Archaeological excavations
-
88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!!
World's oldest wedding cake: పురావస్తు తవ్వకాల్లో ఎన్నో వస్తువులు బయటపడుతుండటం చూస్తుంటాం.. కానీ, మానవుడు తయారు చేసిన తినుబండారం చెక్కుచెదరకుండా బయట పడటం ఇదే మొదటిసారి కావొచ్చు. అది కూడా రెండు రోజుల్లో కుళ్లిపోగల కేకు.. ఇన్నేళ్లుగా ఎలా చెడిపోలేదో ఆశ్యర్యపోతున్నారా! నిజం.. ఇంగ్లండ్‌లోని దహనమైపోయిన ఓ ఇంటిలో సుమారు 88 సంవత్సరాల క్రితం తయారు చేసిన కేకు ఒకటి బయటపడింది. ఆ కేకు రూపం మాత్రం చెక్కు చెదరలేదు. పైగా గార్నిషింగ్ కోసం వాడిన చాక్లెట్ చిప్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఓ కత్తి, నాలుగు చెంచాలు కూడా దొరికాయి. ఇదంతా చూస్తుంటే.. ఎవరి పుట్టినరోజో విషాదాంతంగా ముగిసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ కేకు ఎవరు తయారు చేశారో తెలియదు కానీ, ఆ ఇంటి యజమానిని జోహాన్ వార్మ్ అనే వ్యక్తిగా గుర్తించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వందలాది ఇళ్లు మంటల్లో చిక్కుకుపోయాయి. ఈ ఇల్లు కూడా ఆ మంటల్లోనే చిక్కుకొని పూర్తిగా దహనమైపోయిందని అధికారులు తెలిపారు. పైగా ఈ కేకులో ఎటువంటి రసాయనాలను గుర్తించలేదని, ఇలా చెక్కు చెదరకుండా ఉండటానికి గల కారణం, త్వరలోనే కనుగొంటామని వారు చెప్పారు. చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా.. -
సింగరాయకొండలో ‘అమ్మ దేవత’
సాక్షి, హైదరాబాద్: అత్యంత పురాతన ‘మాతృ దేవత’ ప్రతిమ సిద్దిపేట సమీపంలో వెలుగు చూసింది. సంతాన సాఫల్యానికి ప్రతిరూపంగా ‘అమ్మ’ శిల్పాన్ని ఆరాధించే పద్ధతి వేల ఏళ్ల కిందటే మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విగ్రహాలు వివిధ రూపాల్లో వెలుగు చూశాయి. మన దేశంలో అమ్మ దేవత, లజ్జా గౌరీగా ఆరాధించిన ఆనవాళ్లు తేలాయి. నగ్నరూపంలో ఉండే ఈ భంగిమ అమ్మ తనానికి చిహ్నంగా భావిస్తారు. గతంలో అమరావతి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఇలాంటి శిల్పాలు వెలుగు చూడగా, హైదరాబాద్ శివారులోని కీసరగుట్ట క్షేత్రం చేరువలో పురావస్తు తవ్వకాల్లో ఇలాంటి ఓ శిల్పం వెలుగు చూసింది. తాజాగా ఇదే ఆనవాళ్లతో సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సింగరాయ కొండ గ్రామ శివారు గుట్టపై లభించింది. సున్నపు రాయిపై చెక్కింది కావటం, దాన్ని తొలగించే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో కొంత ధ్వంసమైంది. తాజాగా దాన్ని ఔత్సాహిక చరిత్రకారులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, వేముగంటి మురళీకృష్ణ, శ్రీరామోజు హరగోపాల్ తదితరులు పరిశీలించి అమ్మదేవత ప్రతిరూప మని తేల్చారు. గతంలో లభించిన విగ్రహాల కంటే ఇది చాలా పురాతనమైందని, దాదాపు క్రీ.పూ. రెండో శతాబ్దానికి చెందినదై ఉంటుందని భావిస్తున్నట్లు హరగోపాల్ వెల్లడించారు. రూపమే విచిత్రం.. అమ్మ తనానికి ప్రతీకగా ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయటం గతంలో ఉండేది. తల్లి ప్రసవించేటప్పుడు ఉండే భంగిమగా దీన్ని గతంలో కొందరు చరిత్రకారులు తేల్చారు. నగ్నంగా ఉండే రూపం అయినందున ముఖం ఉండేది కాదని, తల స్థానంలో విచ్చుకున్న పద్మం చెక్కేవారని చెప్పారు. భౌతిక, మానసిక పరిపక్వతకు చిహ్నంగా వికసిత పద్మాన్ని పేర్కొంటారని చరిత్రకారులు చెబుతున్నారు. సింగరాయకొండ గుట్టపై లభించిన శిల్పానికి కూడా శిరస్సు స్థానంలో పద్మం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడే గతంలో బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. స్థానికంగా ఉన్న దేవాలయం దిగువన బౌద్ధ స్తూపం ఉండేదని, ఇక్కడే ఆరో శతాబ్దానికి చెందిన చతుర్ముఖ బౌద్ధ బ్రహ్మ శిల్పం, మట్టి ఒరల బావి వెలుగు చూసినట్లు హరగోపాల్ తెలిపారు. -
పెద్దపల్లిలో చారిత్రక ఆధారాలు
పెద్దపల్లి రూరల్: రెండు వేల ఏళ్లనాటి చారిత్రక ఆనవాళ్లు మట్టిదిబ్బల కింద పదిలంగా ఉన్నాయి. పాచికలు, మట్టిపాత్రలు, కొలత పావులు, చిన్నపాటి రింగ్ వంటి వస్తువులు..అబ్బురపరిచే ఇటుక కట్టడాలు పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. నెలరోజులుగా పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్‌లో రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఇవి లభ్యమయ్యాయి. ఈ తవ్వకాలను బుధవారం పురావస్తుశాఖ డైరెక్టర్ విశాలాచ్చి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ శాతవాహనులు పెద్దబొంకూర్ నుంచే తమ పాలన సాగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. 50 ఏళ్ల తర్వాత మళ్లీ తవ్వకాలు సాగిస్తున్నామని.. దేశచరిత్రను భావితరాలకు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈ తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు. అప్పట్లో ఈ ప్రాంతవాసులు మట్టితో తయారైన పూసలను మెడలో వేసుకునేవారని లభించిన ఆధారాలు తెలుపుతున్నాయన్నారు. శంకంతో చేసిన పూసలు, ముల్లాపు పూసలు, పచ్చటి బంగారు రేకులతో చేసిన పూతలు, క్రిస్టల్, గాజు, షేల్ బ్రీడ్స్, కార్నేలియన్ పూసలను కూడా వినియోగించినట్లు సాక్ష్యం ఉందని తెలిపారు. చదరంగ ఆట కోసం ఎముకలతో తయారైన పాచికలను తయారు చేసిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఇనుముతో తయారు చేసిన రింగ్, మట్టిపాత్రలు కూడా తవ్వకాల్లో బయటపడ్డట్టు తెలిపారు. ఇటుక కట్టడాలు, వృత్తాకారపు ఇటుక నిర్మాణాలు, నీటిబావులు, డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని వివరించారు. సిద్దిపేట జిల్లాలో బృహత్ శిలాయుగపు ఆనవాళ్లు: రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత చారిత్రక పరిశోధనలు చేపట్టిన సిద్దిపేట జిల్లాలో బృహత్ శిలాయుగపు సమాధుల్లో లభించిన మానవ అవశేషాలు క్రీస్తుపూర్వం 600 ఏళ్ల నాటివిగా గుర్తించినట్లు తెలిపారు. పుల్లూరుబండ గ్రామంలో చేపట్టిన తవ్వకాల్లో మానవ ఆకృతి గల స్త్రీ శిల్పం(ఆంత్రోఫామిక్ ఫిమేల్ ఫిగర్) దక్షిణ భారతదేశంలోనే మొదటిగా భావిస్తున్నట్లు చెప్పారు. నర్మెట్టలోని సమాధిలో లభించిన ఎముకతో తయారు చేసిన(డైమండ్ షేప్) ఆభరణాలు, సమాధిపై పేర్చిన పైకప్పు మూతరాయి భారీ గండశిలను పేర్చి ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చన్నారు. ఇన్చార్జి రాములునాయక్, ఇంజినీరింగ్ డెప్యూటీ డైరెక్టర్ నారాయణ, రిటైర్డ్ డీడీ రంగాచార్యులు, ఏడీ మాధవి ఉన్నారు. -
పురావస్తు తవ్వకాల్లో మరిన్ని విశేషాలు
ఒక్కొక్కటిగా బయటపడుతున్న ప్రాచీన ఆనవాళ్లు నంగునూరు: సిద్దిపేట జిల్లా నర్మెట, పాలమాకులలో పురావస్తుశాఖ ఆధికా రులు కొనసాగిస్తున్న తవ్వకాల్లో ప్రాచీన మానవుడి ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శనివారం నర్మెటలో రెండు పెద్ద మట్టికుండలు, ఇనుపముక్క లభించాయి. ఈ సందర్భంగా పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు నాగరాజు మాట్లాడుతూ రెండు గ్రామాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. నర్మెటలో బయటపడిన రెండు ఎర్రమట్టి కుండలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం అద్భుతమన్నారు. ఆనాడు ఇనుప పనిముట్లు వాడినట్లు స్పష్టమవుతోందన్నారు. వీటన్నింటి మీదా పరిశోధనలు జరుపుతామన్నారు. పాలమాకులలో రెండు చోట్ల తవ్వకాలు జరుపుతున్నామని, ఇక్కడి సమాధులు నర్మెటకు భిన్నంగా ఉండటం ఆసక్తి కల్గిస్తోందన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ రవీందర్‌రెడ్డిలు తవ్వకాలను పరిశీలించి వివరాలు సేకరించారు.