జగిత్యాల జిల్లా మునులగుట్టపై చెక్కిన శాసనాలు
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండు వేల ఏళ్లకు పూర్వపు రెండు అపురూప శాసనాలు జగిత్యాల జిల్లాలో వెలుగుచూశాయి. ఇందులో ఒకటి గతంలోనే చరిత్రకారులు గుర్తించారు. రెండోది దానికి చేరువలోనే లభించిన కొత్త శాసనం. శాతవాహనుల తొలి రాజధాని కోటలింగాలకు సమీ పంలోనే ఇవి లభించడం విశేషం. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం మొక్కట్రావుపేటలోని మునులగుట్టపై ఇవి చెక్కి ఉన్నాయి. ఈ గుట్టపై జైనుల స్థావరాలున్నాయని ప్రముఖ చరిత్రకారులు పరబ్రహ్మశాస్త్రి గతంలో పేర్కొనగా, బౌద్ధుల ఆవాసాలని జితేంద్రబాబులాంటి మరికొందరు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన చరిత్రకారుడు రాజారాంసింగ్ ఇక్కడ శాసనమున్నట్టు గతంలో పేర్కొన్నారు.
తాజాగా స్థానిక యువకుడు సముద్రాల సునీల్ వీటిని గుర్తించారని, అవి శాతవాహనులకు సంబంధించినవేనని చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రాకృత భాష, బ్రాహ్మీలిపిలో ఉన్న ఈ శాసనాల్లో ఒకదానిలోని అక్షరాలు బాగా చెరిగిపోయాయి. ఇందులో ఒకవైపు స్వస్తికం, మరోవైపు బౌద్ధంలోని త్రిరత్న గుర్తులున్నాయి. ఇది బుద్ధపాదాలను దానం చేసినపుడు వేయించిన శాసనంగా భావిస్తున్నారు. రెండో శాసనంలో ‘మణికరస సామిరేవస ధమథానం... సివప ఖరితస వాపి’అన్న అక్షరాలున్నాయి. మణికారుడు (వజ్రాల వ్యాపారి) సామిరేవుని ఆదేశంతో సివప అనే వ్యక్తి ఆ ధర్మస్థలంలో బావిని తవ్వించాడన్న అర్థంలో ఉన్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment