ఎవరూ విప్పని ఓ పొడుపు కథ!  | No one is a riddle to unravel story! | Sakshi
Sakshi News home page

ఎవరూ విప్పని ఓ పొడుపు కథ! 

Published Sun, Jun 24 2018 3:03 AM | Last Updated on Sun, Jun 24 2018 3:03 AM

No one is a riddle to unravel story! - Sakshi

చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు.. ఏమిటది? 
కన్నీళ్లు.. 

కిటకిట బండి కిటారి బండి.. 
ఎందరు కూర్చున్నా విరగని బండి. ఏమిటది? 
రైలు బండి.. 

మరి ఇది.. 
71, 194, 38, 1701, 89, 76, 11, 83, 1629,  48, 94, 63, 132, 16, 111, 95, 84, 341, 975.............. 

అర్థం కాలేదా.. 400 కోట్ల ఖజానా తాలూకు తాళం చెవి ఇది.. 200 ఏళ్లుగా వేల మంది ప్రయత్నించినా.. విప్పలేని ఓ పొడుపు కథ ఇది.. 

...అనగనగా ఓ గుప్త నిధి..
ఎక్కడో దాస్తారు.. ఎవరికి పడితే వారికి చిక్కకుండా దాని చిరునామా, నిధి వివరాల గురించి సంకేత భాషలో వివరణ.. ఇలాంటి స్టోరీ లైన్‌లో ‘మోసగాళ్లకు మోసగాడు’ సహా ఎన్నో చిత్రాలు వచ్చాయి.. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కూడా అలాంటి నిధి గురించే.. వందల కిలోల బంగారం, వెండి, వజ్రాలతో కూడిన ఆ నిధి ప్రస్తుత విలువ రూ.400 కోట్లట.. మరి ఆ నిధి.. దానివెనకున్న కథ గురించి తెలుసుకోవాలంటే కొంచెం కష్టమైనా ఓ 200 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.. మరి వెళ్దాం పదండి.. 

...కరెక్టుగా తెలియదు గానీ..
1800 ఆ మధ్య కాలం.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన సాహసి థామస్‌ జె బియల్, మరికొందరు వేట కోసమని వెళ్లినప్పుడు మెక్సికో–కొలరాడో సరిహద్దు వద్ద ఉన్న ఓ గనిలో ఈ నిధిని కనుగొన్నారు. తర్వాతి కాలంలో వర్జీనియాకు తెచ్చి..1820 ఆ టైములో బియల్‌ దాన్ని జాగ్రత్తగా ఓ రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. దాని జాడను కనుగొనేందుకు వీలుగా పలు సంఖ్యలతో కూడిన మూడు సంకేత పత్రాలను రూపొందించాడు. ఆ సంఖ్యల వెనకున్న గుట్టును ఛేదించడానికి ఎంతో మంది ప్రయత్నించారు. ప్రతి సంఖ్య ఓ అక్షరాన్ని లేదా పదాన్ని సూచిస్తుందన్న భావనతో అమెరికా రాజ్యాంగం, మాగ్నా కార్టా, షేక్స్‌ పియర్‌ రాసిన పలు నాటకాలతో పోల్చి చూశారు. లాభం లేకుండా పోయింది. తర్వాత అందరూ దాన్ని మరిచిపోయారు. అయితే.. 19వ శతాబ్దంలో ఓ వ్యక్తి అనుకోకుండా బియల్‌ రెండో సంకేత పత్ర రహస్యాన్ని ఛేదించాడు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనతో దాన్ని పోల్చి చూసినప్పుడు ఈ కోడ్‌ గుట్టు రట్టయింది. 

...అందులో ఏముందంటే.. 
బెడ్‌ఫోర్డ్‌ కౌంటీలో నేను ఆ నిధిని దాచిపెట్టాను. మూడవ పత్రంలో ఇవి ఎవరికి చెందాలన్న వివరాలు ఉన్నాయి. నిధి దాచిపెట్టిన ప్రదేశం బుఫోర్డ్‌కు నాలుగు మైళ్ల దూరంలో ఉంది. కిలోలకొద్దీ బంగారం, వెండి, వజ్రాలు ఉన్నాయి. భూమికి ఆరడుగుల లోతులో భద్రంగా ఇనుప పెట్టెల్లో ఉంచి పాతిపెట్టాను. మొదటి సంకేత పత్రంలో ఈ నిధి కరెక్టుగా ఎక్కడున్నదన్న విషయం ఉంది. కాబట్టి.. దాన్ని కనుగొనడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.. 

