ముదిరిన ‘మాంసం’ గొడవ
* కశ్మీర్, రాజస్తాన్‌లలోనూ నిషేధం
* జైనుల పర్వదినాల్లో మాంసం విక్రయాల నిషేధంపై ఆందోళనలు
జైపూర్/ముంబై: జైనుల పవిత్రదినాలను పురస్కరించుకుని గొడ్డుమాంసం, చేపల అమ్మకాలను మూడు రోజులపాటు నిలిపేయాలంటూ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ఇటీవల ఇచ్చిన ఉత్తర్వు కారణంగా మహారాష్ట్రసహా రాజస్తాన్, జమ్మూకశ్మీర్‌లో నిరసన జ్వాలలు పెల్లుబికాయి.
జమ్మూకశ్మీర్‌లో తాజాగా హైకోర్టు నిషేధం విధించడంతో, జమాతే ఇస్లామీలాంటి సంస్థలు ఆ రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టాయి. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఆదేశాలను ఖాతరు చేయమని జమాతే ఇస్లామీ సంస్థ కొత్త చీఫ్ గులామ్ మొహమ్మద్ భట్ శ్రీనగర్‌లో అన్నారు. ముంబైలో శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ్‌సేన(ఎంఎన్‌ఎస్) సంస్థలు వీధుల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేసి నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. ఈనెల 17, 18, 27 తేదీల్లో మాంసం అమ్మకాలను నిలిపేయాలని రాజస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఆయా తేదీల్లో మాంసం దుకాణాలను మూసేలా చూడాలని అన్ని మున్సిపల్ కార్యాలయాలకు ఉత్తర్వలు జారీచేసింది. ముంబైలో శివసేన, ఎంఎన్‌ఎస్‌లు నిరసన తెలపగా, బీజేపీ ఉత్తర్వును స్వాగతించింది. ఎంసీజీఎంకు 2017లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పక్షపాత ధోరణితో ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చిందని కాంగ్రెస్, ఎన్‌సీపీలు ఆరోపించాయి. సెప్టెంబర్ 10, 13, 17 తేదీల్లో మాంసం అమ్మకాలు ఉంటాయని శివసేన ప్రకటించింది.
నిరసనగా గురువారం ముంబైలో రద్దీగా ఉండే దాదర్ ప్రాంతంలో చికెన్ అమ్మకాల కోసం ప్రత్యేకంగా విక్రయకేంద్రాన్ని శివసేన ప్రారంభించింది. పోలీసులు జోక్యం చేసుకుని కొందరు కార్యకర్తలను అరెస్టుచేశారు. ఆ తేదీల్లో ముంబై అంతటా స్టాల్స్ తెరచి మాంసం విక్రయించి తీరుతామని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం వ్యాఖ్యానించారు.