పెద్దపల్లి రూరల్: రెండు వేల ఏళ్లనాటి చారిత్రక ఆనవాళ్లు మట్టిదిబ్బల కింద పదిలంగా ఉన్నాయి. పాచికలు, మట్టిపాత్రలు, కొలత పావులు, చిన్నపాటి రింగ్ వంటి వస్తువులు..అబ్బురపరిచే ఇటుక కట్టడాలు పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. నెలరోజులుగా పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్‌లో రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఇవి లభ్యమయ్యాయి. ఈ తవ్వకాలను బుధవారం పురావస్తుశాఖ డైరెక్టర్ విశాలాచ్చి పరిశీలించారు.
ఆమె మాట్లాడుతూ శాతవాహనులు పెద్దబొంకూర్ నుంచే తమ పాలన సాగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. 50 ఏళ్ల తర్వాత మళ్లీ తవ్వకాలు సాగిస్తున్నామని.. దేశచరిత్రను భావితరాలకు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈ తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు. అప్పట్లో ఈ ప్రాంతవాసులు మట్టితో తయారైన పూసలను మెడలో వేసుకునేవారని లభించిన ఆధారాలు తెలుపుతున్నాయన్నారు.
శంకంతో చేసిన పూసలు, ముల్లాపు పూసలు, పచ్చటి బంగారు రేకులతో చేసిన పూతలు, క్రిస్టల్, గాజు, షేల్ బ్రీడ్స్, కార్నేలియన్ పూసలను కూడా వినియోగించినట్లు సాక్ష్యం ఉందని తెలిపారు. చదరంగ ఆట కోసం ఎముకలతో తయారైన పాచికలను తయారు చేసిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఇనుముతో తయారు చేసిన రింగ్, మట్టిపాత్రలు కూడా తవ్వకాల్లో బయటపడ్డట్టు తెలిపారు. ఇటుక కట్టడాలు, వృత్తాకారపు ఇటుక నిర్మాణాలు, నీటిబావులు, డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని వివరించారు.
సిద్దిపేట జిల్లాలో బృహత్ శిలాయుగపు ఆనవాళ్లు: రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత చారిత్రక పరిశోధనలు చేపట్టిన సిద్దిపేట జిల్లాలో బృహత్ శిలాయుగపు సమాధుల్లో లభించిన మానవ అవశేషాలు క్రీస్తుపూర్వం 600 ఏళ్ల నాటివిగా గుర్తించినట్లు తెలిపారు. పుల్లూరుబండ గ్రామంలో చేపట్టిన తవ్వకాల్లో మానవ ఆకృతి గల స్త్రీ శిల్పం(ఆంత్రోఫామిక్ ఫిమేల్ ఫిగర్) దక్షిణ భారతదేశంలోనే మొదటిగా భావిస్తున్నట్లు చెప్పారు.
నర్మెట్టలోని సమాధిలో లభించిన ఎముకతో తయారు చేసిన(డైమండ్ షేప్) ఆభరణాలు, సమాధిపై పేర్చిన పైకప్పు మూతరాయి భారీ గండశిలను పేర్చి ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చన్నారు. ఇన్‌చార్జి రాములునాయక్, ఇంజినీరింగ్ డెప్యూటీ డైరెక్టర్ నారాయణ, రిటైర్డ్ డీడీ రంగాచార్యులు, ఏడీ మాధవి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment