సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఫిల్మ్‌నగర్ నుంచి దర్గా మార్గంలో ప్రయాణించే వారికి శుక్రవారం నుంచి కొత్తందాలు కనిపిస్తున్నాయి. దాదాపు అరకిలోమీటరు పొడవునా నాలుగు మీటర్ల వెడల్పయిన సెంట్రల్ మీడియన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లేలా వాక్‌వే సైతం ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ మార్గంలోని నాలుగు సర్కిళ్లలో ఏర్పాటు చేసిన శిల్పాలు, వాటి చుట్టూ పెంచిన పూలమొక్కలతో ప్రత్యేకతను సంతరించుకుంది.
సినీ ప్రపంచం తలపించేలా..
ఫిల్మ్‌నగర్ అంటేనే సినీమయం కావడంతో సినీప్రపంచాన్ని తలపించేలా సినీ కెమెరా.. సినిమాలో మాదిరిగా ఇద్దరి నడుమ కత్తియుద్ధం శిల్పాలతోపాటు ‘హ్యుమానిటీ’ ‘యూనిక్ లైట్ పోల్’ థీమ్స్‌తో కొలువుదీరిన మరో రెండు శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఏర్పాటు చేసిన ఈ నాలుగు శిల్పాల తెరలను శుక్రవారం తొలగించడంతో ఆ మార్గంలో వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి. ఈ కళాకృతుల కోసం మొత్తం రూ. 30 లక్షలు ఖర్చయింది.
పచ్చందాలు.. ఫౌంటెన్లకు మరమ్మతులు
మరోవైపు త్వరలో చేపట్టనున్న పట్టణప్రగతిలో భాగంగా ఖాలీగా ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ మొక్కలు పెంచి పచ్చదనం పరిచేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లై ఓవర్ల కింద స్తంభాల పైనా, రహదారుల వెంబడి ఉండే గోడలపైనా గ్రీన్ కర్టెన్స్ (వేలాడే తీగలు) తదితరమైన వాటితో పచ్చదనం పరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాడైపోయిన ఫౌంటెన్లకు సైతం మరమ్మతులు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దే యోచనలో అధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment