Jainism
-
ఆడిపాడే వయసులో.. భక్తిమార్గమే గొప్పదని..
సాక్షి, హొసపేటె: ఆడిపాడే వయసులో ఓ యువతి ఇహలోక అంశాలను త్యజించి సన్యాసదీక్ష తీసుకుంది. హొసపేటె నగరంలో నివాసముంటున్న వ్యాపారి దివంగత కాంతిలాల్ జిరావర్, రేఖా దేవి దంపతుల నలుగురు కుమార్తెల్లో మూడో కుమార్తె ముముక్ష బుధవారం జైన మత సంప్రదాయాల ప్రకారం సన్యాసదీక్ష స్వీకరించింది. స్థానిక హోటల్ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జైనమునులు ఆమెకు సన్యాస దీక్ష ఇచ్చారు. ఆధ్యాత్మిక ప్రపంచమే మిన్న 19 ఏళ్ల ముముక్ష మాట్లాడుతూ తన నాలుగేళ్ల వయస్సులో తండ్రి ఓ ప్రమాదంలో మృతి చెందారు. అన్ని కష్టాలను అధిగమించి తాను 10వ తరగతిలో 95.8 శాతం, పీయూసీలో 99 శాతం మార్కులతో పాసైనట్లు తెలిపింది. లౌకిక ప్రపంచం కన్నా తనకు ఆధ్యాత్మిక ప్రపంచమే మిన్నగా భావించి ఈరోజు జైన సన్యాసాన్ని స్వీకరించానని తెలిపింది. ఈ సందర్భంగా బంధుమిత్రులు ఆమెను భారమైన హృదయాలతో అభినందించారు. -
కొలనుపాకలో నాలుగడుగుల జైన పాదం
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది లేదా 9వ శతాబ్దానికి చెందిన జైన తీర్థంకరులలో ఒకరిదని భావిస్తున్న భారీ పాదాన్ని కొలనుపాకలో గుర్తించారు. ఈ పాదం దాదాపు నాలుగు అడుగుల పొడవుంది. అక్కడ గతంలో ధ్వంసమై చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలు, విగ్రహాలను సోమేశ్వరాలయం సమీపంలోని ప్రాంగణానికి చేర్చే పని ప్రస్తుతం జరుగుతోంది. అక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు చూసేందుకు వీలుగా వీటిని ఒకచోట ఉంచబోతున్నారు. ఈక్రమంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు కుమారస్వామి, సోమిరెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శిథిల విగ్రహాల మధ్య ఈ పాదాన్ని గుర్తించారు. జైన తీర్థంకరులలో ఒకరికి సంబంధించిన పాదాల్లో ఎడమ పాదంగా వారు నిర్ధారణకు వచ్చారు. దీన్ని చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత పురావస్తు అధికారి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కూడా ధ్రువీకరించారని హరగోపాల్ పేర్కొన్నారు. దీన్ని పాదంగా మాత్రమే ఏర్పాటు చేసినదా? లేదా భారీ విగ్రహానికి చెందిన భాగమా? అన్న విషయమై స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా గొల్లత్తగుడి జైన మందిరం వెనక ఆరు అడుగులు, ఐదు అడుగుల పొడవున్న రెండు జతల భారీ జైన పాదాలను గుర్తించారు. నిర్మల్ జిల్లా భైంసాలో కూడా 3 భారీ పాదాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో భారీ జైన పాదాలున్న మూడో ప్రాంతంగా కొలనుపాకను గుర్తించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పాదం మీద నూపురం, కాలివేళ్లకు అలంకారాలు కనిపిస్తున్నట్టు హరగోపాల్ వెల్లడించారు. -
శశి థరూర్‌కు చేదు అనుభవం
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ట్విటర్లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. గురువారం మహవీర్ జయంతి సందర్భంగా జైనులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బుద్దుని ఫొటో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆయన తప్పును ఎత్తిచూపారు. ‘థ్యాంకూ శశీ జీ.. కానీ మీరు మహవీర్ ఫొటోకు బదులు బుద్ధ భగవాన్ ఫొటో పెట్టారు’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘జైనిజం, బుద్దిజం రెండు వేర్వేరు మతాలు’ అని మీకు తెలుసనుకుంటా అని మరొకరు చమత్కరించారు. ‘అందరూ మేధావిగా భావించే మీరు ఎంత పెద్ద పాపం ఎలా చేశారు. అయినా మనిషి అన్నాక తప్పు చేయడం సహజం మీరు కూడా మనిషేగా’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. దీనిని గమనించిన శశి థరూర్ తాను తప్పు చేయనని, చేసినా ఒప్పుకుంటానని, సాక్ష్యాలు కూడా దాచిపెట్టనని.. నిజాయితీగా ఉండటమే అన్నిటికన్నా ముఖ్యమని ట్వీట్ చేశారు. ఫొటో లింక్ షేర్ చేసి ‘నాలాగే చాలా మంది పొరపాటు చేసి ఉంటారు. నా కారణంగానైనా ఇది వెలుగులోకి వచ్చిందంటూ తన పొరపాటును సమర్థించుకున్నారు. అంతేకాకుండా ఈ పొరపాటు చేసిన వారందరినీ ట్యాగ్ చేస్తూ.. మహవీర్‌కు బదులు బుద్ధుని ఫొటోను పెట్టిన క్లబ్‌లోకి మీకు స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా థరూర్లాగే బుద్ధుని ఫొటో పోస్ట్ చేశారు. pic.twitter.com/DP6hT70AJh — Shashi Tharoor (@ShashiTharoor) March 29, 2018 -
కనుమరుగవుతున్న చరిత్ర..!
సాక్షి, యాదాద్రి : జైనం, బౌద్ధం, వీరశైవం, వైష్ణవ సంప్రదాయాలకు నిలయమైన పురాతన ఆలయాలు పాలకుల ఆలనాపాలనా లేక కనుమరుగవుతున్నాయి. ఆధ్యాత్మిక, చరిత్రక నేపథ్యం కలిగిన యాదాద్రిభువనగిరి జిల్లాలో వందల ఏళ్ల నాటి చరిత్ర కనుమరుగవుతుంది. ఆదిమ మానవుని మనుగడకు సంబంధించిన సమాధుల నుంచి వివిధ మతాలకు చెందిన ఆలయాలు, రాతి విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. కొండలపై, గుట్టలపై చారి త్రక సంపద ఆనవాళ్లు కోల్పోతుంది. వెలుగుచూస్తున్న ఆలయాలు జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం సైదాపురం గుట్టపై ఆలయం వెలుగుచూసింది. 16వ శతాబ్ధానికి సంబం ధించిన వైష్ణవ ఆలయంగా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో భువనగిరిలో వటుక భైరవుని విగ్రహం రెండు సంవత్సరాల క్రితం బయటపడింది. అలాగే సైదాపురం గ్రామంలో కోట గోడల ఆనవాళ్లు లభించాయి. రాయగిరి వెంకటేశ్వరాలయం కోనేటి వద్ద గల శివలింగం, ఇతర విగ్రహాలను గుప్త నిధుల కోసం తవ్వేశారు. ఆత్మకూరు(ఎం), అమ్మనబోలు, మాటూరు, రఘునాథపురం, మాసాయిపేట, గొలనుకొండ, ఆలేరు, ఇక్కుర్తి, కొలనుపాక ఇలా పలుచోట్ల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలు, ఆలయాలు ఆదరణకు నోచుకోవడం లేదు. భువనగిరి మండలంలో బయటపడ్డ కాకతీయుల కాలం నాటి శాసనాలు ఎన్నో నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని రక్షిం చాల్సిన అవసరం ఉంది. గుప్తనిధుల కోసం తవ్వకాలు.. జిల్లాలోని పలు దేవాలయాలు, గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారు. ప్రధానంగా శివాలయాల్లో నంది, శివలింగాలను తవ్వేశారు. జిల్లాలో సుమారు వంద ఆలయాల్లోని విగ్రహాలు, శివలింగాలను గుప్త నిధుల కోసం తవ్వేశారు. కొండలపై, గుట్టలపై గల ఆలయాలు ధ్వంసమయ్యాయి. గుట్టలను పగులగొడుతున్న సమయంలో పురాతన కాలం నాటి ఆలయాలు కనుమరుగవుతున్నాయి. ఆదిమ మానవుడికి సంబంధించిన సమాధులను తవ్వేసి రైతులు పొలాలుగా మార్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పురావస్తు శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వందల సంవత్సరాల సంపద భావితరాలకు లభించకుండాపోతోంది. ఆలయాలపై అధ్యయనం చేయాలి పురాతన ఆలయాలు, వాటి చరిత్రపై ప్రభుత్వం అధ్యయనం చేయాలి. యాదాద్రిభువనగిరి జిల్లాలో జైన, బౌద్ధ, వీరశైవ, వైష్ణవ, సంప్రదాయాలకు సంబంధించిన ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. చాలా వరకు కనుమరుగయ్యాయి. మిగిలిన వాటిని రక్షించుకోవాలి. ఎక్కడైనా ఒక నూతన ఆలయం, విగ్రహం బయటపడితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారి ద్వారా కలెక్టర్, ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ ప్రాంతంలో శైవం, వైష్ణవ మతాలు రాజుల కాలంలో ఉన్నత స్థితిలో కొనసాగాయి. వాటికి సంబంధించిన ఆనవాళ్లు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలిన వాటిపై పరిశోధనలు జరిపి చరిత్రకు సాక్ష్యంగా నిలపాలి. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి. –ఎస్.హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకుడు పురాతన దేవాలయాలను రక్షించాలి ప్రభుత్వం చారిత్రక సంపదను కాపాడటానికి చర్యలు తీసుకోవాలి. వెలుగులోకి వచ్చిన పురాతన దేవాలయాలను గుర్తించి వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవాలి. తద్వారా రక్షణ కల్పించడానికి వీలవుతుంది. మరుగున పడిన చారిత్రక సంపదను వెలుగులోకి తీసుకురావాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి. పురాతన ఆలయాలకు రక్షణ కల్పించాలి. -తోట భాను, విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి జిల్లాల సహకార్యదర్శి -
అజ్ఞాతవాసిగా ఐఐటీ గ్రాడ్యుయేట్..
సాక్షి, ముంబయి : ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ..అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగం..సంప్రదాయ కుటుంబం.. అన్నిటినీ వదిలేసిన సంకేత్ పరేఖ్ భిన్న ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ అమెరికాలో పీజీ కోర్సు చేయాలని కలలుగన్న సంకేత్ తన సీనియర్‌తో చేసిన ఆన్లైన్ చాట్‌తో అన్నీ తలకిందులయ్యాయి. సర్వం త్యజించి ఈనెల 22న ముంబయిలో సంకేత్ జైనిజం స్వీకరించేందుకు ముహుర్తం ఖరారైంది. వైష్ణవ కుటుంబానికి చెందిన సంకేత్ ఐఐటీలో తన సీనియర్, 2013లో దీక్ష తీసుకున్న భవిక్ షా బాటలో జైనిజంలో అడుగుపెడుతున్నాడు. ఉద్యోగంలో కొనసాగదలుచుకుంటే తాను కోరుకున్నవన్నీ పొందేవాడిననీ..అయితే తనలో చెలరేగిన మానసిక సంఘర్షణ ఇప్పటికి శాంతించిందని సంకేత్ చెప్పుకొచ్చాడు. తాను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచీ సీనియర్ భవిక్‌తో చాట్ చేస్తుండేవాడినని, తమ సంభాషణలు క్రమంగా ఆత్మ, మనసు, శరీరం చుట్టూ తిరిగేవని, ఆ ఆలోచనలు తనను ఆత్మాన్వేషణ వైపు పురిగొల్పి..జైనిజం వైపు నడిపాయని అన్నాడు. ప్రస్తుతం సంకేత్ పరేఖ్ తన వస్తువులను చివరికి స్నేహితుడితో చాట్ చేసేందుకు ఉపయోగించిన కంప్యూటర్ను సైతం విడిచిపెట్టాడు. -
ముదిరిన ‘మాంసం’ గొడవ
* కశ్మీర్, రాజస్తాన్‌లలోనూ నిషేధం * జైనుల పర్వదినాల్లో మాంసం విక్రయాల నిషేధంపై ఆందోళనలు జైపూర్/ముంబై: జైనుల పవిత్రదినాలను పురస్కరించుకుని గొడ్డుమాంసం, చేపల అమ్మకాలను మూడు రోజులపాటు నిలిపేయాలంటూ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ఇటీవల ఇచ్చిన ఉత్తర్వు కారణంగా మహారాష్ట్రసహా రాజస్తాన్, జమ్మూకశ్మీర్‌లో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. జమ్మూకశ్మీర్‌లో తాజాగా హైకోర్టు నిషేధం విధించడంతో, జమాతే ఇస్లామీలాంటి సంస్థలు ఆ రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టాయి. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఆదేశాలను ఖాతరు చేయమని జమాతే ఇస్లామీ సంస్థ కొత్త చీఫ్ గులామ్ మొహమ్మద్ భట్ శ్రీనగర్‌లో అన్నారు. ముంబైలో శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ్‌సేన(ఎంఎన్ఎస్) సంస్థలు వీధుల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేసి నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. ఈనెల 17, 18, 27 తేదీల్లో మాంసం అమ్మకాలను నిలిపేయాలని రాజస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆయా తేదీల్లో మాంసం దుకాణాలను మూసేలా చూడాలని అన్ని మున్సిపల్ కార్యాలయాలకు ఉత్తర్వలు జారీచేసింది. ముంబైలో శివసేన, ఎంఎన్ఎస్లు నిరసన తెలపగా, బీజేపీ ఉత్తర్వును స్వాగతించింది. ఎంసీజీఎంకు 2017లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పక్షపాత ధోరణితో ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చిందని కాంగ్రెస్, ఎన్సీపీలు ఆరోపించాయి. సెప్టెంబర్ 10, 13, 17 తేదీల్లో మాంసం అమ్మకాలు ఉంటాయని శివసేన ప్రకటించింది. నిరసనగా గురువారం ముంబైలో రద్దీగా ఉండే దాదర్ ప్రాంతంలో చికెన్ అమ్మకాల కోసం ప్రత్యేకంగా విక్రయకేంద్రాన్ని శివసేన ప్రారంభించింది. పోలీసులు జోక్యం చేసుకుని కొందరు కార్యకర్తలను అరెస్టుచేశారు. ఆ తేదీల్లో ముంబై అంతటా స్టాల్స్ తెరచి మాంసం విక్రయించి తీరుతామని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం వ్యాఖ్యానించారు.