...దీంతో మళ్లీ వేట మొదలైంది.  
మిగతా పత్రాల రహస్యాన్ని ఛేదించాలని చాలా మంది ప్రయత్నించారు. దీనికితోడు వర్జీనియా చట్టాల ప్రకారం భూమిలో నిధులు వంటివి దొరికితే.. కనుగొన్నవారికే అవి సొంతం. దీంతో బెడ్‌ఫోర్డ్‌ ఏరియాను జల్లెడ పట్టారు. కొందరైతే.. నిధి జాడ కోసం మంత్రగాళ్లను, ఆధ్మాత్మిక గురువులనూ ఆశ్రయించారు. అర్ధరాత్రి సమయాల్లో వేరేవారి భూముల్లోకి ప్రవేశించి మరీ తవ్వకాలు మొదలుపెట్టారు. కొందరు శ్మశానాలను తవ్వేశారు. అరెస్టులు జరిగాయి. కోట్లలో ఖర్చు చేసి.. అప్పులు పాలైన వారూ ఉన్నారు. అమెరికా సైన్యం కూడా రంగంలోకి దిగింది. సిగ్నల్‌ ఇంటెలిజెన్సీ సర్వీసు వాళ్లు.. తమ శిక్షణలో భాగంగా బియల్‌ నిధి జాడను కనుగొనాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించేవారు. దీనిపై పుస్తకాలు వచ్చాయి.. తీసిన షార్ట్‌ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు అవార్డులూ గెలుచుకున్నాయి. కానీ ఆ నిధిని మాత్రం ఎవరూ గెలుచుకోలేకపోయారు.  

...అందరికీ అనుమానాలు మొదలయ్యాయి.. 
అసలు నిధి ఉందా.. బియల్‌ అనేవాడు అసలు ఒకడున్నాడా అని.. ఎందుకంటే.. ఈ బియల్‌ రహస్య సంకేతాల పత్రాలు 1885లో బియల్‌ పేపర్స్‌ అంటూ ముద్రించిన ఓ పాంప్లెట్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం 1822లో బియల్‌ ఈ సంకేత పత్రాలు ఉన్న పెట్టెను రాబర్ట్‌ మారిస్‌ అనే వ్యక్తికి ఇచ్చాడు. తమ బృందం మరో సాహస యాత్రకు బయల్దేరుతోందని.. 10 ఏళ్ల వ్యవధిలో తాను లేదా తన బృందంలోని ఎవరూ తిరిగి రాకపోతే.. దాన్ని తెరవమని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత సెయింట్‌ లూయిస్‌ నుంచి బియల్‌ మారిస్‌కు ఓ ఉత్తరం రాశాడు. ఓ వ్యక్తి ఆ పత్రాలకు సంబంధించిన కీని పంపుతాడని బియల్‌ ఆ ఉత్తరంలో చెప్పాడు. అయితే.. అది ఎప్పటికీ రాలేదు. బియల్‌ కూడా రాలేదు. దీంతో 1945లో మారిస్‌ పెట్టెను తెరిచాడు. 

ఆ పొడుపు కథలను విప్పడానికి ప్రయత్నించాడు.. సాధ్యం కాలేదు.. తర్వాత ఆ పత్రాలు చేతులు మారి.. బియల్‌ పేపర్స్‌ పాంప్లెట్‌ ద్వారా వెలుగులోకి వచ్చాయి. కొందరు చరిత్రకారులు పరిశోధించగా.. 1822లో సెయింట్‌ లూయిస్‌ పోస్టల్‌ డిపార్టుమెంట్‌ వినియోగదారుల జాబితాలో బియల్‌ పేరు ఉంది.  దీంతో బియల్‌ పత్రాలను నమ్మేవారి సంఖ్య పెరిగింది.. 
ఆ నిధి అక్కడే బెడ్‌ఫోర్డ్‌ కౌంటీలోనే ఉంది..  మరి.. మీరు ప్రయత్నిస్తారా? వందల కోట్లకు వారసులవుతారా? 
– సాక్షి, తెలంగాణ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement