సైదాపురం గుట్టపై వెలుగు చూసిన పురాతన ఆలయం
సాక్షి, యాదాద్రి : జైనం, బౌద్ధం, వీరశైవం, వైష్ణవ సంప్రదాయాలకు నిలయమైన పురాతన ఆలయాలు పాలకుల ఆలనాపాలనా లేక కనుమరుగవుతున్నాయి. ఆధ్యాత్మిక, చరిత్రక నేపథ్యం కలిగిన యాదాద్రిభువనగిరి జిల్లాలో వందల ఏళ్ల నాటి చరిత్ర కనుమరుగవుతుంది. ఆదిమ మానవుని మనుగడకు సంబంధించిన సమాధుల నుంచి వివిధ మతాలకు చెందిన ఆలయాలు, రాతి విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. కొండలపై, గుట్టలపై చారి త్రక సంపద ఆనవాళ్లు కోల్పోతుంది.
వెలుగుచూస్తున్న ఆలయాలు
జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం సైదాపురం గుట్టపై ఆలయం వెలుగుచూసింది. 16వ శతాబ్ధానికి సంబం ధించిన వైష్ణవ ఆలయంగా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో భువనగిరిలో వటుక భైరవుని విగ్రహం రెండు సంవత్సరాల క్రితం బయటపడింది. అలాగే సైదాపురం గ్రామంలో కోట గోడల ఆనవాళ్లు లభించాయి. రాయగిరి వెంకటేశ్వరాలయం కోనేటి వద్ద గల శివలింగం, ఇతర విగ్రహాలను గుప్త నిధుల కోసం తవ్వేశారు. ఆత్మకూరు(ఎం), అమ్మనబోలు, మాటూరు, రఘునాథపురం, మాసాయిపేట, గొలనుకొండ, ఆలేరు, ఇక్కుర్తి, కొలనుపాక ఇలా పలుచోట్ల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలు, ఆలయాలు ఆదరణకు నోచుకోవడం లేదు. భువనగిరి మండలంలో బయటపడ్డ కాకతీయుల కాలం నాటి శాసనాలు ఎన్నో నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని రక్షిం చాల్సిన అవసరం ఉంది.
గుప్తనిధుల కోసం తవ్వకాలు..
జిల్లాలోని పలు దేవాలయాలు, గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారు. ప్రధానంగా శివాలయాల్లో నంది, శివలింగాలను తవ్వేశారు. జిల్లాలో సుమారు వంద ఆలయాల్లోని విగ్రహాలు, శివలింగాలను గుప్త నిధుల కోసం తవ్వేశారు. కొండలపై, గుట్టలపై గల ఆలయాలు ధ్వంసమయ్యాయి. గుట్టలను పగులగొడుతున్న సమయంలో పురాతన కాలం నాటి ఆలయాలు కనుమరుగవుతున్నాయి. ఆదిమ మానవుడికి సంబంధించిన సమాధులను తవ్వేసి రైతులు పొలాలుగా మార్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పురావస్తు శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వందల సంవత్సరాల సంపద భావితరాలకు లభించకుండాపోతోంది.
ఆలయాలపై అధ్యయనం చేయాలి
పురాతన ఆలయాలు, వాటి చరిత్రపై ప్రభుత్వం అధ్యయనం చేయాలి. యాదాద్రిభువనగిరి జిల్లాలో జైన, బౌద్ధ, వీరశైవ, వైష్ణవ, సంప్రదాయాలకు సంబంధించిన ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. చాలా వరకు కనుమరుగయ్యాయి. మిగిలిన వాటిని రక్షించుకోవాలి. ఎక్కడైనా ఒక నూతన ఆలయం, విగ్రహం బయటపడితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారి ద్వారా కలెక్టర్, ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ ప్రాంతంలో శైవం, వైష్ణవ మతాలు రాజుల కాలంలో ఉన్నత స్థితిలో కొనసాగాయి. వాటికి సంబంధించిన ఆనవాళ్లు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలిన వాటిపై పరిశోధనలు జరిపి చరిత్రకు సాక్ష్యంగా నిలపాలి. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి. –ఎస్.హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకుడు
పురాతన దేవాలయాలను రక్షించాలి
ప్రభుత్వం చారిత్రక సంపదను కాపాడటానికి చర్యలు తీసుకోవాలి. వెలుగులోకి వచ్చిన పురాతన దేవాలయాలను గుర్తించి వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవాలి. తద్వారా రక్షణ కల్పించడానికి వీలవుతుంది. మరుగున పడిన చారిత్రక సంపదను వెలుగులోకి తీసుకురావాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి. పురాతన ఆలయాలకు రక్షణ కల్పించాలి. -తోట భాను, విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి జిల్లాల సహకార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment