పురావస్తు తవ్వకాల్లో మరిన్ని విశేషాలు
ఒక్కొక్కటిగా బయటపడుతున్న ప్రాచీన ఆనవాళ్లు
నంగునూరు: సిద్దిపేట జిల్లా నర్మెట, పాలమాకులలో పురావస్తుశాఖ ఆధికా రులు కొనసాగిస్తున్న తవ్వకాల్లో ప్రాచీన మానవుడి ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శనివారం నర్మెటలో రెండు పెద్ద మట్టికుండలు, ఇనుపముక్క లభించాయి. ఈ సందర్భంగా పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు నాగరాజు మాట్లాడుతూ రెండు గ్రామాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. నర్మెటలో బయటపడిన రెండు ఎర్రమట్టి కుండలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం అద్భుతమన్నారు.
ఆనాడు ఇనుప పనిముట్లు వాడినట్లు స్పష్టమవుతోందన్నారు. వీటన్నింటి మీదా పరిశోధనలు జరుపుతామన్నారు. పాలమాకులలో రెండు చోట్ల తవ్వకాలు జరుపుతున్నామని, ఇక్కడి సమాధులు నర్మెటకు భిన్నంగా ఉండటం ఆసక్తి కల్గిస్తోందన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ రవీందర్‌రెడ్డిలు తవ్వకాలను పరిశీలించి వివరాలు సేకరించారు.