ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మాటూరు శివారులో విభూది గడ్డగా పిలిచే మట్టి దిబ్బ. దీని కింద మహాదేవాలయం ఉందని చరిత్ర పరిశోధకులు గుర్తించారు. దాదాపు వెయ్యేళ్ల కిందట నిర్మించిన ఆలయం భూగర్భంలో పదిలంగా ఉందన్నమాట. ఇక్కడ లభించిన శాసనం ఆధారంగా అది కళ్యాణీచాళుక్యుల కాలంలో నిర్మితమైనట్టు గుర్తించారు.
ఇది వరంగల్ మట్టి కోటకు ఈశాన్యం వైపు ఉన్న ఎల్పీగండి ప్రాంతంలోని త్రికూటాలయం. ఇలా కొంత భాగం వెలుపలికి కనిపిస్తున్నా మిగతా గుడి అంతా భూగర్భంలోనే ఉండిపోయింది. 1998 ప్రాంతంలో కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు అందిన సమాచారం మేరకు కొంత భాగాన్ని తవ్వగా ఇక్కడ ఆలయం వెలుగు చూసింది.
అది శివాలయమని గుర్తించారు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఓరుగల్లుపై దండయాత్ర ప్రారంభించింది ఈ దేవాలయం ఉన్న వైపు నుంచే కావటం విశేషం. ఇక్కడి గోడలను ధ్వంసం చేసి కోటలోనికి చొచ్చుకెళ్లారని పరిశోధకులు చెబుతారు. దీనికి సమీపంలో మట్టిదిబ్బ కింద మరో మూడు, మట్టిగోడ పశ్చిమ భాగంలో మరో నాలుగైదు ఆలయాలు ఇలా కూరుకుపోయి ఉన్నాయి. ఈ ఆలయాలు మట్టి కింద కప్పి ఉండటంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ కంటపడలేదు.
ఇది సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరులోని శివాలయం. ముస్లింరాజుల దండయాత్రల నుంచి కాపాడుకునే క్రమంలో ఇది భూగర్భంలోకి వెళ్లిపోగా కొన్నేళ్ల కింద వెలికితీశారు.
ఇటీవలే కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, వినోద్‌కుమార్ తదితరులు పరిశీలించి ఇది రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన ప్రత్యేక తరహా మందిరమని గుర్తించారు. రెండువైపులా కిటికీలు తప్ప గోడలపై శిల్పాలు లేవని, గర్భాలయంలో క్షితిజ సమాంతరంగా చతురస్రాకారపు పానవట్టంలో బాణలింగం ఉందని పేర్కొన్నారు.
ఇది వరంగల్ మట్టి కోటగోడ పశ్చిమభాగంలో గోడ దిగువన మట్టిలో కూరుకుపోయి ఉన్న భారీ ఆలయం పైకప్పు భాగం. కోట లోపలి వైపు మందిరం ఉంటే, ప్రవేశం ద్వారా గోడకు అవతలి వైపు ఉంది. అంటే ఆలయాన్ని మట్టితో కప్పిన తర్వాత దానిమీద మట్టిగోడ నిర్మించినట్టు తెలుస్తోంది.
సాక్షి, హైదరాబాద్: సూది మొన దూరేంతటి సూక్ష్మ నగిశీలతో చెక్కిన శిల్పాలు వరంగల్ కోటలో మైమరిపిస్తాయి. ఒకప్పుడు ఇవన్నీ అద్భుత దేవాలయ నిర్మాణంలో భాగమే. కానీ, ఇప్పుడవి ముక్కలు చెక్కలుగా మారి వరంగల్ కోటలో పడి ఉన్నాయి. వేయిస్తంభాల గుడి సహా పలు దేవాలయాల్లో ఇలానే నేటికీ కనిపిస్తాయి.
ఎంతో భక్తిశ్రద్ధలతో, అద్భుత శిల్పసౌందర్యంతో నిర్మించుకున్న ఆలయాలు ముస్లిం రాజుల విధ్వంసాల బారిన పడకుండా స్థానికులు వాటిపై మట్టిని కప్పి, మట్టి లో మొక్కలు పెంచి కాపాడుకున్నారు. అలా అవి శతాబ్దాలుగా మట్టిదిబ్బల కిందే ఉండిపోయాయి.
త్వరలో నాగ్‌పూర్, ఒడిశాల నుంచి ఏఎస్‌ఐ నిపుణులు
వరంగల్ ఎల్పీగండిలో వెలుగు చూసిన ఆలయాన్ని పూర్తిస్థాయిలో బయటకు తీసే పనులను త్వరలో నాగ్‌పూర్, ఒడిశా ఏఎస్‌ఐ నిపుణులు ప్రారంభించ నున్నట్లు తెలుస్తోంది. దీనికి సమీపంలో ఇతర ఆల యాలను కూడా వెలుగులోకి తేనున్నట్టు సమాచా రం. తవ్వకాలపై ప్లాన్ చేసుకునేందుకు ఇటీవలే వచ్చి వాటిని పరిశీలించి వెళ్లారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు..
వర్షాలకు పైమట్టి కొంత కరిగి మట్టిదిబ్బల కింద ఆలయాల ఆనవాళ్లు వెలుగు చూసిన ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఆలయాలు పూర్తిగా బయటపడకముందే ఇలా ధ్వంసమవుతున్నాయి. వెంటనే తెలంగాణ వార సత్వ శాఖ వీటిపై దృష్టి సారించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment