
హైదరాబాద్ నుంచి కాలి నడకన బయలుదేరిన నారాయణఖేడ్ వాసులు
హైదరాబాద్ టు నారాయణఖేడ్ మూటా ముల్లెతో వలస కూలీల ఇంటిబాట ఎర్రటి ఎండలో మాస్కులు ధరించి చిన్నారులు సైతం..సంగారెడ్డిలో ఆహారం అందించిన పోలీసులుప్రత్యేక వాహనంలో తరలింపు
ఎర్రటి ఎండ.. నిర్మానుష్యమైన రోడ్డు.. చిన్నారులు మాస్కులు ధరించి బుడిబుడి అడుగులు వేస్తుండగా.. వెనకాల మూటా ముల్లె్ల నెత్తిన పెట్టుకొని అమ్మానాన్నలను అనుకరిస్తున్నారు. ఆకలి.. దప్పికతో అలమటిస్తూ.. అడుగు తీసి అడుగు వేయలేని దయనీయ పరిస్థితి వారిది. గమ్యం చేరడమే లక్ష్యంగా.. వందల కిలో మీటర్ల మేర నడుస్తూ నరకయాతన అనుభవించారు. ఇది కరోనా వైరస్ నేపథ్యంలో వలస కూలీలు పడుతున్న పాట్లు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తుండటంతో కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పని చేయనిదే పూట గడవని వారికి శరాఘాతంగా మారింది. దీంతో వారంతా ఇంటి బాట పడుతున్నారు. పిల్లాపాపలతో బయలుదేరుతున్నారు. రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో వందల కిలో మీటర్ల మేర కాలినడన బయలుదేరుతున్నారు.
ఎర్రటి ఎండలో మాస్కులు ధరించి హైదరాబాద్ నుంచి కాలినడన వెళుతున్న నారాయణఖేడ్ చిన్నారులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, బిచ్కుంద, పెద్దశంకరంపేట, కంగ్టికి చెందిన వలస కూలీలు హైదరాబాద్ కూకట్‌పల్లి, మియాపూర్, రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం.. మూడు రోజులుగా పనులు లేకపోవటంతో తమ సొంత ఊర్లకు కాలినడకన బయలుదేరారు. 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామాలకు ఉదయం ఏడు గంటలకు మొదలు పెట్టిన నడక.. మధ్యాహ్నం వరకు సంగారెడ్డికి చేరుకుంది. రోడ్డుపై చిన్న పిల్లలు సైతం మాస్కులు ధరించి భారమైన అడుగులు వేస్తూ నడవడం చూపరులను కలచివేసింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, టౌన్ సీఐ వెంకటేశం, రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ వారికి ఆహారం అందించారు. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి సురక్షితంగా వారి ఊర్లకు పంపించారు. ఈ సందర్భంగా ఆపత్కాలంలో ఆదుకున్న పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు. – బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
లాక్‌డౌన్‌తో సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామస్తులు హరిద్వార్‌లో చిక్కుకున్నారు. తమను కాపాడాలని బాధిత కుటుంబీకులు బుధవారం చిలుకూరు పోలీస్‌స్టేషన్‌లో, కలెక్టర్‌కు తమ సమస్యను విన్నవించారు. ఇక్కడికి చెందిన 12 మంది ఈ నెల 15న రైలులో తీర్థయాత్రలకు వెళ్లారు. వారు ఈ నెల 22న హరిద్వార్ నుంచి కాశీకి వెళ్లాల్సి ఉండగా జనతాకర్ఫ్యూతో అక్కడే ఆగిపోయారు. ఆ తర్వాత లాక్‌డౌన్ ప్రకటించడంతో రవాణా స్తంభించిపోయింది. ప్రస్తుతం హరిద్వార్ గాంధీ హరిజన ఆశ్రమంలో ఉన్నట్లుగా వారు తెలిపారు. –చిలుకూరు
Comments
Please login to add a commentAdd a comment