సాక్షి, హైదరాబాద్: ఎనిమిది లేదా 9వ శతాబ్దానికి చెందిన జైన తీర్థంకరులలో ఒకరిదని భావిస్తున్న భారీ పాదాన్ని కొలనుపాకలో గుర్తించారు. ఈ పాదం దాదాపు నాలుగు అడుగుల పొడవుంది. అక్కడ గతంలో ధ్వంసమై చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలు, విగ్రహాలను సోమేశ్వరాలయం సమీపంలోని ప్రాంగణానికి చేర్చే పని ప్రస్తుతం జరుగుతోంది. అక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు చూసేందుకు వీలుగా వీటిని ఒకచోట ఉంచబోతున్నారు.
ఈక్రమంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు కుమారస్వామి, సోమిరెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శిథిల విగ్రహాల మధ్య ఈ పాదాన్ని గుర్తించారు. జైన తీర్థంకరులలో ఒకరికి సంబంధించిన పాదాల్లో ఎడమ పాదంగా వారు నిర్ధారణకు వచ్చారు. దీన్ని చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత పురావస్తు అధికారి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కూడా ధ్రువీకరించారని హరగోపాల్ పేర్కొన్నారు.
దీన్ని పాదంగా మాత్రమే ఏర్పాటు చేసినదా? లేదా భారీ విగ్రహానికి చెందిన భాగమా? అన్న విషయమై స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా గొల్లత్తగుడి జైన మందిరం వెనక ఆరు అడుగులు, ఐదు అడుగుల పొడవున్న రెండు జతల భారీ జైన పాదాలను గుర్తించారు. నిర్మల్ జిల్లా భైంసాలో కూడా 3 భారీ పాదాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో భారీ జైన పాదాలున్న మూడో ప్రాంతంగా కొలనుపాకను గుర్తించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పాదం మీద నూపురం, కాలివేళ్లకు అలంకారాలు కనిపిస్తున్నట్టు హరగోపాల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment