాలన్నీ వెలవెలబోతున్నాయి. అప్రమత్తమవ్వాలి దేవాలయాలను పరిరక్షించుకోవడంలో ప్రజల పాత్ర ముఖ్యమైంది. గ్రామాల్లోని యువత ఆలయాల్లో తవ్వకాలు వంటి చర్యలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు తెలియజేయాలి. అప్రమత్తంగా ఉండాలి. ఒక కమిటీగా ఏర్పడి దేవాలయాలను సంరక్షించుకోవాలి. పండుగలు, జాతరలు వచ్చినప్పుడు మాత్రమే దేవాలయాల వైపు చూడటం కాదు.. నిత్యం వాటిపై పరిశీలన ఉండాలి. పురాతన సంపద పరిరక్షణ కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్ కూలిన 36 మీటర్ల ప్రాకారం కేంద్ర పురావస్తు శాఖ అధీనంలోని రామప్ప ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. కట్టడాలు కూలిపోతున్నా పురావస్తు శాఖలో చలనం కనిపించడంలేదు. దీంతో గత రెండేళ్లుగా రామప్ప ఆలయం శిథిలమవుతోందని పలువురు చరిత్రకారులు వాపోతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తూర్పు ద్వారాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం 36 మీటర్ల వరకు కుప్పకూలింది. ఇటీవల సిబార (సున్నము, ఇసుక, బెల్లం, కరక్కాయల మిశ్రమం) పద్ధతిలో ప్రహరీ గోడ మరమ్మతులు చేపట్టారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న 16 ఉప ఆలయాలు కూడా పూర్తిగా శిథిలమైపోయాయి. వీటిలో కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం కోసం కూలగొట్టి.. శిలలను కుప్పలుగా పోశారు. యాకూబ్‌సాబ్ స్థలంలో ఉన్న శివాలయం పూర్తిగా కూలిపోయింది. గుప్తనిధుల కోసం గర్భగుడిని గునపాలతో తవ్వేశారు. చాలా చోట్ల గుప్తనిధుల కోసం పురాతన ఆలయాల్లో రాత్రిళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. గ్రామాల్లో నివాసం ఉండేవారే ఇలాంటి వారికి సహకరిస్తున్నారని పలు కేసుల్లో జరిగిన విచారణలో తేలింది. శిల్ప సౌందర్యానికి ప్రతీకలు కాకతీయుల కాలంలో రామప్ప ఆలయంతోపాటు దాన్ని ఆనుకుని కాటేశ్వర, కామేశ్వర, నరసింహస్వామి, నంది మంటపం నిర్మించారు. రామప్ప చుట్టూ ఉన్న కోటగోడ లోపల గొల్లగుడి, యాకూబ్‌సాబ్ గుడి, త్రికూ ట ఆలయంతోపాటు అడవిలో మరో రెండు శివాలయాలు ఉన్నాయి. రామప్ప సరస్సు కట్టపై కల్యాణ మంటపం, కాటేజీల పక్కన త్రికూటాలయం, మరో రెండు చిన్న ఆలయాలు కనిపిస్తాయి. రామప్ప ఆలయం ఉన్న పాలంపేటలో మరో రెండు శివాలయాలు శిథిలమవుతున్నాయి. లక్ష్మీ దేవిపేట, పెద్దాపురం, రామాంజాపురం, నర్సాపురం గ్రామాల్లోని ఆలయాలు శిల్ప సౌందర్యానికి, కాకతీయుల కళా వైభవానికి అద్దం పడుతాయి. ప్రస్తుతం ఆ శిల్పాలు ఎండకు ఎండుతూ వానకు తడు స్తూ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. గణపురంలోని కోటగుళ్లు, కటాక్షపూర్‌లోని ఆలయాలు శిథిలమవుతున్నాయి. -
ఎవరూ విప్పని ఓ పొడుపు కథ!
చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు.. ఏమిటది? కన్నీళ్లు.. కిటకిట బండి కిటారి బండి.. ఎందరు కూర్చున్నా విరగని బండి. ఏమిటది? రైలు బండి.. మరి ఇది.. 71, 194, 38, 1701, 89, 76, 11, 83, 1629, 48, 94, 63, 132, 16, 111, 95, 84, 341, 975.............. అర్థం కాలేదా.. 400 కోట్ల ఖజానా తాలూకు తాళం చెవి ఇది.. 200 ఏళ్లుగా వేల మంది ప్రయత్నించినా.. విప్పలేని ఓ పొడుపు కథ ఇది.. ...అనగనగా ఓ గుప్త నిధి.. ఎక్కడో దాస్తారు.. ఎవరికి పడితే వారికి చిక్కకుండా దాని చిరునామా, నిధి వివరాల గురించి సంకేత భాషలో వివరణ.. ఇలాంటి స్టోరీ లైన్లో ‘మోసగాళ్లకు మోసగాడు’ సహా ఎన్నో చిత్రాలు వచ్చాయి.. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కూడా అలాంటి నిధి గురించే.. వందల కిలోల బంగారం, వెండి, వజ్రాలతో కూడిన ఆ నిధి ప్రస్తుత విలువ రూ.400 కోట్లట.. మరి ఆ నిధి.. దానివెనకున్న కథ గురించి తెలుసుకోవాలంటే కొంచెం కష్టమైనా ఓ 200 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.. మరి వెళ్దాం పదండి.. ...కరెక్టుగా తెలియదు గానీ.. 1800 ఆ మధ్య కాలం.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన సాహసి థామస్ జె బియల్, మరికొందరు వేట కోసమని వెళ్లినప్పుడు మెక్సికో–కొలరాడో సరిహద్దు వద్ద ఉన్న ఓ గనిలో ఈ నిధిని కనుగొన్నారు. తర్వాతి కాలంలో వర్జీనియాకు తెచ్చి..1820 ఆ టైములో బియల్ దాన్ని జాగ్రత్తగా ఓ రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. దాని జాడను కనుగొనేందుకు వీలుగా పలు సంఖ్యలతో కూడిన మూడు సంకేత పత్రాలను రూపొందించాడు. ఆ సంఖ్యల వెనకున్న గుట్టును ఛేదించడానికి ఎంతో మంది ప్రయత్నించారు. ప్రతి సంఖ్య ఓ అక్షరాన్ని లేదా పదాన్ని సూచిస్తుందన్న భావనతో అమెరికా రాజ్యాంగం, మాగ్నా కార్టా, షేక్స్ పియర్ రాసిన పలు నాటకాలతో పోల్చి చూశారు. లాభం లేకుండా పోయింది. తర్వాత అందరూ దాన్ని మరిచిపోయారు. అయితే.. 19వ శతాబ్దంలో ఓ వ్యక్తి అనుకోకుండా బియల్ రెండో సంకేత పత్ర రహస్యాన్ని ఛేదించాడు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనతో దాన్ని పోల్చి చూసినప్పుడు ఈ కోడ్ గుట్టు రట్టయింది. ...అందులో ఏముందంటే.. బెడ్ఫోర్డ్ కౌంటీలో నేను ఆ నిధిని దాచిపెట్టాను. మూడవ పత్రంలో ఇవి ఎవరికి చెందాలన్న వివరాలు ఉన్నాయి. నిధి దాచిపెట్టిన ప్రదేశం బుఫోర్డ్‌కు నాలుగు మైళ్ల దూరంలో ఉంది. కిలోలకొద్దీ బంగారం, వెండి, వజ్రాలు ఉన్నాయి. భూమికి ఆరడుగుల లోతులో భద్రంగా ఇనుప పెట్టెల్లో ఉంచి పాతిపెట్టాను. మొదటి సంకేత పత్రంలో ఈ నిధి కరెక్టుగా ఎక్కడున్నదన్న విషయం ఉంది. కాబట్టి.. దాన్ని కనుగొనడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ...దీంతో మళ్లీ వేట మొదలైంది. మిగతా పత్రాల రహస్యాన్ని ఛేదించాలని చాలా మంది ప్రయత్నించారు. దీనికితోడు వర్జీనియా చట్టాల ప్రకారం భూమిలో నిధులు వంటివి దొరికితే.. కనుగొన్నవారికే అవి సొంతం. దీంతో బెడ్ఫోర్డ్ ఏరియాను జల్లెడ పట్టారు. కొందరైతే.. నిధి జాడ కోసం మంత్రగాళ్లను, ఆధ్మాత్మిక గురువులనూ ఆశ్రయించారు. అర్ధరాత్రి సమయాల్లో వేరేవారి భూముల్లోకి ప్రవేశించి మరీ తవ్వకాలు మొదలుపెట్టారు. కొందరు శ్మశానాలను తవ్వేశారు. అరెస్టులు జరిగాయి. కోట్లలో ఖర్చు చేసి.. అప్పులు పాలైన వారూ ఉన్నారు. అమెరికా సైన్యం కూడా రంగంలోకి దిగింది. సిగ్నల్ ఇంటెలిజెన్సీ సర్వీసు వాళ్లు.. తమ శిక్షణలో భాగంగా బియల్ నిధి జాడను కనుగొనాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించేవారు. దీనిపై పుస్తకాలు వచ్చాయి.. తీసిన షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు అవార్డులూ గెలుచుకున్నాయి. కానీ ఆ నిధిని మాత్రం ఎవరూ గెలుచుకోలేకపోయారు. ...అందరికీ అనుమానాలు మొదలయ్యాయి.. అసలు నిధి ఉందా.. బియల్ అనేవాడు అసలు ఒకడున్నాడా అని.. ఎందుకంటే.. ఈ బియల్ రహస్య సంకేతాల పత్రాలు 1885లో బియల్ పేపర్స్ అంటూ ముద్రించిన ఓ పాంప్లెట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం 1822లో బియల్ ఈ సంకేత పత్రాలు ఉన్న పెట్టెను రాబర్ట్ మారిస్ అనే వ్యక్తికి ఇచ్చాడు. తమ బృందం మరో సాహస యాత్రకు బయల్దేరుతోందని.. 10 ఏళ్ల వ్యవధిలో తాను లేదా తన బృందంలోని ఎవరూ తిరిగి రాకపోతే.. దాన్ని తెరవమని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత సెయింట్ లూయిస్ నుంచి బియల్ మారిస్కు ఓ ఉత్తరం రాశాడు. ఓ వ్యక్తి ఆ పత్రాలకు సంబంధించిన కీని పంపుతాడని బియల్ ఆ ఉత్తరంలో చెప్పాడు. అయితే.. అది ఎప్పటికీ రాలేదు. బియల్ కూడా రాలేదు. దీంతో 1945లో మారిస్ పెట్టెను తెరిచాడు. ఆ పొడుపు కథలను విప్పడానికి ప్రయత్నించాడు.. సాధ్యం కాలేదు.. తర్వాత ఆ పత్రాలు చేతులు మారి.. బియల్ పేపర్స్ పాంప్లెట్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. కొందరు చరిత్రకారులు పరిశోధించగా.. 1822లో సెయింట్ లూయిస్ పోస్టల్ డిపార్టుమెంట్ వినియోగదారుల జాబితాలో బియల్ పేరు ఉంది. దీంతో బియల్ పత్రాలను నమ్మేవారి సంఖ్య పెరిగింది.. ఆ నిధి అక్కడే బెడ్ఫోర్డ్ కౌంటీలోనే ఉంది.. మరి.. మీరు ప్రయత్నిస్తారా? వందల కోట్లకు వారసులవుతారా? – సాక్షి, తెలంగాణ డెస్క్ -
కనుమరుగవుతున్న చరిత్ర..!
సాక్షి, యాదాద్రి : జైనం, బౌద్ధం, వీరశైవం, వైష్ణవ సంప్రదాయాలకు నిలయమైన పురాతన ఆలయాలు పాలకుల ఆలనాపాలనా లేక కనుమరుగవుతున్నాయి. ఆధ్యాత్మిక, చరిత్రక నేపథ్యం కలిగిన యాదాద్రిభువనగిరి జిల్లాలో వందల ఏళ్ల నాటి చరిత్ర కనుమరుగవుతుంది. ఆదిమ మానవుని మనుగడకు సంబంధించిన సమాధుల నుంచి వివిధ మతాలకు చెందిన ఆలయాలు, రాతి విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. కొండలపై, గుట్టలపై చారి త్రక సంపద ఆనవాళ్లు కోల్పోతుంది. వెలుగుచూస్తున్న ఆలయాలు జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం సైదాపురం గుట్టపై ఆలయం వెలుగుచూసింది. 16వ శతాబ్ధానికి సంబం ధించిన వైష్ణవ ఆలయంగా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో భువనగిరిలో వటుక భైరవుని విగ్రహం రెండు సంవత్సరాల క్రితం బయటపడింది. అలాగే సైదాపురం గ్రామంలో కోట గోడల ఆనవాళ్లు లభించాయి. రాయగిరి వెంకటేశ్వరాలయం కోనేటి వద్ద గల శివలింగం, ఇతర విగ్రహాలను గుప్త నిధుల కోసం తవ్వేశారు. ఆత్మకూరు(ఎం), అమ్మనబోలు, మాటూరు, రఘునాథపురం, మాసాయిపేట, గొలనుకొండ, ఆలేరు, ఇక్కుర్తి, కొలనుపాక ఇలా పలుచోట్ల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలు, ఆలయాలు ఆదరణకు నోచుకోవడం లేదు. భువనగిరి మండలంలో బయటపడ్డ కాకతీయుల కాలం నాటి శాసనాలు ఎన్నో నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని రక్షిం చాల్సిన అవసరం ఉంది. గుప్తనిధుల కోసం తవ్వకాలు.. జిల్లాలోని పలు దేవాలయాలు, గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారు. ప్రధానంగా శివాలయాల్లో నంది, శివలింగాలను తవ్వేశారు. జిల్లాలో సుమారు వంద ఆలయాల్లోని విగ్రహాలు, శివలింగాలను గుప్త నిధుల కోసం తవ్వేశారు. కొండలపై, గుట్టలపై గల ఆలయాలు ధ్వంసమయ్యాయి. గుట్టలను పగులగొడుతున్న సమయంలో పురాతన కాలం నాటి ఆలయాలు కనుమరుగవుతున్నాయి. ఆదిమ మానవుడికి సంబంధించిన సమాధులను తవ్వేసి రైతులు పొలాలుగా మార్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పురావస్తు శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వందల సంవత్సరాల సంపద భావితరాలకు లభించకుండాపోతోంది. ఆలయాలపై అధ్యయనం చేయాలి పురాతన ఆలయాలు, వాటి చరిత్రపై ప్రభుత్వం అధ్యయనం చేయాలి. యాదాద్రిభువనగిరి జిల్లాలో జైన, బౌద్ధ, వీరశైవ, వైష్ణవ, సంప్రదాయాలకు సంబంధించిన ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. చాలా వరకు కనుమరుగయ్యాయి. మిగిలిన వాటిని రక్షించుకోవాలి. ఎక్కడైనా ఒక నూతన ఆలయం, విగ్రహం బయటపడితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారి ద్వారా కలెక్టర్, ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ ప్రాంతంలో శైవం, వైష్ణవ మతాలు రాజుల కాలంలో ఉన్నత స్థితిలో కొనసాగాయి. వాటికి సంబంధించిన ఆనవాళ్లు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలిన వాటిపై పరిశోధనలు జరిపి చరిత్రకు సాక్ష్యంగా నిలపాలి. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి. –ఎస్.హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకుడు పురాతన దేవాలయాలను రక్షించాలి ప్రభుత్వం చారిత్రక సంపదను కాపాడటానికి చర్యలు తీసుకోవాలి. వెలుగులోకి వచ్చిన పురాతన దేవాలయాలను గుర్తించి వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవాలి. తద్వారా రక్షణ కల్పించడానికి వీలవుతుంది. మరుగున పడిన చారిత్రక సంపదను వెలుగులోకి తీసుకురావాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి. పురాతన ఆలయాలకు రక్షణ కల్పించాలి. -తోట భాను, విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి జిల్లాల సహకార్యదర్శి -
ప్రధాని మౌనంపై చరిత్రకారుల మండిపాటు
ఢిల్లీ: రచయితలు, శాస్త్రవేత్తలు, సినిమా దర్శకులు దేశంలో విద్వేష పూరిత వాతావరణానికి నిరసనగా తమకు లభించిన సాహిత్య అకాడమీ అవార్డులు, జాతీయ అవార్డులు తిరిగి ఇస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ప్రముఖ చరిత్రకారులు రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, కే ఎన్ పనికర్, మృదులా ముఖర్జీలతో పాటు 53 మంది చరిత్రకారులు దేశంలో జరుగుతున్నటువంటి ఘటనలపై ప్రధాని నరేంద్రమోదీ ఎలాంటి హామీ ఇవ్వకపోవడాన్ని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా భావవ్యక్తీకరణపై అకృత్యాలు జరుగుతన్నాయని, అభిప్రాయ బేధాలను 'ఫిజికల్ వాయిలెన్స్' ద్వారా సరిదిద్దాలని చూస్తున్నారని యూపీలోని దాద్రీ ఘటన, ముంబైలోని సుధీంద్ర కులకర్ణిపై జరిగిన సిరా దాడి తెలుపుతున్నాయని చరిత్రకారులు ఆరోపించారు. రచయితలు నిరసనలు తెలిపితే రచనలు ఆపేయమని ప్రకటించడం, మేధావులను మౌనంగా ఉంచాలని చూడటమేనని చరిత్రకారులు విమర్శించారు.