సింగరాయకొండ గుట్టపై లభించిన అమ్మ దేవత శిల్పం
సాక్షి, హైదరాబాద్: అత్యంత పురాతన ‘మాతృ దేవత’ ప్రతిమ సిద్దిపేట సమీపంలో వెలుగు చూసింది. సంతాన సాఫల్యానికి ప్రతిరూపంగా ‘అమ్మ’ శిల్పాన్ని ఆరాధించే పద్ధతి వేల ఏళ్ల కిందటే మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విగ్రహాలు వివిధ రూపాల్లో వెలుగు చూశాయి. మన దేశంలో అమ్మ దేవత, లజ్జా గౌరీగా ఆరాధించిన ఆనవాళ్లు తేలాయి. నగ్నరూపంలో ఉండే ఈ భంగిమ అమ్మ తనానికి చిహ్నంగా భావిస్తారు. గతంలో అమరావతి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఇలాంటి శిల్పాలు వెలుగు చూడగా, హైదరాబాద్ శివారులోని కీసరగుట్ట క్షేత్రం చేరువలో పురావస్తు తవ్వకాల్లో ఇలాంటి ఓ శిల్పం వెలుగు చూసింది.
తాజాగా ఇదే ఆనవాళ్లతో సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సింగరాయ కొండ గ్రామ శివారు గుట్టపై లభించింది. సున్నపు రాయిపై చెక్కింది కావటం, దాన్ని తొలగించే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో కొంత ధ్వంసమైంది. తాజాగా దాన్ని ఔత్సాహిక చరిత్రకారులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, వేముగంటి మురళీకృష్ణ, శ్రీరామోజు హరగోపాల్ తదితరులు పరిశీలించి అమ్మదేవత ప్రతిరూప మని తేల్చారు. గతంలో లభించిన విగ్రహాల కంటే ఇది చాలా పురాతనమైందని, దాదాపు క్రీ.పూ. రెండో శతాబ్దానికి చెందినదై ఉంటుందని భావిస్తున్నట్లు హరగోపాల్ వెల్లడించారు.
రూపమే విచిత్రం..
అమ్మ తనానికి ప్రతీకగా ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయటం గతంలో ఉండేది. తల్లి ప్రసవించేటప్పుడు ఉండే భంగిమగా దీన్ని గతంలో కొందరు చరిత్రకారులు తేల్చారు. నగ్నంగా ఉండే రూపం అయినందున ముఖం ఉండేది కాదని, తల స్థానంలో విచ్చుకున్న పద్మం చెక్కేవారని చెప్పారు. భౌతిక, మానసిక పరిపక్వతకు చిహ్నంగా వికసిత పద్మాన్ని పేర్కొంటారని చరిత్రకారులు చెబుతున్నారు. సింగరాయకొండ గుట్టపై లభించిన శిల్పానికి కూడా శిరస్సు స్థానంలో పద్మం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడే గతంలో బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. స్థానికంగా ఉన్న దేవాలయం దిగువన బౌద్ధ స్తూపం ఉండేదని, ఇక్కడే ఆరో శతాబ్దానికి చెందిన చతుర్ముఖ బౌద్ధ బ్రహ్మ శిల్పం, మట్టి ఒరల బావి వెలుగు చూసినట్లు హరగోపాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment