సినిమాల్లో, కథల్లో రాజుల కాలం నాటి గుప్త నిధుల కోసం అన్వేషిస్తుంటారు. ఎన్నో కష్టాలు అనుభవించి నిధిని కనుగొంటారు. ఆ సంపదతో గొప్పవాళ్లుగా మారిపోతుంటారు. ఇదీ అలాంటిదే. కానీ నిజంగా జరిగిన కథ. సముద్రంలో టన్నులకొద్దీ బంగారంతో మునిగిపోయిన ఓడను కనిపెట్టినా.. జైలులో మగ్గుతున్న ఓ ఆధునిక ‘ట్రెజర్ హంటర్’వ్యథ. చివరికి ఓ న్యాయమూర్తి తీర్పుతో త్వరలో విడుదల కాబోతున్న బంగారం నిధి వేటగాడు, శాస్త్రవేత్త ‘టామీ గ్రగరీ థాంప్సన్’గాథ. – సాక్షి సెంట్రల్ డెస్క్
ఓ నిధి వేటగాడి నిజమైన కథ..
అది 1857వ సంవత్సరం.. సుమారు 21 టన్నుల బంగారం తీసుకుని ఎస్‌ఎస్ సెంట్రల్ అమెరికా అనే ఓడ అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్‌కు బయలుదేరింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ తుఫానుతో సముద్రం మధ్యలోనే ఓడ మునిగిపోయింది. ‘షిప్ ఆఫ్ గోల్డ్’గా పేరుపొందిన ఆ ఓడ, దానిలోని బంగారం కోసం ఎందరో అన్వేషిoచినా జాడ దొరకలేదు.
అలా బంగారం వేటకు దిగినవారిలో శాస్త్రవేత్త టామీ గ్రెగరీ థాంప్సన్ నేతృత్వంలోని బృందం ఒకటి. అప్పటికే కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్న థాంప్సన్.. 1988లో సోనార్ సాయంతో సముద్రం అడుగున జల్లెడ పడుతుండగా ‘షిప్ ఆఫ్ గోల్డ్’జాడ పట్టేసుకున్నాడు.
బంగారం కరిగించి నాణాలుగా మార్చి..
అమెరికాలోని కొందరు ధనికులు థాంప్సన్ పరిశోధనకు స్పాన్సర్ చేశారు. నిధి దొరికితే ఎవరి వాటా ఎంతెంత అని ముందే ఓ మాట అనుకున్నారు. 1988లో ఓడ జాడ దొరికినా.. బంగారం నిధిని రూఢీ చేసుకుని, వెలికి తీయడానికి కొన్నేళ్లు పట్టింది. బయటికి తీసిన బంగారాన్ని కరిగించి నాణాలుగా మార్చారు.
అలా మార్చిన బంగారు నాణాల్లో 500 నాణాలు మాయమయ్యాయి. అది చేసినది థాంప్సన్. వాటిని ఏం చేశాడు? తీసుకెళ్లి.. రెండు అమెరికా ఖండాల మధ్య ఉండే ‘బెలిజ్’అనే చిన్న దేశంలో ఓ ట్రస్టుకు దానమిచ్చాడు. అంతే అంతకన్నా ఒక్కముక్క కూడా బయటపెట్టలేదు.
పదేళ్లుగా జైల్లోనే.. త్వరలోనే విడుదల..
అధికారులు 2015లో థాంప్సన్‌ను జైల్లో పెట్టారు. నాణాల జాడ చెప్పనంత కాలం.. రోజుకు వెయ్యి డాలర్లు (సుమారు రూ.87 వేలు) జరిమానా చెల్లించాలని ఆదేశించారు. సుమారు పదేళ్లుగా థాంప్సన్ జైల్లోనే ఉన్నారు. ఆయన చెల్లించాల్సిన జరిమానా.. 33,35,000 డాలర్లకు (మన కరెన్సీలో రూ.29 కోట్లకు) చేరింది. ఆయన మాయం చేసిన బంగారు కాయిన్ల విలువ 2.5 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.22 కోట్లు)గా అంచనా వేశారు. థాంప్సన్ పదేళ్లుగా జైల్లోనే ఉన్నారు.
వయసు ఇప్పుడు 72 ఏళ్లు. ఆయన మాయం చేసిన బంగారం విలువ కంటే.. చెల్లించాలన్న జరిమానానే చాలా ఎక్కువైపోయింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఓ న్యాయమూర్తి థాంప్సన్‌ను విడుదల చేయాలని తాజాగా తీర్పు ఇచ్చారు. కానీ తన పరిశోధనకు స్పాన్సర్ చేసిన ధనికులు పెట్టిన ఓ క్రిమినల్ కేసులో థాంప్సన్ రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. ఆ తర్వాతే బయటికొస్తాడన్నమాట.
ఆ బంగారం ఎవరికి ఇచ్చినదీ ఇప్పటికీ థాంప్సన్ బయటపెట్టలేదు. ట్రస్టు ద్వారా పేదలకు సాయం కోసం ఇచ్చిన ‘గోల్డెన్’ హీరోనా? సొమ్ము దోచేసుకున్న విలనా?
Comments
Please login to add a commentAdd a comment