ఢిల్లీ: రచయితలు, శాస్త్రవేత్తలు, సినిమా దర్శకులు దేశంలో విద్వేష పూరిత వాతావరణానికి నిరసనగా తమకు లభించిన సాహిత్య అకాడమీ అవార్డులు, జాతీయ అవార్డులు తిరిగి ఇస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ప్రముఖ చరిత్రకారులు రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, కే ఎన్ పనికర్, మృదులా ముఖర్జీలతో పాటు 53 మంది చరిత్రకారులు దేశంలో జరుగుతున్నటువంటి ఘటనలపై ప్రధాని నరేంద్రమోదీ ఎలాంటి హామీ ఇవ్వకపోవడాన్ని ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
దేశంలో ఎన్నడూ లేని విధంగా భావవ్యక్తీకరణపై అకృత్యాలు జరుగుతన్నాయని, అభిప్రాయ బేధాలను 'ఫిజికల్ వాయిలెన్స్' ద్వారా సరిదిద్దాలని చూస్తున్నారని యూపీలోని దాద్రీ ఘటన, ముంబైలోని సుధీంద్ర కులకర్ణిపై జరిగిన సిరా దాడి తెలుపుతున్నాయని చరిత్రకారులు ఆరోపించారు. రచయితలు నిరసనలు తెలిపితే రచనలు ఆపేయమని ప్రకటించడం, మేధావులను మౌనంగా ఉంచాలని చూడటమేనని చరిత్రకారులు విమర్శించారు.